Throwing Away Potato Peels: సాధారణంగా మనం కూరలు వండేటప్పుడు బంగాళాదుంప తొక్కలను పనికిరాని చెత్తగా భావించి పారేస్తూ ఉంటాం. కానీ, తోటపని నిపుణులు, మట్టి సూక్ష్మజీవ శాస్త్రవేత్తల ప్రకారం... వీటిని పారేయడం అంటే డబ్బును వృధా చేసుకోవడమే! అవును, మీ ఇంట్లోని మొక్కలను బలంగా, ఆరోగ్యంగా పెంచడానికి వంటగదిలోని ఈ వ్యర్థాలు అద్భుతంగా పనిచేస్తాయి. మరి ఈ తొక్కలను 6 సులువైన మార్గాలలో ఎలా ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం.

వానపాములకు ఆహారంగా:

మీరు ఇంట్లో వర్మీకంపోస్ట్ అంటే వానపాముల ఎరువు తయారు చేస్తున్నట్లయితే, ఈ తొక్కలు బాగా ఉపయోగపడతాయి. అయితే వీటిని ముందుగా కొద్దిగా ఉడకబెట్టి వేయడం మంచిది. లేదంటే మట్టిలోని తేమకు వీటి నుండి కొత్త మొక్కలు మొలుస్తాయి. ఉడకబెట్టడం వల్ల వానపాములు కూడా వీటిని తేలికగా తిని, మట్టిని మరింత సారవంతంగా మారుస్తాయి.

బూజు తెగుళ్ల నివారణకు:

మొక్కలకు బూజు తెగులు సోకినప్పుడు ఈ తొక్కలు మంచి సహజ మందుగా పనిచేస్తాయి. బంగాళాదుంపలలో ఉండే ‘సోలనిన్’ అనే పదార్థం దీనికి తోడ్పడుతుంది. తొక్కలను నీళ్లలో బాగా ఉడకబెట్టి, ఆ నీటిని చల్లార్చి మొక్కలపై స్ప్రే చేస్తే... బూజు తెగుళ్లు పూర్తిగా తగ్గిపోతాయి.

మొక్కల కింద పాతిపెట్టడం:

టమోటాలు, క్యాబేజీ, గుమ్మడికాయ వంటి ఎక్కువ పోషకాలు కావాల్సిన మొక్కలను నాటే ముందు... మట్టిలో 6 నుండి 8 అంగుళాల లోతులో గుంత తీసి, అందులో ఈ తొక్కలను వేసి పూడ్చేయాలి. ఆ తర్వాత వాటి పైన మొక్కలను నాటాలి. ఇవి మట్టిలో నెమ్మదిగా కుళ్ళిపోతూ, మొక్కల వేర్లకు కావలసిన పోషకాలను అందిస్తాయి.

కంపోస్ట్‌లో నత్రజని పెంచడానికి:

ఇంట్లోనే కంపోస్ట్ ఎరువు తయారు చేసేవారు, అందులో నత్రజని (Nitrogen) శాతాన్ని పెంచడానికి ఈ తొక్కలను కలపవచ్చు. అయితే, ఇవి మొలకెత్తకుండా ఉండటానికి తొక్కలను వేసిన తర్వాత కంపోస్ట్ మిశ్రమంతో బాగా కప్పి ఉంచాలి.

పుట్టగొడుగుల పెంపకానికి:

మీకు ఇంట్లోనే పుట్టగొడుగులు (Mushrooms) పెంచే అలవాటు ఉంటే... ఈ తొక్కలను చిన్న చిన్న చెక్క ముక్కలతో కలిపి, అందులో పుట్టగొడుగుల బీజాలను వేయాలి. ఈ తొక్కలు పుట్టగొడుగులు పెరగడానికి మంచి ఆహారంగా ఉపయోగపడతాయి.

నత్తలను పట్టుకోవడానికి:

తోటలో మొక్కలను పాడుచేసే నత్తలను పట్టుకోవడానికి ఇదొక వలలా పనిచేస్తుంది. ఒక ఖాళీ కుండీ కింద కొన్ని తొక్కలను పెట్టి, బోర్లించాలి. నత్తలు లోపలికి వెళ్లడానికి వీలుగా ఒక చిన్న కొమ్మను కుండీ అంచు కింద పెట్టి కొద్దిగా గ్యాప్ ఇవ్వాలి. తొక్కలలో ఉండే పిండిపదార్థం కోసం నత్తలన్నీ రాత్రి పూట లోపలికి వెళ్లి దాక్కుంటాయి. ఉదయాన్నే వాటిని సులువుగా తీసి పారేయవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story