Aadhaar : ఆధార్ ఇక మరింత ఈజీ.. ఇంట్లో కూర్చొనే అన్ని పనులు
ఇంట్లో కూర్చొనే అన్ని పనులు

Aadhaar : ప్రభుత్వ వ్యవస్థను, పౌర సేవలను సులభతరం చేయడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. ఈపీఎఫ్, ఆధార్ వంటి ముఖ్యమైన పౌర సేవల్లో ఇప్పటికే చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వం ఆధార్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. మీరు ఎక్కడ ఉన్నా, అక్కడి నుంచే అనేక ఆధార్ సంబంధిత పనులు చేసుకునే విధంగా కొత్త టెక్నాలజీని తీసుకురాబోతోంది. ఇది సామాన్యులకు పెద్ద ఉపశమనం కలిగించనుంది.
ప్రస్తుతం మీరు వివిధ సేవలకు ఆధార్ ఫోటో కాపీని సమర్పిస్తున్నారు. కానీ, త్వరలో దీని అవసరం తీరిపోనుంది. ఇకపై ఆధార్ ఫోటో కాపీకి బదులు ఇ-ఆధార్ను సమర్పిస్తే సరిపోతుంది. ఇందుకోసం QR కోడ్ ఆధారితమైన కొత్త మొబైల్ యాప్ రెడీ చేశారు. ఈ యాప్ ద్వారా మీరు ఆధార్ డాక్యుమెంట్ సాఫ్ట్‌కాపీని అందించవచ్చు. మీ పూర్తి ఆధార్ వివరాలు కనిపించకుండా, మాస్క్డ్ ఆధార్ కూడా ఇవ్వవచ్చు. ఇది కూడా చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుంది. ఈ కొత్త సిస్టమ్ నవంబర్ నెల నుండి అమలులోకి రానుంది.
UIDAI సీఈఓ భువనేష్ కుమార్ ప్రకారం..‘‘ ఈ కొత్త యాప్‌ను డెవలప్ చేశాం. ఇకపై మీరు ఫింగర్‌ప్రింట్, ఐరిస్ స్కాన్ వంటి బయోమెట్రిక్ అప్‌డేట్‌ల కోసం మాత్రమే ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. మిగిలిన అన్ని ఆధార్ పనులను మీరు ఇంటి వద్ద నుంచే చేసుకోవచ్చు. ఆధార్‌లోని చిరునామా, ఫోన్ నంబర్, పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలను మార్చుకోవడానికి మీరు ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇది సమయం ఆదా చేయడమే కాకుండా, ప్రయాణ ఖర్చులను కూడా తగ్గిస్తుంది.’’ అని తెలిపారు.
కొత్త సిస్టమ్ లో మీ బర్త్ సర్టిఫికెట్, పదవ తరగతి మార్కుల జాబితా, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, పీడీఎస్ గా వంటి అందుబాటులో ఉన్న అన్ని డాక్యుమెంట్లను మీ ఆధార్‌తో లింక్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. అంతేకాదు, విద్యుత్ బిల్లు డేటాబేస్‌ను కూడా ఆధార్‌తో లింక్ చేయవచ్చు. ఈ డేటాబేస్‌లన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానం కావడం వల్ల మీ అన్ని రకాల డాక్యుమెంట్లు, వివరాలు ఒకేచోట లభిస్తాయి. దీనివల్ల వివిధ సేవలకు వేర్వేరు డాక్యుమెంట్లను సమర్పించాల్సిన అవసరం చాలా వరకు తగ్గుతుంది. అంతేకాకుండా, నకిలీ పత్రాలు సృష్టించేవారికి ఇకపై చాలా కష్టమవుతుందని భువనేష్ కుమార్ వివరించారు.
హోటళ్లలో చెక్-ఇన్ అవ్వడం దగ్గర నుంచి వివిధ రకాల పనులకు ఐడెంటిటీ డాక్యుమెంట్ అవసరమైనప్పుడు, QR కోడ్ ఆధారిత మొబైల్ యాప్ చాలా ఉపయోగపడుతుంది. ఈ యాప్ ద్వారా మీరు సులభంగా మీ ఆధార్ డాక్యుమెంట్‌ను సమర్పించవచ్చు. ముఖ్యంగా, ఆస్తి రిజిస్ట్రేషన్ వంటి సందర్భాలలో ఈ కొత్త సిస్టమ్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆధార్‌ను దుర్వినియోగం చేసి జరిగే మోసాలకు దీని ద్వారా అడ్డుకట్ట వేయవచ్చు. ఈ డిజిటల్ మార్పులతో పాటు, ప్రస్తుతం పాఠశాల పిల్లలకు కూడా ఆధార్ బయోమెట్రిక్ లింక్ చేసే కార్యక్రమం కూడా జరుగుతోంది. మొత్తంగా, ఆధార్ వ్యవస్థను మరింత సురక్షితంగా, సులభంగా, సమర్థవంతంగా మార్చడమే UIDAI లక్ష్యంగా కనిపిస్తుంది.
