Migraine and Anemia: నేటి ఆధునిక జీవనశైలిలో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో మైగ్రేన్, రక్తహీనత ముందు వరుసలో ఉన్నాయి. అయితే ఈ రెండింటికీ మధ్య ఒక బలమైన సంబంధం ఉందని ఒక కొత్త అధ్యయనం వెల్లడించింది. ఐరన్ లోపం వల్ల వచ్చే రక్తహీనతకు, మైగ్రేన్ సమస్యకు లింక్ ఉందని పరిశోధకులు చెప్తున్నారు.

అధ్యయనం ఏం చెబుతోంది?

పబ్‌మెడ్ లో ప్రచురితమైన పరిశోధనల ప్రకారం.. శరీరంలో తీవ్రమైన ఐరన్ లోపం ఉన్నవారిలో మైగ్రేన్ సమస్య ఎక్కువగా కనిపిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. శరీరంలో ఐరన్ లోపించడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పడిపోతాయి. దీనివల్ల మెదడుకు అందాల్సిన పరిమాణంలో ఆక్సిజన్ అందదు. ఈ ఆక్సిజన్ కొరతే మైగ్రేన్ తలనొప్పికి దారితీస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే రక్తహీనతే మైగ్రేన్‌కు ప్రత్యక్ష కారణమని పూర్తిగా నిరూపితం కాకపోయినా, ఈ రెండింటికీ ఖచ్చితమైన సంబంధం ఉందని మాత్రం అధ్యయనం స్పష్టం చేస్తోంది.

రక్తహీనత, మైగ్రేన్ లక్షణాలు ఎలా ఉంటాయి?

రక్తహీనత లక్షణాలు:

విపరీతమైన అలసట, బలహీనత, కళ్ళు తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మం తెల్లగా మారడం, ఏకాగ్రత లోపించడం.

మైగ్రేన్ లక్షణాలు:

తలలో ఒకవైపు తీవ్రమైన నొప్పి రావడం, వాంతులు, వికారం, ఎక్కువ వెలుతురు లేదా శబ్దాలను భరించలేకపోవడం.

నివారణ మార్గాలు.. నిపుణుల సలహాలు..

ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు..

ఐరన్ అధికంగా ఉండే ఆహారం:

ఆకుకూరలు, పప్పుధాన్యాలు, బీన్స్, బెల్లం మరియు డ్రై ఫ్రూట్స్ రోజూ తినాలి.

సరిపడా నీరు, నిద్ర:

రోజూ తగినంత నీరు తాగడం, సరైన సమయానికి నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా ముఖ్యం.

వైద్యుల సంప్రదింపులు:

తరచూ తలనొప్పి రావడం లేదా రక్తహీనత లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. సొంత వైద్యం లేదా డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి పెయిన్ కిల్లర్స్, మాత్రలు వాడకూడదు.

వరుసగా వేధించే తలనొప్పిని కేవలం సాధారణ నొప్పే కదా అని నిర్లక్ష్యం చేయవద్దని, అది శరీరంలో ఐరన్ లోపానికి సంకేతం కావచ్చని ఈ అధ్యయనం హెచ్చరిస్తోంది.

Next Story