Essential Habits Every Woman 30s: ఒక స్త్రీ తన జీవితంలో ఎన్నో దశలను దాటుకుంటూ వస్తుంది. వయసు పెరిగే కొద్దీ ఆమె శరీరంలో బాహ్యంగానే కాకుండా అంతర్గతంగానూ ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా 30 ఏళ్ల వయసు దాటిన తర్వాత మహిళల బాడీ మెటబాలిజం నెమ్మదించడం, హార్మోన్లలో హెచ్చుతగ్గులు రావడం, చర్మం తేమను కోల్పోవడం వంటి మార్పులు మొదలవుతాయి. అయితే చాలా మంది మహిళలు కుటుంబ బాధ్యతలు, పిల్లల పెంపకం, ఆఫీస్ పనుల హడావిడిలో పడి తమ ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ నిర్లక్ష్యం భవిష్యత్తులో తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మరి వృద్ధాప్యంలోనూ నిత్య యవ్వనంగా, దృఢంగా, ఎనర్జిటిక్‌గా ఉండాలంటే 30 ఏళ్లు దాటిన మహిళలు ఎలాంటి అలవాట్లను చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

రోజంతా ఎనర్జీ ఇచ్చే మోర్నింగ్ రూటీన్

ఉదయం నిద్రలేవగానే పనుల కోసం కంగారు పడకుండా మీ రోజును ప్రశాంతంగా ప్రారంభించండి. పరగడుపున పుష్కలంగా నీరు త్రాగాలి. ఆ తర్వాత కనీసం 10 నిమిషాల పాటు బాడీ స్ట్రెచింగ్ వ్యాయామాలు, మైండ్ రిలాక్సేషన్ కోసం ధ్యానం లేదా దీర్ఘ శ్వాస సాధన చేయాలి. ఇది రోజంతా మిమ్మల్ని ఒత్తిడి లేకుండా ఉంచుతుంది.

డైట్ పట్ల ప్రత్యేక శ్రద్ధ

ముప్పై ఏళ్ల తర్వాత జీవక్రియలు మందగిస్తాయి కాబట్టి బరువు పెరిగే ఛాన్స్ ఎక్కువ. అందుకే పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి. మీ రోజువారీ మెనూలో ఆకుకూరలు, తాజా పండ్లు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, పాలు మరియు ప్రొటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ మరియు ప్రాసెస్ చేసిన ఆహారపదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

వర్కౌట్‌తో నో కాంప్రమైజ్..

కుటుంబ బాధ్యతల నెపంతో ఫిట్‌నెస్‌ను అస్సలు వదిలేయకండి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు మీ కోసం సమయం కేటాయించండి. వాకింగ్, యోగా, సైక్లింగ్ లేదా మీకు నచ్చిన ఏదైనా శారీరక శ్రమను అలవాటు చేసుకోండి. ఇది బరువును అదుపులో ఉంచడమే కాకుండా వయసుతో పాటు వచ్చే ఎముకల బలహీనతను నివారిస్తుంది.

బ్యూటీ స్లీప్ చాలా ముఖ్యం

తగినంత నిద్ర లేకపోతే అది ముఖంపై ముడతలు, అలసట, మానసిక ఒత్తిడి మరియు హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. కాబట్టి రాత్రిపూట కనీసం 7 నుండి 8 గంటల పాటు ప్రశాంతమైన నిద్ర అవసరం. పడుకునే కనీసం అరగంట ముందే స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను పక్కన పెట్టేయడం మంచిది.

చర్మం, జుట్టు సంరక్షణ

30 ఏళ్లు దాటాక చర్మంలోని సహజ సిద్ధమైన తేమ, కొల్లాజెన్ తగ్గిపోవడం వల్ల ముడతలు, మచ్చలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి స్కిన్ కేర్ రూటీన్‌ను నిర్లక్ష్యం చేయవద్దు. చర్మాన్ని ఎల్లప్పుడూ క్లీన్‌గా ఉంచుకుంటూ మంచి మాయిశ్చరైజర్ రాయాలి. ఎండలోకి వెళ్లే ముందు ఖచ్చితంగా సన్‌స్క్రీన్ వాడాలి. అలాగే లోపలి నుండి గ్లో రావడం కోసం రోజుకు 3-4 లీటర్ల నీరు తాగాలి.

మెంటల్ హెల్త్‌కు ప్రాధాన్యత ఇవ్వండి

సమాజం, కుటుంబం గురించి ఆలోచించే మీరు మీ మనసు గురించి కూడా ఆలోచించాలి. రోజూ మీకంటూ కొద్దిగా సమయం కేటాయించుకుని మీకు నచ్చిన హాబీలు, సంగీతం వినడం లేదా స్నేహితులు, కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడటం చేయండి. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.

రెగ్యులర్ హెల్త్ చెకప్స్

ముప్పై ఏళ్లు దాటిన మహిళలు కనీసం ఏడాదికి ఒకసారైనా మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి. ముఖ్యంగా రక్తపోటు , బ్లడ్ షుగర్, థైరాయిడ్ , విటమిన్ డి, విటమిన్ బి12, ఇతర అవసరమైన స్త్రీ సంబంధిత హార్మోన్ల పరీక్షలను క్రమం తప్పకుండా పర్యవేక్షించుకోవాలి. దీనివల్ల ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నా ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story