తెలంగాణలో కాంగ్రెస్ కుట్రలను ప్రజలకు వివరిస్తాం

బీసీల రిజర్వేషన్ల అమలుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ల అమలు వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని మండిపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు పేరుతో ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం దుర్మార్గమన్నారు. ముస్లింలను బీసీ రిజర్వేషన్ల జాబితా నుండి తొలగించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. తక్షణమే బీసీ జాబితా నుండి ముస్లింలను తొలగించి 42 శాతం రిజర్వేషన్లను పూర్తిగా బీసీలకే దక్కేలా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 51 శాతమున్న బీసీలకు 32 శాతం మాత్రమే రిజర్వేషన్లు అమలు చేస్తామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం 12 శాతమున్న ముస్లింలకు మాత్రం వందకు వంద శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు సిద్ధమవడం దుర్మార్గమన్నారు. బనకచర్ల విషయంలో కేంద్రం రెండు రాష్ట్రాల సీఎంలతో సమావేశం ఏర్పాటు చేయడాన్ని స్వాగతించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ వాదనను బలంగా విన్పించాలని కోరారు. ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి హాజరైన బండి సంజయ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఏమన్నారంటే...

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే టెన్త్ విద్యార్థులందరికీ సైకిళ్లను అందజేస్తున్నాం. 20 వేలకుపైగా సైకిళ్లను పంపిణీ చేస్తున్నం.

బనకచర్ల ప్రాజెక్టు అంశంపై కేంద్ర ప్రభుత్వం రేపు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కాబోతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ వాదనను బలంగా విన్పించాలని కోరుతున్నా. కేంద్రానికి అన్ని రాష్ట్రాలూ సమానమే. ఏ రాష్ట్రానికి అన్యాయం చేయదు. ఇప్పటికే కేంద్రం ఈ విషయాన్ని స్ప్టంగా ప్రకటించాలి. బనకచర్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగకుండా సమష్టిగా క్రుషి చేద్దాం. ఈ విషయంలో రాష్ట్ర వాదనను సీఎంల మీటింగ్ లో రేవంత్ రెడ్డి గట్టిగా విన్పించాలి.

బీసీ రిజర్వేషన్ల అమలు వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. ప్రభుత్వం వాస్తవాలను కప్పి పుచ్చే ప్రయత్నం చేస్తోంది. అవాస్తవాలను మీడియా ద్వారా ప్రజలకు చేరవేస్తోంది. కొన్ని బీసీ సంఘాలు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ బీసీలకు అన్యాయం చేస్తున్నాయి. వైఎస్ హయాంలో ముస్లింలను బీసీల్లో చేర్చి 4 శాతం రిజర్వేషన్లను అమలు చేసింది. ఆ టైంలోనే బీసీ సంఘాలు అడ్డుకుని ఉంటే బీసీలకు అన్యాయం జరిగేది కాదు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇస్తేనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీలకు తీవ్రమైన అన్యాయం జరిగింది. ఇప్పుడు 10 శాతం ఇస్తామంటున్నారు. ఇది దారుణం.

వాస్తవానికి బీసీ జనాభా రాష్ట్రంలో 51 శాతం ఉంది. సమగ్ర కుటుంబ సర్వేలోనే ఈ విషయాన్ని తేల్చారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన పేరుతో బీసీల జనాభాను 46 శాతానికి తగ్గించారు. అంటే బీసీల సంఖ్యను 5 శాతం తగ్గించేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెబుతూ అందులో 10 శాతం రిజర్వేషన్లు ముస్లింలకు అమలు చేస్తున్నారు. తద్వారా బీసీలకు దక్కే రిజర్వేషన్లు 32 శాతమే. మోదీ ప్రభుత్వం ఇప్పటికే బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అదనంగా ఇస్తున్న రిజర్వేషన్లు 5 శాతమే. దీనివల్ల బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. అట్లాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అందులో ముస్లింలు లబ్ది పొందుతున్నారు. రాష్ట్రంలో 12 శాతం మంది ముస్లింలు ఉంటే... కాంగ్రెస్ 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా ముస్లింలకు ఇకపై వందకు వంద శాతం రిజర్వేషన్లు పొందబోతున్నారు. బీసీలకు మాత్రం తీవ్రమైన అన్యాయం జరగబోతోంది. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్దం. అయినా ఆర్డినెన్స్ తీసుకువస్తామని చెప్పడం దుర్మార్గం. ముస్లింలకు వందకు వందశాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నప్పుడు బీసీ జనాభా దామాషా ప్రకారం బీసీ వర్గాలకు ఎందుకు రిజర్వేషన్లు ఎందుకు కల్పించరు? తక్షణమే బీసీ రిజర్వేషన్ల జాబితా నుండి ముస్లింలను తొలగించాలి. 42కు 42 శాతం రిజర్వేషన్లను బీసీలకు అమలు చేస్తానంటే కేంద్రాన్ని ఒప్పించి ఆమోదం తెలిపే బాధ్యతను మేం తీసుకుంటాం. లేనిపక్షంలో ఊరుకునే ప్రసక్తే లేదు.

బీసీ సంఘాల నాయకులారా... మీ దురాలోచనను, మీ రాజకీయాలను పక్కనపెట్టి బీసీలకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడాలని కోరుతున్నా. గుండెపై చేయి వేసుకుని వాస్తవాలు మాట్లాడాలని కోరుతున్నా. కాంగ్రెస్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముస్లింలను బీసీ జాబితా నుండి తొలగించి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నా.

Politent News Web3

Politent News Web3

Next Story