ఎండలు పెరిగే కొద్దీ చెమట పట్టడం, చర్మంపై దద్దుర్లు రావడం సహజం. కానీ చంకలు, రొమ్ముల కింద, తొడల మధ్య వంటి ప్రదేశాలలో చిన్న చిన్న గడ్డలు ఏర్పడి, అవి తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంటే మీరు వెంటనే అప్రమత్తం కావాలి. ఇది వేసవి తాపం వల్ల వచ్చే సాధారణ మొటిమలు మాత్రమే కాదు, దీర్ఘకాలిక చర్మ వ్యాధి కావచ్చు.

ఏమిటీ హిడ్రాడెనిటిస్ సపురేటివా?

ఇది రోమ కుదుళ్ల వద్ద వాపు, మంటతో మొదలయ్యే పరిస్థితి. చర్మం మడతలు ఉండే చోట వెంట్రుకల కుదుళ్లు మూసుకుపోవడం వల్ల ఈ వ్యాధి సంభవిస్తుంది.

ముఖ్య లక్షణాలు:

చర్మం కింద నొప్పిగా ఉండే చిన్న గడ్డలు ఏర్పడతాయి. ఇవి క్రమంగా చీము కురుపులుగా మారుతాయి. ఈ కురుపులు పగిలినప్పుడు దుర్వాసనతో కూడిన చీము, రక్తం కారవచ్చు.

ఫిస్టులా: వ్యాధి ముదిరితే, చర్మం కింద ఒక కురుపు నుండి మరొక కురుపుకు సొరంగం వంటివి ఏర్పడతాయి.

వ్యాధి దశలు - చికిత్స

వైద్యులు ఈ వ్యాధిని నాలుగు దశలుగా విభజించారు..

మొదటి దశ: ఒకటి లేదా రెండు కురుపులు మాత్రమే ఉంటాయి. ప్రారంభంలోనే గుర్తిస్తే మందులతో నియంత్రించవచ్చు.

రెండవ దశ: గడ్డలు పెరగడం మరియు చర్మం కింద నాళాలు ఏర్పడటం మొదలవుతుంది.

3 & 4 దశలు: శరీరం అంతటా కురుపులు వ్యాపించి పరిస్థితి తీవ్రమవుతుంది. ఈ దశలో చీమును తొలగించడానికి శస్త్రచికిత్స అవసరం కావచ్చు.

ఎవరికి ముప్పు ఎక్కువ?

మహిళల్లో అధికం: హార్మోన్ల మార్పుల వల్ల మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా PCOS (పిసిఒఎస్) ఉన్నవారికి ముప్పు ఎక్కువ.

ధూమపానం: ధూమపానం చేసేవారిలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.

అధిక బరువు:

శరీరం బరువు పెరిగినప్పుడు చర్మం మడతల మధ్య రాపిడి పెరిగి ఈ సమస్య తీవ్రమవుతుంది.

నిపుణుల సూచనలు - తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

వేసవిలో అధిక చెమట వల్ల బ్యాక్టీరియా పెరిగి ఈ వ్యాధి మరింత ముదురుతుంది. దీన్ని అదుపులో ఉంచడానికి ఈ క్రింది చిట్కాలు పాటించండి..

స్వీయ చికిత్స వద్దు: కురుపులను సొంతంగా పగలగొట్టడానికి ప్రయత్నించకండి. దీనివల్ల ఇన్ఫెక్షన్ ఇతర భాగాలకు వ్యాపిస్తుంది.

బట్టల విషయంలో జాగ్రత్త:

కొత్త బట్టలు కొన్నప్పుడు వాటిని ఉతికిన తర్వాతే ధరించండి. వదులుగా ఉండే కాటన్ దుస్తులు మేలు.

బరువు తగ్గడం: అధిక బరువును తగ్గించుకోవడం ద్వారా చర్మం మధ్య రాపిడిని తగ్గించవచ్చు.

ధూమపానానికి స్వస్తి: వ్యాధి తీవ్రత తగ్గాలంటే ధూమపానాన్ని పూర్తిగా మానేయాలి.

వేసవిలో చర్మ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. ఏ చిన్న గడ్డనైనా సాధారణమైనదిగా భావించకుండా, అది మొండిగా మారుతుంటే వైద్య సహాయం పొందడం ఉత్తమం.

PolitEnt Media

PolitEnt Media

Next Story