Menopause: మెనోపాజ్ తర్వాత మహిళల శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Menopause: మహిళల జీవితంలో మెనోపాజ్ అనేది ఒక సహజమైన జీవ ప్రక్రియ. సాధారణంగా 45 నుండి 55 సంవత్సరాల వయస్సు మధ్యలో మహిళల్లో నెలసరి శాశ్వతంగా ఆగిపోవడాన్ని మెనోపాజ్ అంటారు. ఒక మహిళకు వరుసగా 12 నెలల పాటు పీరియడ్స్ రాకపోతే, ఆమె మెనోపాజ్ దశకు చేరుకున్నట్లుగా వైద్యులు నిర్ధారిస్తారు. ఈ దశ తర్వాత మహిళలు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టడం ఎంతో అవసరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు మెనోపాజ్ తర్వాత శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి? మహిళలు తమ జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చో ఇప్పుడు చూద్దాం..
మెనోపాజ్ తర్వాత శరీరంలో వచ్చే మార్పులు ఏంటి?
మెనోపాజ్ తర్వాత మహిళల శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు గణనీయంగా తగ్గిపోతాయి. ఈ హార్మోన్ కేవలం ప్రత్యుత్పత్తి వ్యవస్థకే కాకుండా, ఎముకలు మరియు గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఎముకలు బలహీనపడటం:
ఈస్ట్రోజెన్ లోపం వల్ల ఎముకల సాంద్రత తగ్గి, అవి త్వరగా బలహీనపడే ప్రమాదం పెరుగుతుంది.
గుండె జబ్బుల ముప్పు:
హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.
నిపుణుల సూచన:
మెనోపాజ్ దశ దాటిన తర్వాత కూడా మహిళలు సంవత్సరానికి ఒకసారైనా గైనకాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిది. ముఖ్యంగా ఎముక సాంద్రత, కాల్షియం, విటమిన్ డి, రక్తపోటు, కొలెస్ట్రాల్ పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవాలి.
హార్మోన్ థెరపీ అందరికీ సురక్షితం కాదు..
మెనోపాజ్ లక్షణాల తీవ్రతను తగ్గించడానికి కొంతమందికి హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ అందిస్తారు. అయితే, ఈ చికిత్స ప్రతి మహిళకు సరిపడదు. కాబట్టి, సొంత నిర్ణయాలు తీసుకోకుండా కేవలం నిపుణులైన వైద్యుల సలహా మరియు పర్యవేక్షణలోనే ఈ థెరపీని తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ జీవనశైలి మార్పులతో హెల్తీగా ఉండండి..
మెనోపాజ్ తర్వాత వచ్చే శారీరక మార్పులను తట్టుకుని, ఆరోగ్యంగా ఉండటానికి నిపుణులు ఈ క్రింది లైఫ్‌స్టైల్ టిప్స్ సూచిస్తున్నారు..
క్రమం తప్పని వ్యాయామం:
ప్రతిరోజూ వాకింగ్, యోగా లేదా తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల ఎముకలు, కండరాలు దృఢంగా ఉంటాయి.
సమతుల్య ఆహారం:
కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉండే పౌష్టికాహారాన్ని డైట్‌లో భాగం చేసుకోవాలి.
కెఫైన్‌కు దూరంగా : టీ, కాఫీలు ఎక్కువగా తీసుకోవడాన్ని పరిమితం చేయాలి.
సరైన నిద్ర:
ప్రతిరోజూ రాత్రి వేళల్లో బాగా నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. రోజువారీగా ఒకే సమయానికి పడుకోవడం, ఒకే సమయానికి నిద్రలేవడం చాలా మంచిది.
మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి..
హార్మోన్ల మార్పుల వల్ల ఈ సమయంలో మూడ్ స్వింగ్స్, చిరాకు, ఆందోళన వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలాంటి సమయంలో కుటుంబ సభ్యుల మద్దతు, స్నేహపూర్వక వాతావరణం ఎంతో అవసరం. అవసరమైతే మానసిక నిపుణుల సలహా తీసుకోవడానికి వెనుకాడకూడదు.

