Constipation Problems: ఒకప్పుడు సాయంత్రం అయిందంటే చాలు.. పిల్లల ఆటపాటలతో వీధులన్నీ సందడిగా ఉండేవి. కానీ, ఈరోజుల్లో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మన పిల్లల్లో శారీరక శ్రమ రోజురోజుకూ మృగ్యమైపోతోంది. ఎంతసేపూ కదలకుండా ఒకే చోట కూర్చోవడం... గంటల తరబడి మొబైల్స్, టాబ్స్, టీవీల వంటి గ్యాడ్జెట్లకు అతుక్కుపోవడం సర్వసాధారణమైపోయింది. అయితే, ఈ లైఫ్‌స్టైల్ వల్ల కేవలం కళ్లు పాడవ్వడం, స్థూలకాయం రావడం మాత్రమే కాదు... చిన్నారుల్లో 'మలబద్ధకం' అనే తీవ్రమైన సమస్యకు దారితీస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అసలు పిల్లల్లో ఈ సమస్య రావడానికి ముఖ్య కారణాలు ఏంటంటే.. మొదటిది... శారీరక శ్రమ లేకపోవడం. పిల్లలు పరిగెత్తడం, ఆడటం చేసినప్పుడు వారి ప్రేగుల కదలికలు (Bowel Movements) మెరుగ్గా ఉంటాయి. కానీ రోజంతా ఒకే చోట కూర్చోవడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. ఇక రెండోది... ఆహారపు అలవాట్లు. జంక్ ఫుడ్, మైదాతో చేసిన పదార్థాలు, చాక్లెట్లు ఎక్కువగా తింటూ... ఫైబర్ అంటే పీచుపదార్థం ఉండే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను అస్సలు తీసుకోకపోవడం వల్ల ఈ సమస్య మరింత జటిలంగా మారుతోంది.

మరో ముఖ్యమైన కారణం... తగినంత నీరు తాగకపోవడం. గ్యాడ్జెట్స్‌లో మునిగిపోయే పిల్లలు కనీసం నీళ్లు తాగడం కూడా మర్చిపోతుంటారు. దీనివల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురై మలబద్ధకం ఏర్పడుతుంది. చాలామంది పిల్లలు స్కూల్స్‌లో లేదా బయట మోషన్ వస్తే మొహమాటంతో ఆపుకుంటూ ఉంటారు. ఇలా క్రమంగా ఆపుకోవడం వల్ల కూడా అది దీర్ఘకాలిక సమస్యగా మారుతుంది.

మొదటగా... ప్రతిరోజూ కనీసం గంట లేదా రెండు గంటల పాటు పిల్లలు ఖచ్చితంగా మైదానంలో ఆడుకునేలా చూడండి. రన్నింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్ వంటి శారీరక శ్రమ ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రెండోది... వారి ఆహారంలో మార్పులు చేయాలి. పీచుపదార్థం ఎక్కువగా ఉండే అరటిపండ్లు, ఆపిల్స్, బొప్పాయి, తృణధాన్యాలు, ఆకుకూరలు అలవాటు చేయండి. రోజంతా తగినన్ని నీళ్లు తాగేలా గమనించండి. అలాగే ఉదయాన్నే లేవగానే టాయిలెట్‌కు వెళ్లేలా ఒక సరైన దినచర్యను (Routine) అలవాటు చేయండి.

PolitEnt Media

PolitEnt Media

Next Story