Heatstroke Can Happen Even Indoors: ఇంట్లో ఉన్నా సరే వడదెబ్బ తగలొచ్చు.. ఎలాగో తెలుసుకోండి.
ఎలాగో తెలుసుకోండి.

Heatstroke Can Happen Even Indoors: వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలో మనం తరచుగా వినే మాట ‘వడదెబ్బ’. అసలు వడదెబ్బ అంటే ఏమిటి? మన శరీరంలో ఏం జరుగుతుంది? ఎండలో తిరగని వారికి కూడా వడదెబ్బ తగులుతుందా? ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా ఎండాకాలంలో అధిక వేడి కారణంగా మన ఒంట్లోని నీరంతా చెమట రూపంలో బయటకు వస్తుంటుంది. ఇది ఒక పరిమితి వరకు మన శరీరాన్ని చల్లబరుస్తుంది. కానీ, ఇది ఇలాగే కొనసాగితే.. శరీరంలో ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. ఒకానొక దశలో శరీరానికి చెమట పట్టడం కూడా ఆగిపోతుంది. దాంతో చర్మం పొడిబారిపోయి, శరీర ఉష్ణోగ్రత వేగంగా పెరిగిపోతుంది.
దీనివల్ల తీవ్రమైన జ్వరం ముంచుకొస్తుంది. శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే పెరిగి ఏకంగా 105 డిగ్రీల ఫారన్‌హీట్‌ను దాటేస్తుంది. ఒంట్లో నీరు, రక్తం పరిమాణం తగ్గిపోవడం వల్ల రక్తపోటు (Blood Pressure) ఒక్కసారిగా పడిపోతుంది. ఈ పరిస్థితినే వడదెబ్బ లేదా ఎండదెబ్బ అంటాం. సరైన సమయంలో చికిత్స అందకపోతే ఇది ప్రాణాపాయానికి దారితీస్తుంది.
చాలామంది వడదెబ్బ అంటే కేవలం బయట ఎండలో తిరిగితేనే వస్తుందని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఇంట్లో పొయ్యి దగ్గర ఎక్కువసేపు ఉన్నా, ఫ్యాక్టరీల్లోని ఫర్నేస్‌ల వంటి సెక్షన్లలో పనిచేసినా ఈ ముప్పు ఉంటుంది. అంతేకాదు.. గాలి వెలుతురు సరిగా లేని గదుల్లో ఎక్కువమంది గుమిగూడి ఉన్నా సరే, శరీర ఉష్ణోగ్రత పెరిగి వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. అందుకే దాహం వేసినా వేయకపోయినా మంచినీరు తాగుతూ ఉండండి. శరీరంలో తేమ తగ్గకుండా చూసుకోండి. జాగ్రత్తగా ఉండండి..

