Goodbye to Bad Breath: నలుగురిలోకి వెళ్లినప్పుడు ఆత్మవిశ్వాసంతో మాట్లాడాలంటే నోటి పరిశుభ్రత చాలా ముఖ్యం. కానీ, ప్రస్తుతం చాలా మంది నోటి దుర్వాసన సమస్యతో సతమతమవుతున్నారు. ఇది కేవలం సామాజిక ఇబ్బందే కాదు మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుంది. మార్కెట్లో లభించే ఆల్కహాల్ ఆధారిత మౌత్‌వాష్‌లు తాత్కాలిక ఉపశమనం ఇచ్చినా అవి నోటిని పొడిబారేలా చేసి సమస్యను మరింత పెంచుతాయి. ఈ నేపథ్యంలో ఆయుర్వేద గుణాలున్న హెర్బల్ మౌత్‌వాష్ అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

దుర్వాసనకు కారణాలేమిటి?

నోటిలో ఉండే హానికరమైన బ్యాక్టీరియా మనం తినే ఆహారంలోని చక్కెరలు, పిండి పదార్థాలను విచ్ఛిన్నం చేసినప్పుడు కొన్ని రకాల వాయువులను విడుదల చేస్తుంది. దీనివల్ల దుర్వాసన వస్తుంది. పళ్ల సందుల్లో ఆహారం ఇరుక్కోవడం, చిగుళ్ల వ్యాధులు, నాలుకపై పేరుకుపోయే మురికి కూడా దీనికి ప్రధాన కారణాలు.

హెర్బల్ మౌత్‌వాష్‌తో కలిగే లాభాలు:

ఇంట్లో లభించే మూలికలతో తయారుచేసుకునే ఈ మౌత్‌వాష్ వల్ల మూడు ప్రధాన ప్రయోజనాలు ఉన్నాయి:

బ్యాక్టీరియా నివారణ: ఇది నోటిలోని చెడు బ్యాక్టీరియాను సంహరించి, సహజమైన తాజాదనాన్ని ఇస్తుంది.

చిగుళ్ల బలం: రసాయనాలు లేకపోవడం వల్ల చిగుళ్ల వాపు తగ్గి, అవి బలోపేతం అవుతాయి.

సహజ మాయిశ్చరైజర్: ఆల్కహాల్ లేకపోవడం వల్ల నోరు పొడిబారకుండా ఉంటుంది.

ఇంట్లోనే తయారు చేసుకోవడం ఎలా?

మన వంటింట్లో ఉండే పదార్థాలతోనే ఈ శక్తివంతమైన కషాయాన్ని సిద్ధం చేసుకోవచ్చు..

కావలసినవి: తులసి ఆకులు, పుదీనా, లవంగాలు, దాల్చినచెక్క, ఉసిరి, కొద్దిగా కలబంద.

తయారీ విధానం: ఈ పదార్థాలన్నింటినీ నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ కషాయం చల్లారిన తర్వాత వడకట్టి ఒక బాటిల్‌లో భద్రపరుచుకోవాలి.

పనితీరు: లవంగాల్లో ఉండే యూజినాల్ బ్యాక్టీరియాను చంపితే, పుదీనా నోటికి చల్లదనాన్ని, తాజాదనాన్ని ఇస్తుంది. తులసి సహజ యాంటీసెప్టిక్‌లా పనిచేస్తుంది.

ఎలా ఉపయోగించాలి?

రోజూ ఉదయం బ్రష్ చేసిన తర్వాత, రాత్రి పడుకునే ముందు సుమారు 30 సెకన్ల నుండి ఒక నిమిషం పాటు ఈ ద్రావణంతో నోరు పుక్కిలించి ఉమ్మివేయాలి.

మౌత్‌వాష్ వాడిన వెంటనే నీరు తాగకూడదు, అప్పుడే ఆ ఔషధ గుణాలు నోటిపై ప్రభావం చూపుతాయి.

రోజుకు రెండు సార్లు వాడితే సరిపోతుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story