Liquid Soap vs Bar Soap: లిక్విడ్ సోప్ Vs బార్ సోప్.. చర్మానికి ఏది మంచిది? నిపుణులు ఏం చెబుతున్నారు?
నిపుణులు ఏం చెబుతున్నారు?

Liquid Soap vs Bar Soap: రోజువారీ జీవితంలో మనం శుభ్రత కోసం విరివిగా వాడే ఉత్పత్తుల్లో సబ్బులు ముందుంటాయి. అయితే, చాలామందిలో తరచుగా వచ్చే సందేహం.. బార్ సోప్ వాడటం మంచిదా? లేక లిక్విడ్ హ్యాండ్‌వాష్ లేదా బాడీ వాష్‌లు వాడాలా? అని. ఈ రెండింటిలో ఏది ఉత్తమం? నిపుణులు ఏం చెబుతున్నారు? ఇప్పుడు తెలుసుకుందాం.
మొదటగా బార్ సోప్ విషయానికి వస్తే.. ఇది ఎప్పట్నుంచో మన ఇళ్లలో ఉన్న పద్ధతి. బార్ సోప్స్ చాలా కాలం పాటు మనుగడలో ఉంటాయి. ధర కూడా తక్కువగా ఉంటాయి. అయితే, వీటిలో ప్రధాన సమస్య పరిశుభ్రత. మనం బార్ సోప్‌ను పదే పదే తాకడం వల్ల బాక్టీరియా. క్రిములు దానిపై చేరే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒకే బార్ సోప్‌ను కుటుంబ సభ్యులందరూ కలిసి వాడినప్పుడు ఇన్ఫెక్షన్లు సోకే రిస్క్ కొంత ఎక్కువగా ఉంటుందని చర్మ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరోవైపు, లిక్విడ్ సోప్స్ లేదా బాడీ వాష్‌ల విషయానికి వస్తే.. ఇవి హైజీనిక్ పరంగా చాలా సురక్షితమైనవిగా నిపుణులు చెబుతున్నారు. పంప్ బాటిల్స్ ద్వారా వచ్చే లిక్విడ్ సోప్ ఎవరికీ నేరుగా తాకదు కాబట్టి, బాక్టీరియా వ్యాపించే అవకాశాలు చాలా తక్కువ. అంతేకాకుండా, చాలా లిక్విడ్ సోప్స్‌లో చర్మాన్ని తేమగా ఉంచే మాయిశ్చరైజర్లు, గ్లిజరిన్ వంటి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇది చర్మం పొడిబారకుండా రక్షిస్తుంది.
అయితే, లిక్విడ్ సోప్స్ వాడటం వల్ల ప్లాస్టిక్ వ్యర్థాలు పెరుగుతాయని, ఇవి బార్ సోప్స్‌తో పోలిస్తే కాస్త ఖరీదు ఎక్కువని చెప్పవచ్చు. డర్మటాలజిస్టుల అభిప్రాయం ప్రకారం.. చర్మం సున్నితంగా ఉండే వారికి, అలాగే హైజీన్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారికైతే లిక్విడ్ సోప్స్ మంచి ఎంపిక. అదే సమయంలో, పర్యావరణ హితం కోరుకునే వారికి, బడ్జెట్‌లో ఉండాలనుకునే వారికి మంచి నాణ్యమైన బార్ సోప్స్ కూడా చక్కగా పనిచేస్తాయి. కాబట్టి మీ అవసరాలు, మీ చర్మతత్వాన్ని బట్టి ఏది ఉత్తమమో ఎంచుకోవడం ఎప్పుడూ మంచిది.

