Suddenly Quit Alcohol and Smoking: చాలామంది చైన్ స్మోకింగ్, అతిగా మద్యం సేవించడం వంటి అలవాట్లకు బానిసవుతుంటారు. ఇవి ప్రాణాలకు ముప్పు అని తెలిసినా, ఆ క్షణికానందం కోసం ఆరోగ్యాన్ని పణంగా పెడతారు. ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్య తలెత్తినప్పుడు మాత్రమే హుటాహుటిన డాక్టర్ దగ్గరకు పరిగెత్తుతారు. అప్పుడు డాక్టర్లు ఇచ్చే మొదటి సలహా.. ముందు ఆ సిగరెట్, లిక్కర్ మానేయండి అని. కానీ, ఏళ్ల తరబడి అలవాటు పడిన మనసును మార్చుకోవడం అంత సులభం కాదు. మరి వీటిని మానేస్తే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి? వీటి నుంచి ఎలా బయటపడాలి? ఇప్పుడు తెలుసుకుందాం.

అలవాట్లు మానేస్తే ఏం జరుగుతుంది?

మొదటగా మీరు సిగరెట్ మానేసిన కేవలం 20 నిమిషాల్లోనే మీ రక్తపోటు సాధారణ స్థితికి రావడం మొదలవుతుంది. 24 గంటల్లో ఊపిరితిత్తులు శుభ్రపడటం ప్రారంభమవుతుంది. ఇక మద్యం మానేయడం వల్ల మీ కాలేయం (Liver) తనను తాను పునరుద్ధరించుకుంటుంది. మీ మెదడు చురుగ్గా మారుతుంది, నిద్ర నాణ్యత పెరుగుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా మీ శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రమాదాల బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకున్నవారవుతారు. మీ ముఖంలో కాంతి పెరుగుతుంది.. మీ జేబులో డబ్బు కూడా మిగులుతుంది.

దూరంగా ఉండటం ఎలా?

ఇది ఒక్క రోజులో సాధ్యం కాకపోవచ్చు, కానీ అసాధ్యం మాత్రం కాదు.మీరు ఎందుకు మానేయాలనుకుంటున్నారో ఒక బలమైన కారణాన్ని వెతుక్కోండి. అది మీ ఆరోగ్యం కావచ్చు లేదా మీ కుటుంబం కావచ్చు.మద్యం, ధూమపానం గుర్తొచ్చినప్పుడు వెంటనే వేరే పనిలో నిమగ్నం అవ్వండి. మంచి నీళ్లు తాగడం లేదా చిన్నపాటి వ్యాయామం చేయడం వల్ల ఆ కోరిక తగ్గుతుంది.

ఈ అలవాట్లు ఉన్న స్నేహితులకు కొన్ని రోజులు దూరంగా ఉండండి. మీ సంకల్పాన్ని బలపరిచే వారితో సమయం గడపండి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోండి. ఇవి మీ శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయపడతాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story