Your Child Not Growing Taller as Expected: పిల్లల ఎత్తు పెరగడం లేదా? ఈ పోషకాల లోపమే కారణం కావచ్చు..!
ఈ పోషకాల లోపమే కారణం కావచ్చు..!

Your Child Not Growing Taller as Expected: ఈ మధ్య కాలంలో చాలా మంది తల్లిదండ్రులను వేధిస్తున్న ప్రధాన సమస్య.. పిల్లల ఎత్తు సరిగ్గా పెరగకపోవడం. తోటి పిల్లలతో పోల్చితే తమ పిల్లలు పొట్టిగా ఉంటున్నారని ఎంతో మంది ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా పిల్లల ఎత్తు, శారీరక ఎదుగుదల అనేది వారి జన్యువులపైఆధారపడి ఉంటుందని మనకు తెలుసు. అయితే, కేవలం జన్యువులే కాకుండా సరైన పోషకాహారం కూడా అంతే ముఖ్యమని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. శరీరానికి అవసరమైన కొన్ని ముఖ్యమైన పోషకాల లోపం వల్ల పిల్లల ఎదుగుదల మందగిస్తుంది. మరి పిల్లల ఎదుగుదలకు పోషకాలు ఎందుకు అవసరం? వారు ఎత్తు పెరగడానికి ఎలాంటి ఆహారం అందించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఎదుగుదలకు పోషకాలు ఎందుకు ముఖ్యం?
బాల్యం, కౌమారదశ అనేవి మానవ శరీర అభివృద్ధిలో అత్యంత కీలకమైన దశలు. ఈ సమయంలోనే ఎముకలు, కండరాలు వేగంగా విస్తరిస్తాయి. ఈ వేగవంతమైన మార్పులకు శరీరానికి తగినంత ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు అందడం ఎంతో అవసరం. ఆహారంలో వీటి లోపం ఏర్పడితే, శరీర సాధారణ ఎదుగుదల ప్రక్రియ నెమ్మదిస్తుంది.
పిల్లల ఎత్తు పెంచే సూపర్ పోషకాలు ఇవే..
పిల్లలు ఆరోగ్యకరమైన ఎత్తు మరియు బరువు పెరగడానికి ఈ క్రింది పోషకాలు నిత్యం వారి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
ప్రోటీన్: ఇది శరీరంలోని కండరాలు, కణజాలాల నిర్మాణానికి, మరమ్మత్తుకు బూస్టర్‌లా పనిచేస్తుంది.
లభించే పదార్థాలు: పాలు, గుడ్లు, పప్పుధాన్యాలు, సోయాబీన్స్, చికెన్, పనీర్.
కాల్షియం : ఎముకలు బలంగా మారడానికి మరియు వాటి పొడవు పెరగడానికి కాల్షియం అత్యంత కీలకం.
లభించే పదార్థాలు: పాలు, పెరుగు, చీజ్, ఆకుకూరలు.
విటమిన్ డి : మనం తీసుకునే ఆహారం నుండి శరీరం కాల్షియంను సరిగ్గా గ్రహించాలంటే విటమిన్ డి ఉండాల్సిందే.
లభించే మార్గాలు:ఉదయపు లేత సూర్యరశ్మి, గుడ్డులోని సొన, ఫోర్టిఫైడ్ పాలు.
ఇనుము: ఇది శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది. ఐరన్ లోపిస్తే పిల్లలు బలహీనపడి, ఎదుగుదల ఆగిపోతుంది.
జింక్ - మెగ్నీషియం: ఇవి కణాల విభజనకు, శరీర సాధారణ పెరుగుదలకు తోడ్పడటమే కాకుండా పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
పిల్లల అభివృద్ధికి ఉత్తమ జీవనశైలి అలవాట్లు
పోషకాహారంతో పాటు పిల్లల దినచర్యలో ఈ క్రింది మార్పులు తీసుకురావడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి:
తగినంత నిద్ర: ఎదిగే పిల్లలకు రోజుకు 8 నుండి 10 గంటల ప్రశాంతమైన నిద్ర అవసరం. నిద్రలోనే గ్రోత్ హార్మోన్లు ఎక్కువగా విడుదలవుతాయి.
శారీరక శ్రమ: ప్రతిరోజూ రన్నింగ్, స్కిప్పింగ్, సైక్లింగ్, లేదా బాస్కెట్‌బాల్ వంటి ఆటలు ఆడించడం వల్ల ఎముకలు సాగుతాయి.
పుష్కలంగా నీరు: శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండటానికి రోజంతా తగినన్ని నీరు తాగించాలి.
బహిరంగ కార్యకలాపాలు: నాలుగు గోడల మధ్యే కాకుండా, పిల్లలను కాసేపు ప్రకృతిలో, ఆరుబయట గడపనివ్వాలి.
వీటికి పిల్లలను దూరంగా ఉంచండి..
పిల్లల ఎత్తు పెరగకపోవడానికి కొన్ని చెడు అలవాట్లు కూడా కారణం కావచ్చు. వాటిని వెంటనే మాన్పించాలి:
జంక్ ఫుడ్ - స్వీట్స్: పిజ్జాలు, బర్గర్లు, మైదాతో చేసిన పదార్థాలు, కార్బోనేటెడ్ కూల్ డ్రింక్స్‌కు పిల్లలను దూరంగా ఉంచాలి.
స్క్రీన్ టైమ్: మొబైల్ ఫోన్లు, టీవీలు లేదా కంప్యూటర్ స్క్రీన్ల ముందు గంటల తరబడి కూర్చోవడం వల్ల శారీరక శ్రమ తగ్గిపోతుంది.
అర్ధరాత్రి జాగరణ:ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఎదుగుదల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది.

