Child Not Sleeping Well: నేటి ఆధునిక జీవనశైలిలో డిజిటల్ స్క్రీన్‌లు, బిజీ షెడ్యూళ్లు మరియు మారుతున్న అలవాట్ల కారణంగా పెద్దలతో పాటు పిల్లలలో కూడా నిద్రలేమి తీవ్రమైన సమస్యగా మారుతోంది. పిల్లలకు తగినంత నిద్ర లేకపోవడం కేవలం అలసటకు మాత్రమే పరిమితం కాదు... ఇది వారి శారీరక ఎదుగుదల, మెదడు వికాసం, మానసిక ఆరోగ్యం, రోగనిరోధక శక్తిపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలలో నిద్రలేమి వల్ల కలిగే ప్రమాదాలు మరియు వారి నిద్ర అలవాట్లను మెరుగుపరచడానికి నిపుణులు అందించిన కీలక సూచనలు ఇక్కడ చూద్దాం..

పిల్లలలో నిద్రలేమి వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు..

శారీరక ఎదుగుదల దెబ్బతినడం:

పిల్లలు గాఢ నిద్రలో ఉన్నప్పుడే శరీరంలో గ్రోత్ హార్మోన్లు విడుదలవుతాయి. సరైన నిద్ర లేకపోతే వారి ఎత్తు, శరీర ఎదుగుదల మందగిస్తాయి.

ఏకాగ్రత తగ్గుదల - ప్రవర్తనలో మార్పులు:

నిద్ర సరిపోకపోవడం వల్ల చదువుపై శ్రద్ధ పెట్టలేకపోవడం, జ్ఞాపకశక్తి తగ్గడం, చిన్న విషయాలకే చిరాకుపడటం, కోపం, మొండితనం పెరుగుతాయి.

బరువు పెరగడం:

సరిగ్గా నిద్రపోని పిల్లలలో ఆకలిని నియంత్రించే హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి, వారు జంక్ ఫుడ్ ఎక్కువగా తినడానికి అలవాటుపడతారు. ఇది చిన్న వయసులోనే అసాధారణ బరువు పెరుగుదలకు దారితీస్తుంది.

రోగనిరోధక శక్తి తగ్గడం:

తగినంత నిద్ర లేకపోతే పిల్లల రోగనిరోధక వ్యవస్థ బలహీనపడి, తరచూ జలుబు, దగ్గు, జ్వరం వంటి ఇన్‌ఫెక్షన్ల బారిన పడతారు.

పిల్లల్లో నిద్ర దినచర్యను మెరుగుపరచడానికి 5 గోల్డెన్ టిప్స్..

స్క్రీన్ టైమ్‌కు గుడ్ బై:

పడుకునే ముందు కనీసం 1 నుండి 2 గంటల ముందే టీవీ, మొబైల్, ట్యాబ్ లేదా ల్యాప్‌టాప్‌లను పూర్తిగా దూరం పెట్టాలి. స్క్రీన్‌ల నుంచి వచ్చే 'బ్లూ లైట్' నిద్రకు కారణమయ్యే 'మెలటోనిన్' హార్మోన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది.

నిర్దిష్ట సమయాన్ని పాటించడం:

పండుగలు లేదా సెలవు దినాలు ఉన్నప్పటికీ, పిల్లలను ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోబెట్టడం మరియు ఉదయాన్నే ఒకే సమయానికి లేపే అలవాటు చేయాలి.

ప్రశాంతమైన వాతావరణం:

పిల్లలు పడుకునే గదిలో కాంతి తక్కువగా ఉండేలా, శబ్దం లేకుండా ప్రశాంతంగా ఉండే వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి.

రాత్రి పూట తేలికపాటి ఆహారం:

పడుకునే ముందు పిల్లలకు హెవీ ఆహారం లేదా కెఫిన్ ఉండే చాక్లెట్లు, కూల్ డ్రింక్స్ ఇవ్వకూడదు. గోరువెచ్చని పాలు ఇవ్వడం వల్ల మంచి నిద్ర పడుతుంది.

పడుకునే ముందు ప్రశాంతమైన కార్యకలాపాలు:

పడుకునే ముందు పుస్తకాలు చదివి వినిపించడం, తేలికపాటి సంగీతం వినడం లేదా గోరువెచ్చని నీటితో స్నానం చేయించడం వల్ల పిల్లల మెదడు ప్రశాంతపడి త్వరగా నిద్రలోకి జారకుంటారు.

Next Story