Eyeliner to Stay Perfect All Day: రోజంతా ఐ-లైనర్ చెదిరిపోకూడదా? ఈ సింపుల్ బ్యూటీ సీక్రెట్స్ పాటించండి!
ఈ సింపుల్ బ్యూటీ సీక్రెట్స్ పాటించండి!

Eyeliner to Stay Perfect All Day: కళ్లు మన ముఖంలోనే అత్యంత ఆకర్షణీయమైన భాగం. అందుకే కళ్లను మరింత అందంగా, ఇంపుగా తీర్చిదిద్దుకోవడానికి అమ్మాయిలు ఎంతో ఇష్టపడతారు. ముఖానికి మేకప్ వేసుకున్నా, వేసుకోకపోయినా.. కేవలం ఐ-లైనర్ పెట్టుకుంటే చాలు, ముఖం క్షణాల్లో వెలిగిపోతుంది. అయితే, ఎంతో కష్టపడి, ఓపిగ్గా పెట్టుకున్న ఐ-లైనర్.. కాసేపటికే చెదిరిపోతేనో, లేదా కళ్ల కిందకు పాకి నల్లగా మారిపోతేనో ఆ బాధ వర్ణనాతీతం. మరి రోజంతా ఐ-లైనర్ అస్సలు చెదిరిపోకుండా, పర్ఫెక్ట్‌గా ఉండాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం
ఐ-లైనర్ పెట్టుకోవడానికి ముందు కనురెప్పల చుట్టూ ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. కనురెప్పలపై నూనె లేదా జిడ్డు ఉంటే ఐ-లైనర్ త్వరగా చెదిరిపోతుంది. అందుకే, ముందుగా ఫేస్ వాష్‌తో ముఖాన్ని కడుక్కుని, ఆ తర్వాత ఐ-ప్రైమర్ (Eye Primer) లేదా కొద్దిగా కన్సీలర్ అప్లై చేయాలి. ఇది ఐ-లైనర్ కనురెప్పకు బాగా అంటుకునేలా చేసి, ఎక్కువ సమయం ఉండేలా చూస్తుంది.
రెండో చిట్కా.. ప్రైమర్ రాసిన తర్వాత కనురెప్పలపై కొద్దిగా లూజ్ పౌడర్ లేదా ట్రాన్స్‌లుసెంట్ పౌడర్‌ను బ్రష్‌తో అద్దాలి. ఇది కళ్ల చుట్టూ ఉండే అదనపు జిడ్డును పీల్చేసుకుంటుంది. దీనివల్ల మీరు వేసుకునే లైనర్ రోజంతా స్మడ్జ్ అవ్వకుండా ఉంటుంది.
అలాగే ఎంచుకునే ఐ-లైనర్ క్వాలిటీ కూడా చాలా ముఖ్యం. మార్కెట్లో దొరికే సాధారణ లైనర్స్ కంటే.. 'వాటర్‌ప్రూఫ్' (Waterproof)'స్మడ్జ్‌ప్రూఫ్' (Smudge-proof) లైనర్లను ఎంచుకోవడం ఎల్లప్పుడూ మంచిది. ముఖ్యంగా ఎండకాలంలో లేదా లాంగ్ జర్నీల సమయంలో లిక్విడ్ లైనర్ కంటే జెల్ లైనర్ లేదా స్కెచ్ లైనర్ ఎక్కువసేపు నిలుస్తాయి. ఐ-లైనర్ పెట్టుకున్న తర్వాత, అది కాస్త ఆరిపోయాక.. అదే రంగులో ఉండే ఐ-షాడో పౌడర్‌ను ఒక సన్నటి బ్రష్‌తో ఆ లైనర్ పైన లైట్‌గా అద్దండి. ఇది లైనర్‌ను ప్యాక్ చేసి, లాక్ చేస్తుంది.

