Brown Bread You Eat Really Genuine: ఆధునిక కాలంలో ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టే చాలామంది.. బరువు తగ్గడానికో లేదా షుగర్ లెవల్స్ అదుపులో ఉంచుకోవడానికో తెల్లటి బ్రెడ్ తినడం మానేస్తున్నారు. దానికి ప్రత్యామ్నాయంగా ఆరోగ్యానికి ఎంతో మంచిదని భావించి.. మార్కెట్‌లో కాస్త ఎక్కువ ధర పెట్టి మరీ బ్రౌన్ బ్రెడ్ కొనుగోలు చేస్తున్నారు. అయితే మీరు కూడా ఇదే చేస్తున్నారా? ఒక షాకింగ్ నిజాన్ని కచ్చితంగా తెలుసుకోవాలి..

మార్కెట్‌లో దొరికే చాలా బ్రాండ్ల బ్రౌన్ బ్రెడ్‌లు అసలైన గోధుమలతో చేసినవి కావు. అవి కేవలం కృత్రిమ రంగులు కలిపిన సాధారణ మైదా పిండి మాత్రమేనని పలు నివేదికలు చెబుతున్నాయి. భారతదేశంలోని కొన్ని ప్రముఖ బ్రాండ్‌లు కూడా ఈ పద్ధతినే అనుసరిస్తుండటం గమనార్హం. మరి మనం తినే బ్రౌన్ బ్రెడ్ అసలైందో కాదో ఎలా గుర్తించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

క్యారమెల్ కలర్ మాయాజాలం.. మైదాతో వచ్చే నష్టాలు..

సాధారణ వైట్ బ్రెడ్‌కు, అసలైన బ్రౌన్ బ్రెడ్‌కు మధ్య ప్రధాన వ్యత్యాసం వాటి తయారీలో వాడే పదార్థాలే. వైట్ బ్రెడ్‌ను మైదాతో చేస్తే, బ్రౌన్ బ్రెడ్‌ను తవుడుతో కూడిన హోల్ వీట్ తో చేయాలి.

కానీ, చాలా కంపెనీలు మైదాతోనే బ్రెడ్ తయారు చేసి.. అది తెల్లగా కనిపించకుండా ఉండటం కోసం అందులో క్యారమెల్ కలర్ అనే కృత్రిమ రంగును కలుపుతున్నాయి. దీనివల్ల మైదా కాస్తా గోధుమ రంగులోకి మారిపోతుంది. ఇటువంటి రంగు బ్రెడ్‌లను తినడం వల్ల శరీరానికి ఎలాంటి ఫైబర్ లేదా పోషకాలు అందకపోగా, శరీరంలో మైదా పేరుకుపోయి తీవ్రమైన జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి.

మీ బ్రౌన్ బ్రెడ్ అసలైందో కాదో ఎలా గుర్తించాలి?

మీ వంటింట్లో ఉన్న బ్రౌన్ బ్రెడ్ ప్యాకెట్ నిజమైనదో కాదో తెలుసుకోవడానికి ఈ క్రింది తేడాలను గమనించండి:

నోటికి అంటుకుందా?:

మైదాతో చేసిన నకిలీ బ్రౌన్ బ్రెడ్ చాలా సాఫ్ట్‌గా, మృదువుగా ఉంటుంది. దీనిని తిన్నప్పుడు అది నోటి లోపలి పైభాగానికి పళ్ళకు జిగటగా అంటుకుంటుంది. అదే అసలైన గోధుమ బ్రెడ్ అయితే పళ్లకు అంటుకోదు.

ఆకృతి, బరువు: 100% గోధుమ పిండితో చేసిన బ్రెడ్ కొంచెం గట్టిగా, బరువుగా ఉంటుంది. దీనిని నమలడానికి కాస్త సమయం పడుతుంది.

ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చెక్ చేయండి:

బ్రెడ్ ప్యాకెట్ వెనుక ఉండే పదార్థాల జాబితాలో మొదటి పేరు హోల్ వీట్ ఫ్లోర్ లేదా ఆటా అని ఉండాలి. ఒకవేళ అక్కడ రిఫైన్డ్ వీట్ ఫ్లోర్ లేదా మైదా అని ఉండి, దాని పరిమాణం 50% కంటే ఎక్కువగా ఉంటే అది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.

ఫైబర్ శాతాన్ని చూడండి:

నిజమైన గోధుమ రొట్టెలో గోధుమ ఊక ఉంటుంది కాబట్టి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఒక బ్రెడ్ ముక్కలో కనీసం 3 గ్రాముల ఫైబర్ ఉండాలి. ఫైబర్ లేని మైదా బ్రెడ్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరిగి, ఇన్సులిన్ నిరోధకతకు, బరువు పెరగడానికి దారితీస్తుంది.

కొనేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి..

కొన్ని కంపెనీలు ప్యాకెట్ పైన 100% గోధుమలు అని రాసినప్పటికీ లోపల మైదాను మిక్స్ చేస్తుంటాయి. కాబట్టి బ్లైండ్‌గా ఫ్రంట్ లేబుల్స్ నమ్మకండి.

మల్టీగ్రెయిన్ బ్రెడ్ కొనేటప్పుడు కూడా అందులో ఎంత శాతం గోధుమలు లేదా ఇతర ధాన్యాలు ఉన్నాయో వెనుక వైపు చెక్ చేయండి.

వీలైనంత వరకు ప్యాకెట్ మీదహోల్ గ్రెయిన్, నో యాడెడ్ కలర్ అని స్పష్టంగా రాసి ఉన్న బ్రాండ్లను ఎంచుకోవడం అత్యంత సురక్షితం.

PolitEnt Media

PolitEnt Media

Next Story