Stop Drinking Tea for a Month: మన దేశంలో చాలా మందికి ఉదయం కప్పు వేడి వేడి టీ పడకపోతే రోజూ గడవడం కష్టం. అలసటగా అనిపించినా, స్నేహితులతో కాలక్షేపం చేయాలన్నా చాయ్ ఉండాల్సిందే. టీ తాత్కాలికంగా ఉత్సాహాన్ని ఇచ్చినప్పటికీ, పరిమితికి మించి తాగడం వల్ల శరీరంలో కెఫిన్ చక్కెర పరిమాణం పెరిగి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఒకవేళ మీరు కేవలం 30 రోజుల పాటు టీ తాగడం పూర్తిగా మానేస్తే శరీరంలో ఎలాంటి సానుకూల మార్పులు వస్తాయో ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.

వేగంగా బరువు తగ్గుతారు

సాధారణంగా మనం తాగే మిల్క్ టీలో చక్కెర, పాలు ఎక్కువగా ఉండటం వల్ల కేలరీలు భారీగా ఉంటాయి. రోజుకు 2-3 సార్లు టీ తాగే అలవాటు ఉన్నవారు నెల రోజుల పాటు దానికి దూరంగా ఉంటే, శరీరంలోకి అదనపు కేలరీలు చేరడం ఆగిపోతుంది. ఇది మీ శరీర బరువును, ముఖ్యంగా పొట్ట చుట్టూ ఉండే కొవ్వును వేగంగా తగ్గించడానికి సహాయపడుతుంది.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది

పాలతో చేసిన టీలో ఉండే కెఫిన్ మరియు టానిన్లు జీర్ణ ప్రక్రియను నెమ్మదించేలా చేస్తాయి. దీనివల్ల చాలా మందిలో అసిడిటీ, గ్యాస్, కడుపు ఉబ్బరం లేదా మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఒక నెల పాటు టీ మానేయడం వల్ల జీర్ణవ్యవస్థ తిరిగి తన సహజ రూపాన్ని పుంజుకుంటుంది. కడుపులో మంట తగ్గి జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది.

హాయిగా నిద్ర పడుతుంది

టీలో ఉండే కెఫిన్ మెదడును నిరంతరం ఉత్తేజితంగా ఉంచడం వల్ల చాలా మందిలో నిద్రలేమి సమస్యలు వస్తాయి. రాత్రి వేళల్లో టీ తాగే అలవాటు ఉంటే నిద్ర చక్రం దెబ్బతింటుంది. ఒక నెల పాటు టీకి దూరంగా ఉండటం వల్ల శరీరంలో కెఫిన్ స్థాయిలు తగ్గి, రాత్రి వేళల్లో త్వరగా, ప్రశాంతంగా నిద్ర పడుతుంది.

రోజంతా స్థిరమైన శక్తి

సాధారణంగా టీ తాగిన వెంటనే శరీరంలో ఇన్స్టంట్ ఎనర్జీ వచ్చినట్లు అనిపిస్తుంది, కానీ కాసేపటికే ఆ ఎనర్జీ పడిపోయి మళ్లీ నీరసంగా మారుతాం. దీనినే కాఫీ, టీ క్రాష్ అంటారు. అయితే టీ పూర్తిగా మానేసిన కొన్ని రోజుల తర్వాత, మీ శరీరం సహజ సిద్ధమైన శక్తిని ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. దీనివల్ల రోజంతా నీరసం లేకుండా స్థిరమైన ఉత్సాహంతో ఉండవచ్చు.

మెరిసే చర్మం

టీలో ఉండే చక్కెర, కెఫిన్ చర్మ రంధ్రాలను దెబ్బతీసి, ముఖంపై మొటిమలు, పొడిబారడం వంటి సమస్యలకు కారణమవుతాయి. టీ మానేయడం వల్ల శరీరంలోని టాక్సిన్స్, సులభంగా బయటకు పోయి, చర్మం మరింత ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మారుతుంది.

గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది

అధికంగా టీ తాగడం వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. నెల రోజుల పాటు టీకి దూరంగా ఉండటం వల్ల బీపీ నియంత్రణలోకి రావడమే కాకుండా, గుండె పనితీరు మెరుగుపడి గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

ఆరంభంలో వచ్చే ఇబ్బందులు

రెగ్యులర్‌గా టీ తాగే అలవాటు ఉన్నవారు హఠాత్తుగా మానేసిన మొదటి 2 నుండి 3 రోజులు తీవ్రమైన తలనొప్పి, అలసట, నీరసం లేదా చిరాకు వంటి లక్షణాలు కనిపించవచ్చు. అయితే, ఈ ప్రారంభ దశను తట్టుకుని నిలబడితే, మీ శరీరం అద్భుతమైన ప్రయోజనాలను పొందుతుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story