Unable to Sleep at Night: రాత్రి నిద్ర పట్టట్లేదా? మీలోని ఈ అలవాట్లే దానికి కారణం కావచ్చు..
మీలోని ఈ అలవాట్లే దానికి కారణం కావచ్చు..

Unable to Sleep at Night: మనం ఆరోగ్యంగా ఉండటానికి పౌష్టికాహారం, నీరు ఎంత ముఖ్యమో.. ప్రశాంతమైన నిద్ర కూడా అంతే ముఖ్యం. సాధారణంగా శారీరక, మానసిక ఆరోగ్యం బాగుండాలంటే రోజుకు 8 నుండి 9 గంటల నిద్ర అవసరమని నిపుణులు చెబుతుంటారు. కానీ, ప్రస్తుత రోజుల్లో చాలా మంది నిద్రలేమి సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నారు. బెడ్‌పై ఎంత అటు ఇటు దొర్లినా నిద్రపట్టక ఇబ్బంది పడుతుంటారు. అయితే మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు, అలవాట్లే ఈ నిద్రలేమికి ప్రధాన కారణమవుతున్నాయి. మరి నిద్రకు భంగం కలిగించే ఆ అలవాట్లు ఏంటో, వాటిని ఎలా అధిగమించాలో ఇప్పుడు చూద్దాం.
నిద్రపోయే ముందు ఫోన్ చూడటం:
చాలా మందికి పడుకునే ముందు మొబైల్ స్క్రీన్ వైపు చూసే అలవాటు ఉంటుంది. ఫోన్ నుండి వెలువడే బ్లూ లైట్ మన శరీరంలోని సర్కాడియన్ రిథమ్ ను పూర్తిగా దెబ్బతీస్తుంది. ఇది నిద్రను నియంత్రించే మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఫలితంగా నిద్రలేమి, చిరాకు, పగటిపూట నిరసంగా ఉండటం వంటి సమస్యలు తలెత్తుతాయి.
కాఫీ, మద్యం సేవించడం:
కాఫీ, టీలలో ఉండే కెఫీన్ మెదడును ఉత్తేజపరుస్తుంది. నిద్రపోయే నాలుగు గంటల ముందు కాఫీ లేదా టీ తాగడం వల్ల నిద్ర రావడం కష్టమవుతుంది. అలాగే రాత్రిపూట మద్యం సేవించడం వల్ల కూడా నిద్ర నాణ్యత పూర్తిగా దెబ్బతింటుంది.
లేట్ నైట్ భారీ భోజనం:
పడుకునే ముందు లేదా నిద్రకు గంట ముందు బిర్యానీలు, హెవీ ఫుడ్స్ వంటి భారీ భోజనం అస్సలు తీసుకోకూడదు. భారీ భోజనం చేయడం వల్ల మీరు పడుకున్నా కూడా శరీరం ఆ ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల జీర్ణక్రియ మందగించి నిద్రకు ఆటంకం కలుగుతుంది.
పగటిపూట అతిగా నిద్రపోవడం:
కొంతమందికి మధ్యాహ్నం లేదా పగటిపూట గంటల తరబడి నిద్రపోయే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు రాత్రి వేళల్లో సహజంగానే మీ నిద్రను పాడు చేస్తుంది. పగటి నిద్రను వీలైనంత వరకు తగ్గించుకుంటే రాత్రి వేళల్లో త్వరగా నిద్రపడుతుంది.
బెడ్‌పైకి వెళ్లాక అతిగా ఆలోచించడం
రోజంతా జరిగిన విషయాల గురించి, భవిష్యత్తు గురించి బెడ్‌పై పడుకున్నాక అతిగా ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి కారణంగా శరీరంలో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ విడుదలవుతుంది. ఇది నిద్రను దూరం చేసి, మిమ్మల్ని రాత్రంతా మేల్కొనేలా చేస్తుంది.
ధూమపానం
పడుకునే ముందు సిగరెట్లు తాగే అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలి. పొగాకులో ఉండే నికోటిన్ మెదడును అలర్ట్‌గా ఉంచుతుంది, దీనివల్ల కంటి నిండా నిద్రపోవడం సాధ్యం కాదు.
శారీరక శ్రమ లేకపోవడం
ప్రస్తుత నిశ్చల జీవనశైలి అంటే రోజంతా కూర్చుని పనిచేయడం, ఎలాంటి శారీరక శ్రమ లేకపోవడం కూడా నిద్రలేమికి ఒక పెద్ద కారణం. పగటిపూట కొద్దిగా వ్యాయామం లేదా వాకింగ్ చేయడం వల్ల రాత్రి వేళల్లో హాయిగా నిద్ర పడుతుంది.

