Premature Ageing at 30: నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యలు అకాల వృద్ధాప్యం, జుట్టు రాలడం. ఇరవై, ముప్పై ఏళ్ల వయసులోనే ముఖంపై ముడతలు రావడం, జుట్టు పలచబడటం వంటివి కనిపిస్తున్నాయి. దీనికి మనం అనుసరించే జీవనశైలి, అలవాట్లే ప్రధాన కారణమని ప్రముఖ చర్మవ్యాధి నిపుణులు డాక్టర్ నిషిత రాంకా వెల్లడించారు. మనం రోజూ చేసే ఏయే తప్పులు మనల్ని వయసు పైబడిన వారిలా చూపిస్తున్నాయో తెలుసుకుందాం.

మానసిక ఒత్తిడి - హార్మోన్ల ప్రభావం:

మనం ఎదుర్కొనే మానసిక ఒత్తిడి చర్మంపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఒత్తిడి పెరిగినప్పుడు శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయి పెరుగుతుంది. ఇది చర్మంలోని కొల్లాజెన్‌ను నాశనం చేసి ముడతలు రావడానికి కారణమవుతుంది. అలాగే, ఒత్తిడి వల్ల అకస్మాత్తుగా జుట్టు రాలిపోవడాన్ని వైద్య పరిభాషలో టెలోజెన్. ఎఫ్లూవియం అంటారు. అయితే, ఒత్తిడిని తగ్గించుకుంటే దీని నుంచి కోలుకోవడం సాధ్యమే.

నిద్రలేమితో చర్మం నిస్తేజం

మనం నిద్రపోతున్న సమయంలోనే మన చర్మ కణాలు తమను తాము బాగు చేసుకుంటాయి. సరైన నిద్ర లేనప్పుడు చర్మం తన సహజ కాంతిని కోల్పోయి, కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. ఇది మనల్ని వయసు కంటే ముసలివారిలా కనిపించేలా చేస్తుంది.

పోషకాహార లోపం:

జుట్టు రాలడానికి ప్రధాన కారణం విటమిన్ బి12, డి, ఐరన్, జింక్ లోపమే. అలాగే, ఆహారంలో చక్కెర ఎక్కువగా తీసుకుంటే 'గ్లైకేషన్' అనే ప్రక్రియ జరిగి, చర్మం తన సాగే గుణాన్ని కోల్పోతుంది. ఫలితంగా చర్మంపై ముడతలు ఏర్పడతాయి.

సన్‌స్క్రీన్ వాడకపోవడం:

వృద్ధాప్య లక్షణాల్లో దాదాపు 80 శాతం సూర్యుడి నుండి వచ్చే UV కిరణాల వల్లే కలుగుతాయి. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ వాడకపోతే చర్మం నల్లబడటమే కాకుండా, త్వరగా వృద్ధాప్య ఛాయలు వస్తాయి. నిపుణుల ప్రకారం, ఇంట్లో ఉన్నప్పుడు కూడా సన్‌స్క్రీన్ వాడటం చర్మానికి రక్షణనిస్తుంది.

ఉత్పత్తులతో ప్రయోగాలు:

మార్కెట్లో దొరికే రసాయనాలు కలిగిన షాంపూలు, క్రీములను సొంతంగా ప్రయోగించడం వల్ల చర్మం పొడిబారిపోతుంది. జుట్టు కుదుళ్లు దెబ్బతిని రాలిపోతాయి. మీ చర్మ తత్వానికి సరిపడే ఉత్పత్తులను మాత్రమే వాడటం శ్రేయస్కరం.

నివారణ మార్గాలు

నీరు ఎక్కువగా తాగాలి: చర్మాన్ని మరియు జుట్టును తేమగా ఉంచడం వల్ల ముడతలు, జుట్టు రాలడం తగ్గుతాయి.

సమతుల్య ఆహారం:

విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.

వ్యాయామం: నిత్యం వ్యాయామం లేదా యోగా చేయడం వల్ల ఒత్తిడి తగ్గి హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story