బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ ఇదే

Best Breakfast: చాలామంది పని తొందరలో అల్పాహారాన్ని నిర్లక్ష్యం చేస్తారు. కొందరు బ్రేక్ ఫాస్ట్ మానేస్తే.. మరికొందరు ఏదో ఒకటి తిని కానిచ్చేస్తారు. కానీ, రోజంతా మీరు ఉత్సాహంగా ఉండాలన్నా, మీ జీర్ణక్రియ బాగుండాలన్నా సరైన టిఫిన్ చేయడం చాలా ముఖ్యం. ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ప్రకారం.. మీ టిఫిన్ లో ఈ మూడు పదార్థాలు ఉంటే మీరు మరింత ఆరోగ్యంగా ఉంటారు.
మొదటిది.. ఉడికించిన గుడ్లు. గుడ్లను ప్రకృతి ప్రసాదించిన 'మల్టీవిటమిన్' అని పిలుస్తారు. ఇందులో ఉండే అధిక ప్రోటీన్ కండరాల బలానికి తోడ్పడటమే కాకుండా, ఇందులోని అమినో యాసిడ్స్ మీ పేగులను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఉదయాన్నే గుడ్డు తినడం వల్ల కడుపు నిండుగా అనిపిస్తుంది, దీనివల్ల మధ్యాహ్నం వరకు అనవసరమైన జంక్ ఫుడ్ తినాలనే కోరిక కలగదు.
రెండవది.. చియా గింజలు. చిన్నగా ఉండే ఈ గింజలు పోషకాల గనులు. వీటిని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తీసుకోవడం వల్ల ఇందులోని పీచు పదార్థం మలబద్ధకం సమస్యను వదిలించి, జీర్ణక్రియను సాఫీగా ఉంచుతుంది. ఇవి పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. అంతేకాదు, తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటాయి కాబట్టి షుగర్ వ్యాధి ఉన్నవారికి ఇది చాలా మేలు చేస్తుంది.
మూడవది.. గ్రీక్ యోగర్ట్. సాధారణ పెరుగు కంటే ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అయితే తియ్యగా లేని 'ప్లెయిన్ గ్రీక్ యోగర్ట్'నే ఎంచుకోండి. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే కాల్షియం, విటమిన్ B12 ఎముకలను గట్టిపరచడంతో పాటు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.

