High Blood Pressure and Diabetes: ఉద్యోగ ఒత్తిడి, మారిన జీవనశైలి సిలికాన్ సిటీ పురుషుల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. మహిళలతో పోలిస్తే పురుషులలో బీపీ, షుగర్ కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తాజా నివేదిక హెచ్చరించింది. ఆఫీస్ టార్గెట్లు, కుటుంబ బాధ్యతల మధ్య నలిగిపోతూ పురుషులు తమ ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

ముంచుకొస్తున్న ముప్పు.. కారణాలు ఇవే..

కదలకుండా కూర్చోవడం:

ఆఫీసుల్లో గంటల తరబడి కంప్యూటర్ల ముందే కూర్చుని పని చేయడం.

తీవ్ర మానసిక ఒత్తిడి:

సాఫ్ట్‌వేర్, కార్పొరేట్ రంగాల్లో టార్గెట్లు రీచ్ అవ్వాలనే ఒత్తిడి, బెంగళూరు ట్రాఫిక్ జామూ మానసిక ప్రశాంతతను దూరం చేస్తున్నాయి.

వ్యాయామం లేకపోవడం:

రోజువారీ జీవితంలో శారీరక శ్రమ, యోగా లేదా కనీస వ్యాయామం లేకపోవడం.

ఆహారపు అలవాట్లు:

జంక్ ఫుడ్ సంస్కృతి, నూనెలు, ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉండే ప్రాసెస్డ్ ఫుడ్స్ అధికంగా తీసుకోవడం.

వ్యసనాలు:

ధూమపానం, మద్యపానం అలవాట్లు రక్తనాళాల పనితీరును, జీవక్రియను దెబ్బతీస్తున్నాయి.

ఈ సైలెంట్ కిల్లర్స్ భవిష్యత్తులో గుండెపోటు, కిడ్నీ ఫెయిల్యూర్లకు దారితీసే ప్రమాదం ఉందని, కాబట్టి పురుషులు వెంటనే మేల్కొని తమ లైఫ్‌స్టైల్‌ను మార్చుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిపుణులు సూచిస్తున్న కొన్ని సులభమైన జాగ్రత్తలు..

ఆఫీసులో చిన్న విరామం:

గంటల తరబడి ఒకే చోట కూర్చోకుండా, ప్రతి 45 నిమిషాలకు ఒకసారి సీటు నుండి లేచి ఆఫీస్ క్యాంపస్‌లోనే 5 నిమిషాల పాటు నడవాలి. లిఫ్ట్‌లకు బదులు మెట్లు వాడటం మంచిది.

ఆహారంలో మార్పులు:

జంక్ ఫుడ్, బేకరీ ఐటమ్స్‌కు దూరంగా ఉండాలి. నిత్యం తినే ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. కాఫీ, టీలలో చక్కెరను, వంటల్లో ఉప్పును తగ్గించాలి.

మెడిటేషన్, నిద్ర:

ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు రోజుకు కనీసం 10 నిమిషాల పాటు ప్రాణాయామం లేదా ధ్యానం చేయాలి. హార్మోన్ల సమతుల్యత కోసం రోజుకు 7 నుండి 8 గంటల ప్రశాంతమైన నిద్ర అవసరం.

హెల్త్ చెకప్స్:

30 ఏళ్లు దాటిన ప్రతి పురుషుడు ఏడాదికి ఒకసారైనా తప్పనిసరిగా మాస్టర్ హెల్త్ చెకప్ (బ్లడ్ టెస్టులు) చేయించుకోవాలి. ప్రారంభంలోనే వీటిని గుర్తిస్తే ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా సులువుగా నియంత్రించవచ్చని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story