Night Shift Workers: నైట్ షిఫ్ట్ చేసే వాళ్లు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Night Shift Workers: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది కెరీర్ కోసం నైట్ షిఫ్ట్‌లు చేస్తుంటారు. అయితే, రాత్రి వేళల్లో పని చేసేవారు తమ ఆరోగ్యం విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మొదటిగా.. డ్యూటీ వేళల్లో అలసట తగ్గించుకోవడానికి చాలా మంది టీ, కాఫీలు లేదా కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతుంటారు. కానీ, వీటిని వీలైనంత వరకు తగ్గించడం మంచిది. వీటికి బదులుగా బ్రేక్ సమయంలో తాజా పళ్లరసాలు (Fruit Juices) తీసుకోవడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది.
ఇక షిఫ్ట్ ముగిసి ఇంటికి వెళ్ళిన తర్వాత.. నేరుగా పడుకోకుండా, ఒకసారి గోరువెచ్చటి నీటితో స్నానం చేసి నిద్రపోవాలి. ఇది మీ కండరాలను రిలాక్స్ చేసి, గాఢ నిద్ర పట్టేలా చేస్తుంది. అలాగే, ఎప్పుడూ భోజనం చేయకుండా ఖాళీ కడుపుతో పడుకోవద్దు. ఇది గ్యాస్ట్రిక్ సమస్యలకు దారి తీస్తుంది.
మీ ఆహారంలో ప్రొటీన్ల శాతం ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఇందుకోసం తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు మరియు గుడ్లను మీ డైట్‌లో చేర్చుకోండి. ఇవి రాత్రిపూట పని చేసేటప్పుడు కలిగే నీరసాన్ని తగ్గిస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా.. ప్రతిరోజూ కొంత సమయం యోగా లేదా వ్యాయామం కోసం కేటాయించండి. దీనివల్ల మీరు శారీరకంగానే కాకుండా, మానసికంగా కూడా బలంగా ఉంటారు.

