Overthinking at Night: రాత్రి వేళల్లో ప్రశాంతంగా నిద్రపోవాల్సిన సమయంలో చాలా మందికి దిండు మీద తల పెట్టగానే ఎక్కడో లేని ఆలోచనలన్నీ తలకెక్కుతాయి. రోజంతా జరిగిన విషయాలు, రేపటి గురించిన ఆందోళనలు, ఆర్థిక లేదా కుటుంబ సమస్యలు వంటి అనేక విషయాలు మనసును కుదిపేస్తుంటాయి. చూసేందుకు ఇది చాలా సాధారణ విషయంగా అనిపించినప్పటికీ, రాత్రి పూట ఇలా అతిగా ఆలోచించడం వల్ల ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావాలు పడతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రి పూట అతిగా ఆలోచించడం వల్ల వచ్చే ప్రధాన ఆరోగ్య సమస్యలు మరియు వాటి నివారణోపాయాలు ఇక్కడ తెలుసుకుందాం..

నిద్రలేమి

నిద్రపోయే ముందు తీవ్రమైన ఆలోచనల్లో మునిగిపోవడం వల్ల మెదడు చురుగ్గా మారి, సమయానికి నిద్ర రాదు. ఇది క్రమంగా నిద్రలేమి సమస్యకు దారితీస్తుంది. రాత్రి సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల మరుసటి రోజు ఉదయం అలసటగా అనిపించడమే కాకుండా, ఏ పనిపైనా దృష్టి పెట్టలేరు.

గుండె ఆరోగ్యంపై ప్రభావం

రాత్రి వేళల్లో అతిగా ఆలోచించడం గుండెపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది గుండె వేగాన్ని పెంచడమే కాకుండా, కాళ్లు చేతుల్లో వణుకు రావడానికి కారణమవుతుంది. అంతేకాకుండా, రాత్రిళ్లు ఎక్కువ సమయం మేల్కొని ఉండటం వల్ల జీర్ణక్రియ దెబ్బతిని మలబద్ధకం, కడుపునొప్పి, వికారం వంటి సమస్యలు తలెత్తుతాయి.

పెరిగే ఆందోళన, పానిక్ అటాక్స్

నిద్రపోయే ముందు ప్రతికూల విషయాల గురించి ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన స్థాయిలు విపరీతంగా పెరుగుతాయి. ఈ పరిస్థితి నిరంతర ఆందోళనకు దారితీసి, కొన్నిసార్లు పానిక్ అటాక్స్ వచ్చే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

తీవ్రమైన డిప్రెషన్

ప్రతిరోజూ రాత్రి వేళల్లో ప్రతికూల ఆలోచనలతో మెదడును నింపేయడం వల్ల మనిషి మానసికంగా బాగా అలసిపోతాడు. ఇది కాలక్రమేణా తీవ్రమైన మానసిక కుంగుబాటుకు దారితీసే అవకాశం ఉంది.

ఈ సమస్య నుండి బయటపడటం ఎలా?

ధ్యానం:

నిద్రపోవడానికి కనీసం 10-15 నిమిషాల ముందు ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది.

శ్వాసపై దృష్టి:

పడకపై నేరుగా పడుకుని, శరీరాన్ని పూర్తిగా వదిలేసి, మీ శ్వాస ప్రక్రియపై మాత్రమే దృష్టి కేంద్రీకరించాలి.

ఎడమ వైపునకు తిరిగి పడుకోవడం:

ఆరోగ్య నిపుణుల ప్రకారం, ఎడమ పక్కకు తిరిగి పడుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా, శరీరం, మనస్సు త్వరగా విశ్రాంతి పొందుతాయి.

సమస్యను అర్థం చేసుకోవడం:

మిమ్మల్ని వేధిస్తున్న సమస్య ఏంటో గుర్తించి, దానికి పగటిపూటే పరిష్కారం వెతకాలి తప్ప నిద్రపోయే సమయంలో కాదు. సమస్య తీవ్రంగా ఉంటే నిపుణులను సంప్రదించడం మంచిది.

PolitEnt Media

PolitEnt Media

Next Story