Baby Sleep Daily: మీ పాప రోజుకు ఎన్ని గంటలు నిద్రపోతోంది? ఈ విషయాలు తెలుసుకోండి.
ఈ విషయాలు తెలుసుకోండి.

Baby Sleep Daily: సాధారణంగా పిల్లలు ఎప్పుడూ నిద్రపోతుంటారని మనం అనుకుంటాం. కానీ ఆ నిద్ర వెనుక వారి భవిష్యత్తు దాగి ఉందన్న విషయం మీకు తెలుసా? పసిపిల్లల ఎదుగుదలలో నిద్ర అనేది ఆహారం కంటే తక్కువేమీ కాదు.
నిపుణుల పరిశోధనల ప్రకారం.. ఏడాది లోపు పసిపిల్లలకు రోజుకు కనీసం 12 నుండి 16 గంటల నిద్ర చాలా అవసరం. అలాగే రెండేళ్ల లోపు పిల్లల విషయానికి వస్తే.. వారు రోజుకు 8 నుండి 14 గంటల పాటు గాఢ నిద్రలో ఉండాలని వైద్యులు చెబుతున్నారు. అంటే పిల్లలు వారి రోజులో సగభాగాన్ని నిద్రలోనే గడపడం వారి ఆరోగ్యానికి ఎంతో మేలు.
అసలు పిల్లలు ఇన్ని గంటలు ఎందుకు నిద్రపోవాలి? దీని వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. పిల్లల మెదడు చురుగ్గా పని చేయాలన్నా, వారి శారీరక ఎదుగుదల బాగుండాలన్నా ఈ విశ్రాంతి ఎంతో ముఖ్యం. నిద్రలో ఉన్నప్పుడే వారి శరీరంలో ఎదుగుదలకు సంబంధించిన హార్మోన్లు విడుదలవుతాయి. మెదడు కణాల అభివృద్ధి కూడా ఈ సమయంలోనే వేగంగా జరుగుతుంది."
సరిపోయినంత నిద్ర ఉన్న పిల్లలు ఎదిగిన తర్వాత.. ఇతరుల కంటే భిన్నంగా ఉంటారని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. వారిలో ఆలోచనా శక్తి అద్భుతంగా ఉంటుంది. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దానిని పరిష్కరించే నైపుణ్యం, సమాచారాన్ని నిక్షిప్తం చేసుకునే జ్ఞాపకశక్తి వారి సొంతమవుతాయి. అన్నిటికంటే ముఖ్యంగా, వారు మానసికంగా ఎంతో దృఢంగా, ఉల్లాసంగా ఉంటారు. అందుకే తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే.. మీ పిల్లల నిద్రకు ఆటంకం కలగకుండా చూడండి.

