Cashews Fresh for a Longer Time: జీడిపప్పు ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి
ఇలా చేయండి

Cashews Fresh for a Longer Time: మనం మార్కెట్లో కొనే ప్రతి వస్తువుకీ ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. ఈ రూల్ మనం ఎంతో ఇష్టంగా తినే జీడిపప్పుకు కూడా వర్తిస్తుంది! అవును, జీడిపప్పు ఎన్నాళ్లు నిల్వ ఉంటుంది అనేది.. మనం దాన్ని ఎలా స్టోర్ చేస్తున్నాం అనే దానిపైనే పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ఎక్కువ ఎండ, వేడి, తేమ లేదా గాలి తగిలే చోట ఉంచితే జీడిపప్పు చాలా త్వరగా పాడైపోతుంది.
సాధారణంగా మనం బల్క్‌గా జీడిపప్పు కొని వంటగదిలో ఏదైనా డబ్బాలో స్టోర్ చేస్తే.. అవి కేవలం నాలుగు వారాలు, అంటే నెల రోజులు మాత్రమే తాజాగా ఉంటాయి. అదే జీడిపప్పును మీరు ఫ్రిజ్‌లో పెడితే.. దాదాపు ఆరు నెలల పాటు ఫ్రెష్‌గా ఉంచుకోవచ్చు. ఒకవేళ అంతకంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే.. వాటిని గాలి చొరబడని ఎయిర్ టైట్ కంటైనర్ లేదా జిప్‌లాక్ ఫ్రీజర్ బ్యాగ్‌లో ఉంచి, ఫ్రీజర్ కంపార్ట్‌మెంట్‌లో పెట్టాలి. దీనివల్ల అవి ఏడాది దాకా పాడవకుండా ఉంటాయి.
ముఖ్యంగా కిచెన్‌లో అయినా, ఫ్రిజ్‌లో అయినా జీడిపప్పును చల్లటి, వెలుతురు, తేమ తగలని చీకటి ప్రదేశంలో మాత్రమే ఉంచాలి. మరి జీడిపప్పు ఎక్స్‌పైర్ అయిందని లేదా పాడైపోయిందని ఎలా గుర్తించాలో తెలుసా? జీడిపప్పు గనుక రంగు మారి, ముదురు పసుపు లేదా గోధుమ రంగులోకి వస్తే అది పాడైపోయిందని అర్థం. అలాగే పాడైన జీడిపప్పు నుంచి ఒక రకమైన కెమికల్ లేదా పెయింట్ వాసన వస్తుంది.
అంతేకాదు, వీటి రుచి కూడా కాస్త చేదుగా లేదా పుల్లగా మారుతుంది. జీడిపప్పులో ఉండే సహజసిద్ధమైన నూనెలు గాలితో చర్య జరపడం వల్లే (Rancidity) ఇలా జరుగుతుంది. ఇలాంటి జీడిపప్పును అస్సలు తినకూడదు, వెంటనే పారేయాలి. ఒకవేళ ఇవేమీ పట్టించుకోకుండా తింటే.. వాటిలో చేరిన బ్యాక్టీరియా, ఫంగస్ వల్ల ఫుడ్ పాయిజనింగ్, కడుపునొప్పి, వాంతులు వంటి లేనిపోని ఆరోగ్య చిక్కులు తెచ్చిపెడతాయి.

