Dark Circles Under Your Eyes: నేటి ఆధునిక జీవనశైలిలో చాలామందిని వేధిస్తున్న ప్రధాన సౌందర్య సమస్యల్లో కంటి కింద నల్లటి వలయాలు ఒకటి. నిద్రలేమి, కంప్యూటర్లు, మొబైల్ స్క్రీన్ల ముందు గంటల తరబడి గడపడం, శరీరంలో నీటి శాతం తగ్గడం, విపరీతమైన ఒత్తిడి వంటివి ఈ సమస్యకు ముఖ్య కారణాలుగా మారుతున్నాయి. మార్కెట్లో దొరికే ఖరీదైన క్రీములతో పనిలేకుండా, మన ఇంట్లో లభించే సహజసిద్ధమైన వస్తువులతోనే ఈ నల్లటి వలయాలను ఎలా మాయం చేయాలో ఇప్పుడు చూద్దాం.

కీరదోసకాయ:

కీరదోసకాయలో చర్మాన్ని చల్లబరిచే గుణాలతో పాటు సమృద్ధిగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కీరదోసకాయను గుండ్రటి ముక్కలుగా కోసి, ఒక 10-15 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచి చల్లబరచాలి. ఆ తర్వాత ఆ ముక్కలను కళ్లపై ఉంచుకోవాలి. ఇది కళ్ల చుట్టూ రక్తప్రసరణను మెరుగుపరిచి, అలసటను తగ్గించడమే కాకుండా నల్లటి వలయాలను వేగంగా తగ్గిస్తుంది.

బంగాళాదుంప రసం:

బంగాళాదుంపలో సహజసిద్ధమైన బ్లీచింగ్ గుణాలు ఉంటాయి. ఇది చర్మంపై ఉన్న నలుపును తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. బంగాళాదుంపను తురిమి రసం తీసి, అందులో దూది ముంచి కళ్ల కింద నల్లటి వలయాలు ఉన్న భాగంలో రాయాలి. 10-15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి.

అలోవెరా జెల్ :

కలబంద చర్మానికి మంచి తేమను అందిస్తుంది. రాత్రి పడుకునే ముందు కొద్దిగా తాజా అలోవెరా జెల్‌ను కళ్ల కింద నల్లటి వలయాలపై రాసి మెల్లగా మసాజ్ చేయాలి. ఇది చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచి, నలుపుదనాన్ని క్రమంగా తగ్గిస్తుంది.

గ్రీన్ టీ బ్యాగ్స్:

గ్రీన్ టీ తాగిన తర్వాత మిగిలిపోయే టీ బ్యాగులను పారేయకుండా ఫ్రిజ్‌లో కాసేపు ఉంచాలి. ఆ చల్లటి టీ బ్యాగులను కళ్లపై 10 నిమిషాల పాటు ఉంచుకోవడం వల్ల అందులోని కెఫిన్, యాంటీ ఆక్సిడెంట్లు కళ్ల వాపును నల్లటి వలయాలను తగ్గిస్తాయి.

బాదం నూనె :

బాదం నూనెలో విటమిన్-ఇ పుష్కలంగా ఉంటుంది. రోజూ రాత్రి పడుకునే ముందు కొన్ని చుక్కల బాదం నూనెను కళ్ల చుట్టూ రాసి వేళ్లతో వృత్తాకారంలో మృదువుగా మసాజ్ చేయాలి. మరుసటి రోజు ఉదయం చల్లటి నీటితో కడిగేసుకోవాలి. దీనివల్ల కళ్ల చుట్టూ ఉన్న చర్మం కాంతివంతంగా మారుతుంది.

ముఖ్య గమనిక

ఈ ఇంటి చిట్కాలతో పాటు రోజుకు కనీసం 7 నుండి 8 గంటల పాటు ప్రశాంతమైన నిద్ర పోవడం, శరీరానికి సరిపడా నీరు తాగడం, మొబైల్ స్క్రీన్ల వాడకాన్ని తగ్గించడం ద్వారా డార్క్ సర్కిల్స్ సమస్య నుండి శాశ్వతంగా ఉపశమనం పొందవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story