Scrolling on Your Mobile for Hours Every Day: గంటల తరబడి మొబైల్ స్క్రోలింగ్ చేస్తున్నారా..? ఈ తీవ్ర సమస్యలు వస్తాయి జాగ్రత్త..
ఈ తీవ్ర సమస్యలు వస్తాయి జాగ్రత్త..

Scrolling on Your Mobile for Hours Every Day: నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ లేనిదే ముద్ద దిగని పరిస్థితి ఏర్పడింది. అయితే, స్మార్ట్‌ఫోన్ల మితిమీరిన వాడకం, నిరంతరం స్క్రీన్‌లను చూస్తూ స్క్రోల్ చేయడం వల్ల యువతలో టెక్స్ట్ నెక్ సమస్య ఒక మహమ్మారిలా మారుతోందని వైద్య నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిరంతరం తల కిందకు వంచి మొబైల్ ఫోన్లు చూడటం వల్ల మెడలోని వెన్నెముక, నరాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధికి సంబంధించిన షాకింగ్ నిజాలు, లక్షణాలు, నివారణ మార్గాలు ఇప్పుడు చూద్దాం.
నిరంతరం తల వంచి మొబైల్ వాడటం వల్ల మెడలోని నరాలపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది.
బెంగళూరులోని ప్రముఖ ఆసుపత్రుల ఓపీడీలలో ప్రతిరోజూ 2 నుంచి 3 టెక్స్ట్ నెక్ కేసులు నమోదవుతున్నాయి.
నరాలపై పెరిగిన ఒత్తిడి తీవ్రమైతే చేతులు పూర్తిగా బలహీనపడే ప్రమాదం ఉంది.
ఐటీ ఉద్యోగులకే కాదు.. టీనేజర్లకూ తప్పని ముప్పు..
గతంలో ఈ తరహా మెడ నొప్పి, నరాల సమస్యలు ఎక్కువగా కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చునే డెస్క్ ఉద్యోగులలో లేదా వృద్ధులలో కనిపించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
కరోనా మహమ్మారి తర్వాత విద్య, ఉద్యోగం, వినోదం అన్నీ ఆన్‌లైన్‌లోకి మారడంతో ఇప్పుడు టీనేజర్లు, కాలేజీ విద్యార్థులు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. రోజూ ఇలాంటి లక్షణాలతో వచ్చే యువత సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.
నరాలపై ఒత్తిడి.. చేతుల్లో బలం శూన్యం..
"మొబైల్ చూసేటప్పుడు తలను ముందుకు వంచడం వల్ల మెడ వెన్నెముకపై ఒత్తిడి గణనీయంగా పెరుగుతుంది. దీనివల్ల మెడ కండరాలు, స్నాయువులు, కీళ్ళు తీవ్రమైన అలసటకు గురవుతాయి" అని పేర్కొన్నారు.
ముదిరితే సర్జరీనే మార్గం:
బెంగళూరుకు చెందిన ఒక 28 ఏళ్ల ఐటీ ఉద్యోగి నిరంతరం తప్పుడు భంగిమలో స్క్రీన్ చూడటం వల్ల చేతుల్లోని బలాన్ని పూర్తిగా కోల్పోయాడని చివరికి అతనికి సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందని తెలిపారు.
టెక్స్ట్ నెక్ ప్రధాన లక్షణాలు..
మొదట్లో సాధారణంగా అనిపించినా, కింద పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..
మెడ నొప్పి మరియు మెడ కండరాలు బిగుసుకుపోవడం.
నొప్పి క్రమంగా భుజాల మధ్య భాగానికి వ్యాపించడం.
తరచూ తలనొప్పి, తీవ్రమైన అలసట రావడం.
పరిస్థితి విషమిస్తే మెడలోని నరాలు నలిగిపోయి.. సూదులతో గుచ్చినట్లు ఉండే నొప్పి, తిమ్మిరి చేతుల వరకు పాకడం.
నోమోఫోబియా.. డూమ్‌స్క్రోలింగ్ అడ్డంకులు..
ప్రస్తుత రోజుల్లో ఈ సమస్య తగ్గకపోవడానికి నోమోఫోబియా, డూమ్‌స్క్రోలింగ్ అనే వ్యసనాలు ప్రధాన కారణాలుగా మారాయని వైద్యులు చెబుతున్నారు. వీటివల్ల ప్రజలు స్క్రీన్ టైమ్‌ను తగ్గించుకోలేకపోతున్నారు.
వైద్యుల కీలక సూచనలు..
కంటి స్థాయికి మొబైల్:
మొబైల్ ఫోన్‌లను ఎప్పుడూ కిందకు వంచి కాకుండా, మీ కంటి స్థాయికి (సమానంగా ఉంచి చూడటం అలవాటు చేసుకోండి.
20 నిమిషాల రూల్:
ప్రతి 20 నిమిషాలకు ఒకసారి మొబైల్ చూడటం ఆపి, మెడకు అటు ఇటు తిప్పుతూ చిన్న విరామం ఇవ్వండి.
ఫిజియోథెరపీ:
ప్రారంభ దశలోనే గుర్తిస్తే సరైన శరీర భంగిమ మార్చుకోవడం, మెడ కండరాలను బలోపేతం చేసే ఫిజియోథెరపీ వ్యాయామాల ద్వారా దీనిని నయం చేయవచ్చు.
టెక్నాలజీ మన జీవితాలను సులభతరం చేసిన మాట వాస్తవమే అయినా దానికి బానిసలై ఆరోగ్యాన్ని గుల్ల చేసుకోవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్‌గా బ్రతకడం అంటే ఫోన్ వాడటమే కాదు దాన్ని ఎంతవరకు వాడాలో తెలిసి ఉండటమే..

