Good News for Coffee Lovers: కాఫీ ప్రియులకు గుడ్ న్యూస్..పరిశోధనల్లో తేలిన షాకింగ్ నిజాలు!
షాకింగ్ నిజాలు!

Good News for Coffee Lovers: ఉదయం లేవగానే వేడి వేడిగా ఒక కప్పు కాఫీ పడకపోతే చాలా మందికి రోజూ గడవదు. అలసటను దూరం చేసి, తక్షణ ఉత్సాహాన్ని ఇచ్చే కాఫీని కేవలం ఒక ఎనర్జీ డ్రింక్‌గా మాత్రమే చూస్తాం. కానీ, ప్రతిరోజూ కాఫీ తాగడం వల్ల మన శరీరంలోని అత్యంత కీలకమైన అవయవమైన కాలేయం లేదా లివర్ సురక్షితంగా ఉంటుందని ప్రముఖ ఆరోగ్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ప్రాణాంతక కాలేయ వ్యాధుల ముప్పును తగ్గించడంలో కాఫీ కీలక పాత్ర పోషిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అసలు కాఫీ కాలేయానికి ఎలా రక్షణగా నిలుస్తుంది? మనం కాఫీ తాగినప్పుడు అది శరీరంలో విచ్ఛిన్నమై 'పారాజంతిన్' (Paraxanthine) అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది. ఇది కాలేయ కణజాలం దెబ్బతినకుండా చూస్తుంది. ముఖ్యంగా లివర్ సిర్రోసిస్, ఫ్యాటీ లివర్ మరియు లివర్ క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని కాఫీ గణనీయంగా తగ్గిస్తుంది. కాఫీలో ఉండే కెఫీన్‌తో పాటు యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా మరియు ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటాయి.
అనేక అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారం.. క్రమం తప్పకుండా కాఫీ తాగే వారిలో లివర్ ఎంజైమ్‌ల స్థాయిలు సమతుల్యంగా ఉంటున్నట్లు తేలింది. కాలేయంలో టాక్సిన్స్ లేదా వ్యర్థాలు చేరకుండా కాఫీ ఒక డీటాక్స్ ఏజెంట్‌లా పనిచేస్తుంది. ఇప్పటికే స్వల్పంగా లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు సైతం వైద్యుల సలహాతో పరిమితంగా కాఫీ తీసుకోవడం వల్ల వ్యాధి తీవ్రత పెరగకుండా అదుపులో ఉంటుందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. అయితే, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి.
లివర్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది కదా అని కాఫీని అతిగా తాగకూడదు. అలాగే ఎక్కువ చక్కెర, అధికంగా పాలు లేదా క్రీమ్ కలిపిన కాఫీ కంటే.. చక్కెర లేని బ్లాక్ కాఫీ లేదా తక్కువ చక్కెర ఉన్న కాఫీ కాలేయానికి మరింత మేలు చేస్తుంది. రోజుకు రెండు నుండి మూడు కప్పుల పరిమిత మోతాదులో కాఫీ తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో ఉత్తమం.

