Health Is Wealth: ఈ ఆధునిక జీవనశైలిలో చాలా మంది గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం, మలబద్ధకం మరియు అసిడిటీ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. వీటిని సాధారణ ఆరోగ్య సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేయడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇవి మీ ప్రేగుల ఆరోగ్యం దెబ్బతిన్నదనడానికి సంకేతాలు. జీర్ణక్రియ సక్రమంగా సాగాలన్నా, శరీరంలో రోగనిరోధక శక్తి పెరగాలన్నా కడుపు లేదా ప్రేగుల ఆరోగ్యం చాలా ముఖ్యం. మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి రోజూ తినే ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోండి

యాపిల్స్, అరటిపండ్లు, నారింజ వంటి పండ్లతో పాటు క్యారెట్, పాలకూర, బ్రోకోలి, చిలగడదుంపలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోండి. వీటిలో ఫైబర్, శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ప్రేగులలో ఉండే మంచి బ్యాక్టీరియా వృద్ధికి ఎంతగానో తోడ్పడతాయి.

పీచు పదార్థాలు ఉన్న ఆహారానికి ప్రాధాన్యత

ఓట్స్, శనగలు, ఉలవలు, పెసర్లు వంటి పప్పు ధాన్యాలు, అవిసె గింజలు, చియా గింజలు, డ్రై ఫ్రూట్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి మలబద్ధకం సమస్యను తగ్గించి, జీర్ణక్రియను సులభతరం చేస్తాయి.

హోల్ గ్రెయిన్స్ ఎంచుకోండి

మైదా, పాలిష్ చేసిన బియ్యం వంటి ప్రాసెస్ చేసిన ధాన్యాలకు బదులుగా దంపుడు బియ్యం, జొన్నలు, సజ్జలు, బార్లీ మరియు హోల్ వీట్ వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోండి. ఇవి కడుపు నిండిన భావనను కలిగించడమే కాకుండా ప్రేగుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

ప్రోబయోటిక్, ప్రీబయోటిక్ ఆహారాలు

పెరుగు, ఇతర పులియబెట్టిన పదార్థాలు ప్రోబయోటిక్స్‌కు మంచి వనరులు. అలాగే వెల్లుల్లి, ఉల్లిపాయలు, అరటిపండ్లు, ఓట్స్ వంటివి ప్రీబయోటిక్ ఆహారాలుగా పనిచేస్తూ.. ప్రేగులలోని మంచి బ్యాక్టీరియాకు తగిన పోషణను అందిస్తాయి.

వీటికి దూరంగా ఉండాలి:

జంక్ ఫుడ్, నూనెలో వేయించిన పదార్థాలు, చక్కెర ఎక్కువగా ఉండే స్వీట్లు, సాఫ్ట్ డ్రింక్స్ అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాలు ప్రేగుల ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తాయి. అంతేకాకుండా వైద్యుల సలహా లేకుండా యాంటీబయాటిక్స్ వాడటం కూడా మంచిది కాదు.

ఆరోగ్యకరమైన అలవాట్లు కూడా ముఖ్యం:

మంచి ఆహారంతో పాటు సరైన సమయానికి తినడం, ఆహారాన్ని బాగా నమిలి మింగడం, రోజుకు సరిపడా నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. వీటితో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం, తగినంత నిద్ర, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story