Stomach Problems: వర్షాకాలంలో పొట్ట సమస్యలు వేధిస్తున్నాయా? నిపుణులు చెబుతున్న కారణాలు, జాగ్రత్తలు ఇవే..
జాగ్రత్తలు ఇవే..

Stomach Problems: వర్షాకాలం ప్రారంభం కాగానే వాతావరణం చల్లబడి ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది. అయితే ఈ కాలంలో వైరల్ ఇన్‌ఫెక్షన్లతో పాటు పొట్టకు సంబంధించిన సమస్యలు కూడా అంతే వేగంగా పెరుగుతాయి. చాలా మందికి ఈ సీజన్‌లో అజీర్ణం, కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపునొప్పి లేదా విరేచనాలు వంటి సమస్యలు పదే పదే వేధిస్తుంటాయి. అసలు వర్షాకాలంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది? దీనికి గల కారణాలు, నిపుణులు సూచిస్తున్న పరిష్కారాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
పొట్ట సమస్యలకు ప్రధాన కారణాలు..
నెమ్మదించే జీర్ణక్రియ :
వర్షాకాలంలో వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మన శరీరంలో జీవక్రియల రేటు మందగిస్తుంది. ఫలితంగా మనం తినే ఆహారం త్వరగా జీర్ణం కాక, కడుపు భారంగా అనిపించడం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి.
నూనె పదార్థాల వినియోగం:
చల్లటి వాతావరణంలో వేడివేడిగా బజ్జీలు, బోండాలు, సమోసాలు వంటి నూనెలో వేయించిన పదార్థాలను తినడానికి చాలా మంది ఇష్టపడతారు. కానీ, ఇటువంటి భారీ ఆహారాలు జీర్ణవ్యవస్థపై అదనపు భారాన్ని పెంచుతాయి. ఇవి ఎసిడిటీ , గుండెల్లో మంట వంటి సమస్యలకు దారితీస్తాయి.
కలుషిత నీరు, ఆహారం:
వానల వల్ల మురుగునీరు తాగునీటి వనరుల్లో లేదా ఆహార పదార్థాల్లో చేరే ప్రమాదం ఉంది. దీనివల్ల నీటిలో, ఆహారంలో బ్యాక్టీరియా, వైరస్‌లు వేగంగా వృద్ధి చెందుతాయి. ఫలితంగా ఫుడ్ పాయిజనింగ్, వాంతులు, విరేచనాలు వంటి తీవ్రమైన పొట్ట ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బయట కట్ చేసి ఉంచిన పండ్లు, రోడ్డు పక్కన దొరికే స్ట్రీట్ ఫుడ్స్ వల్ల ఈ ప్రమాదం మరింత ఎక్కువ.
నిపుణులు సూచిస్తున్న సింపుల్ టిప్స్..
తాజా, వేడి ఆహారం:
వర్షాకాలంలో ఎప్పుడూ వేడిగా, తాజాగా వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ సమయం నిల్వ ఉంచిన పదార్థాలను తినకపోవడమే మంచిది.
కాచి చల్లార్చిన నీరు:
కేవలం సురక్షితమైన లేదా బాగా కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి. దీనివల్ల నీటి ద్వారా వచ్చే ఇన్‌ఫెక్షన్లను అడ్డుకోవచ్చు.
పండ్లు, కూరగాయల శుభ్రత:
మార్కెట్ నుండి తెచ్చిన పండ్లు, కూరగాయలను వండడానికి లేదా తినడానికి ముందు శుభ్రంగా కడగాలి. అలాగే భోజనానికి ముందు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవడం మరువకూడదు.
పెరుగు, పులియబెట్టిన ఆహారాలు: ఇవి సాధారణంగా ప్రేగుల ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ, ఇప్పటికే కడుపు నొప్పి లేదా విరేచనాల సమస్య ఉన్నవారు వైద్యుల సలహా మేరకే వీటిని తీసుకోవడం ఉత్తమం.

