Spending Too Much Time in AC: ఎండలు మండిపోతున్నాయి.. ఇంటికి రాగానే ఏసీ ఆన్ చేసి ఆ చల్లటి గాలిలో సేద తీరడం మనందరికీ అలవాటు. అయితే, ఈ ఏసీలు మనకు హాయిని ఇస్తున్న మాట వాస్తవమే అయినా.. వీటిలో ఎక్కువ సమయం గడపడం మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని మీకు తెలుసా? ఏసీ గాలి నేరుగా హానికరం కాకపోవచ్చు.. కానీ సరిగ్గా మెయింటైన్ చేయని ఏసీలు, అతిగా ఉండే చల్లదనం శరీరంలో అనేక సమస్యలకు కారణమవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా ఏసీ గాలి గదిలోని తేమను పూర్తిగా లాగేస్తుంది. దీనివల్ల మన ముక్కు, గొంతు లోపల పొడిబారిపోయి.. తరచూ జలుబు, గొంతు నొప్పి, దగ్గు వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. సైనస్ ఉన్నవారికి ఇది మరింత నరకంలా మారుతుంది. ఇక చాలామంది ఏసీ రూంలో ఉన్నప్పుడు తలనొప్పిగా లేదా నీరసంగా అనిపిస్తుందని చెబుతుంటారు. ఏసీ ఫిల్టర్లలో పేరుకుపోయిన దుమ్ము, బ్యాక్టీరియా వల్ల గదిలోకి తాజా గాలి అందదు. దీనినే వైద్య పరిభాషలో 'సిక్ బిల్డింగ్ సిండ్రోమ్' అంటారు.

కేవలం శ్వాస కోశ సమస్యలే కాదు.. ఏసీ వల్ల చర్మంలోని సహజమైన తేమ తగ్గిపోయి చర్మం పొడిబారడం, దురద వంటి సమస్యలు వస్తాయి. కళ్లలో నీరు ఆరిపోయి కళ్లు ఎర్రబడటం లేదా మంట పుట్టడం జరుగుతుంది. మరోవైపు, చల్లటి గాలికి కండరాలు బిగుసుకుపోతాయి. మీరు ఇప్పటికే కీళ్ల నొప్పులు లేదా ఒళ్లు నొప్పులతో బాధపడుతుంటే.. ఏసీ గాలి ఆ నొప్పులను మరింత తీవ్రం చేస్తుంది. ముఖ్యంగా మోకాళ్ల నొప్పులు ఉన్నవారు ఏసీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

అన్నిటికంటే ప్రమాదకరమైన విషయం ఏమిటంటే.. ఎండలో నుంచి రాగానే ఒక్కసారిగా ఏసీ ముందు కూర్చోవడం. శరీర ఉష్ణోగ్రతలో వచ్చే ఈ ఆకస్మిక మార్పుల వల్ల విపరీతమైన అలసట వచ్చే అవకాశం ఉంది. అందుకే ఏసీని ఎప్పుడూ 24°C నుంచి 26°C మధ్య ఉంచడం ఆరోగ్యానికి మేలు. అలాగే అలెర్జీలు రాకుండా ఉండాలంటే ఏసీ ఫిల్టర్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story