కొత్త తరానికి పబ్లిక్ మాట్లాడటమే అతిపెద్ద సవాల్‌గా ఎందుకు మారుతోంది?

జెన్ జీ… ఈ మధ్యకాలంలో తరచుగా వినిపిస్తున్న పదం. 1997 తర్వాత పుట్టిన వారిని జెన్ జీగా పిలుస్తున్నారు. అంతకుముందు తరం మిలీనియల్స్. ప్రతి తరానికి ప్రత్యేకమైన ఆలోచనలు, అలవాట్లు ఉంటాయి. కానీ జెన్ జీ జీవనశైలి మాత్రం పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది.

జెన్ జీ తరం ఇష్టానిష్టాలు, సామాజిక ప్రవర్తన, వ్యక్తులతో వ్యవహరించే తీరు అన్నీ కొత్తదనంతో నిండి ఉంటాయి. వీరి ఆలోచనలు పెద్దలకు సులభంగా అర్థం కావు. సంప్రదాయంగా “నలుగురితో నవ్వుతూ మాట్లాడాలి” అనే భావన జెన్ జీకి అంతగా నచ్చడం లేదు.

కొత్తవాళ్లతో కలివిడిగా మాట్లాడడం జెన్ జీకి అసౌకర్యంగా అనిపిస్తుంది. పదిమందిలో కొత్త వ్యక్తులతో సంభాషించాల్సి వస్తే, చాలామంది జెన్ జీ యువత సంకోచానికి లోనవుతారు. అయితే దీన్ని పూర్తిగా మౌనంగా ఉండటం అని అనుకోవద్దు. తమ స్నేహితులు, పరిచయమైన వ్యక్తులతో మాత్రం వారు సహజంగానే మాట్లాడతారు. సమస్య కొత్తవాళ్లు, పబ్లిక్ వాతావరణమే.

జెన్ జీ యువత తమ అభిరుచులకు, భావజాలానికి సరిపడే వారితో సేఫ్‌గా అనిపించే వాతావరణంలో మాట్లాడగలుగుతారు. క్లాస్‌రూమ్, ఫ్రెండ్ సర్కిల్ వంటి ప్రదేశాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అదే అలవాటు పబ్లిక్‌లో కొత్తవాళ్లను ఎదుర్కోవాల్సిన సందర్భంలో అడ్డంకిగా మారుతోంది.

ఈ ప్రవర్తనను తేలిగ్గా తీసుకోవద్దని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. జెన్ జీ మనస్తత్వాన్ని లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని వారు చెబుతున్నారు. ఎందుకు కొత్తవాళ్లతో మాట్లాడటానికి బెరుకు ఏర్పడుతోందో అర్థం చేసుకున్నప్పుడే సరైన పరిష్కారాలు కనిపిస్తాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల జెన్ జీ ప్రవర్తన నుంచి పుట్టిన కొత్త పదం “టాక్‌వర్డ్‌నెస్ (Talkwardness)”. అంటే మాటలంటే ఇష్టం లేకపోవడం, ముఖాముఖి సంభాషణల్లో అసౌకర్యం కలగడం. జెన్ జీ యువత చూపులు ఎదురుగా ఉన్నవారితో కలవకపోవడం, మాటలు భారంగా అనిపించడం వంటి లక్షణాలు ఇందులో భాగంగా కనిపిస్తున్నాయి.

ఆన్‌లైన్ ప్రపంచంలో చురుకుగా ఉండే జెన్ జీ యువతకు, కొత్త వ్యక్తులతో ప్రత్యక్షంగా మాట్లాడటం పెద్ద సవాలుగా మారింది. కారణం—ప్రతిదీ డిజిటల్‌గా మారిపోయిన జీవితం. మార్కెట్‌కు వెళ్లి మాట్లాడే అవసరం లేకుండా, ఆన్‌లైన్ ఆర్డర్లతో జీవితం సులభమైంది. ఈ సౌలభ్యమే ప్రత్యక్ష సంభాషణ నైపుణ్యాన్ని తగ్గిస్తోంది.

ఇందుకు కోవిడ్ మహమ్మారి కూడా ప్రధాన కారణంగా మారింది. ఆ సమయంలో వ్యక్తులతో కలవలేని పరిస్థితులు, వర్చువల్ కమ్యూనికేషన్‌కు అలవాటు పడేలా చేశాయి. దాంతో కొత్త వ్యక్తులు ఎదురైతే అసౌకర్యంగా ఫీలయ్యే పరిస్థితి ఏర్పడింది. దీనిని నిపుణులు FOMO – Fear of Mild Awkwardness గా కూడా వివరిస్తున్నారు.

జెన్ జీ యువత మాల్స్, పార్కులు వంటి ప్రదేశాల్లో స్నేహితులతో గడపడం ఇష్టపడుతుంది. కానీ పాత తరంలా ఇళ్లకు వెళ్లి బంధువులు, కొత్త వ్యక్తులతో మాట్లాడటం మాత్రం కష్టంగా భావిస్తుంది. ఇది వ్యాధి కాదు. కానీ సామాజిక నైపుణ్యాల కోసం సాధనతో మార్పు తీసుకురావాల్సిన అవసరం మాత్రం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story