Daily Habits Could Be the Real Villain: వాతావరణం కొద్దిగా మారినా చాలు.. కొందరికి వెంటనే దగ్గు, జలుబు, గొంతునొప్పి లేదా విపరీతమైన నీరసం వచ్చేస్తుంటాయి. ఇలా పదే పదే అనారోగ్యం బారిన పడటానికి చాలామంది చల్లని గాలిని, వర్షాన్ని లేదా కాలుష్యాన్ని బ్లేమ్ చేస్తుంటారు. కానీ, పదే పదే జబ్బు పడటానికి అసలు కారణం ఎల్లప్పుడూ వాతావరణం కాదని వైద్యులు చెబుతున్నారు. మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని రోజువారీ తప్పులు, చెడు అలవాట్లే శరీరాన్ని లోపలి నుండి పూర్తిగా బలహీనపరుస్తాయి.

ఈ రోజుల్లో రాత్రిళ్లు ఆలస్యంగా పడుకోవడం, ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మానేయడం, రోజంతా ల్యాప్‌టాప్ స్క్రీన్ల ముందు కూర్చోవడం, మానసిక ఒత్తిడి పెంచుకోవడం సర్వసాధారణంగా మారిపోయాయి. శరీరం కొన్ని రోజుల పాటు ఈ ఒత్తిడిని భరిస్తుంది, కానీ క్రమంగా రోగనిరోధక వ్యవస్థ పడిపోయి రోగాల నిలయంగా మారుతుంది. పదే పదే అనారోగ్యానికి గురిచేసే ఆ ముఖ్యమైన కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

క్వాలిటీ లేని నిద్ర.. పడిపోతున్న రోగనిరోధక శక్తి..

మంచి నిద్ర అంటే కేవలం 7 లేదా 8 గంటల పాటు పడుకోవడం మాత్రమే కాదు, అది ఎంత గాఢంగా ఉందనేది ముఖ్యం. నిరంతరం నిద్రలేమితో బాధపడేవారి ఇమ్యూనిటీ పడిపోతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఆరోగ్య సమస్యలు:

సరిగ్గా నిద్రపోని వారు తరచుగా జలుబు, దగ్గు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యల బారిన పడతారు.

కారణాలు: రాత్రి పడుకునే ముందు ఎక్కువసేపు మొబైల్ ఫోన్ ఉపయోగించడం, అర్థరాత్రి పదే పదే మేల్కొనడం, గురక సమస్యల వల్ల శరీరానికి అవసరమైన విశ్రాంతి దొరకదు.

పరిశోధనలు ఏం చెబుతున్నాయి?:

యుఎస్ సీడీసీ పరిశోధన ప్రకారం.. నిద్రలేమి కేవలం రోగనిరోధక శక్తిని తగ్గించడమే కాకుండా గుండె జబ్బులు, ఊబకాయం, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలకు దారితీస్తుంది. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడే శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడే ప్రత్యేక ప్రోటీన్లను ఉత్పత్తి చేసుకుంటుంది.

చెడు ఆహారపు అలవాట్లు.. పోషకాల కొరత

శరీరానికి సరైన ఇంధనం అందనప్పుడు రోగాలు దాడి చేయడం సహజం. నేటి వేగవంతమైన జీవితంలో చాలామంది సమయానికి భోజనం చేయడం మానేస్తున్నారు.

జంక్ ఫుడ్స్ మితిమీరడం:

ఇంట్లో వండిన తాజా ఆహారానికి బదులు ప్రాసెస్ చేసిన ప్యాకెట్ ఫుడ్స్, చక్కెర ఎక్కువగా ఉండే స్నాక్స్, ఇన్‌స్టంట్ ఫుడ్స్ బయటి నూనెలతో చేసిన ఆహారాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు

పోషకాల లోపం:

బలమైన రోగనిరోధక వ్యవస్థ కోసం శరీరానికి ప్రోటీన్, ఐరన్, జింక్, అవసరమైన విటమిన్లు, ఫైబర్ చాలా అవసరం. ఇవి లోపించడం వల్లే శరీరం వైరస్ లతో పోరాడలేకపోతోంది.

తక్కువ నీరు తాగడం.. ఇన్ఫెక్షన్ల ముప్పు..

బిజీ లైఫ్ వల్ల చాలామంది తగినంత నీరు తాగడం మర్చిపోతున్నారు. వైద్యుల ప్రకారం.. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు శ్లేష్మం చిక్కబడుతుంది. దీనివల్ల బాక్టీరియా, వైరస్ లు సులభంగా శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి రోజుకు కనీసం 3 నుండి 4 లీటర్ల నీరు తాగడం అలవాటు చేసుకోవాలి.

ఎప్పుడూ ఏసీ గదుల్లోనే బంధీ అవ్వడం..

ఇంట్లో లేదా ఆఫీసులో గంటల తరబడి కిటికీలు, తలుపులు పూర్తిగా మూసి ఉన్న ఏసీ గదుల్లోనే గడపడం కూడా ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తుంది. గాలి వెలుతురు సరిగ్గా ఆడని ప్రదేశాలలో ఉండటం వల్ల అలసట పెరగడమే కాకుండా, ఇన్ఫెక్షన్లు ఒకరి నుండి ఒకరికి త్వరగా వ్యాపించే అవకాశం ఉంటుంది.

పదే పదే టాబ్లెట్లు వేసుకోవడం కంటే, మీ దినచర్యను మార్చుకోవడం ఉత్తమం. సమయానికి పౌష్టికాహారం తినడం, రాత్రిళ్లు ఫోన్‌ పక్కన పెట్టి ప్రశాంతంగా నిద్రపోవడం, తగినంత నీరు తాగడం వంటి చిన్న చిన్న మార్పులతోనే తరచుగా వచ్చే అనారోగ్య సమస్యలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story