టూరిజం క్లస్టర్లుగా అరకు, లంబసింగి, మారేడుమిల్లి

ఆదివాసీలు అన్ని విధాలా అభివృద్ధి చెందితేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని గిరి పుత్రుల్లో మరింత చైతన్యం తీసుకురాగలిగితే అభివృద్ధికి ఢోకా ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఎన్టీఆర్ శ్రీకారం చుట్టగా దాన్ని తాను కొనసాగిస్తున్నానని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకే ఉద్యోగాలు కల్పించేందుకు గతంలో తాము జీవో నెంబర్ 3 తీసుకొస్తే గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఆ జీవోలు రద్దయ్యాయని, రద్దైన జీవో నంబర్ 3 స్థానంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో గిరిజనులకు మేలు చేస్తామన్నారు. అల్లూరి జిల్లా పాడేరు మండలం వంజంగిలో శనివారం నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. వంజంగిలో వనదేవత మోదకొండమ్మ ఆలయాన్ని ముఖ్యమంత్రి దర్శించుకున్నారు. అనంతరం గ్రామ సమీపంలో కాఫీ తోటలను పరిశీలించి, గిరిజన సంప్రదాయ వేడుకలను తిలకించారు. ఆదివాసీ ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. టూరిజం అభివృద్ధిపై తీసుకుంటున్న చర్యలు, ప్రాజెక్టుల వివరాలను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

గిరిపుత్రుల మధ్య ఉండటం సంతోషాన్నిస్తోంది

‘ఈ రోజు రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. అంతర్జాతీయ గిరిజన దినోత్సవం…అన్నా చెల్లెళ్ల అనుబంధం చాటే రాఖీ పండుగ. ఇలాంటి పవిత్రమైన రోజున పాడేరులో ఇలా గిరిపుత్రులు మధ్యలో ఉండటం నాకు సంతోషాన్నిస్తోంది. పేదలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించాలనే లక్ష్యంతో కష్టపడుతున్నాను. గతంలో పాడేరు రావాలనుకున్నా వాతావరణం అనుకూలించక రాలేకపోయాను. ఏజెన్సీ అంటే దేవుడు సృష్టించిన అద్భుతం. ఇక్కడికి వస్తున్న సమయంలో కొండలు, పచ్చటి వాతావరణం చూశాను. మళ్లీ జన్మ ఉంటే ఇక్కడ పుట్టాలని ఉంది. విత్తన పండుగలు, సంక్రాంతి వరకూ ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు. గత పాలకులు ఈ ప్రాంతాన్ని పట్టించుకోకపోవడంతో అనేక ఇబ్బందులు వచ్చాయి. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారు... దాన్ని నేను కొనసాగిస్తున్నాను’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

ఉచితంగా సోలార్ రూఫ్‌టాప్

‘గిరిజనుల సంక్షేమంతో పాటు ఆ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. గతంలో ఐఎఎస్ అధికారులను ప్రాజెక్ట్ ఆఫీసర్లుగా నియమించి ఐటీడీఏలను బలోపేతం చేశాం. రాష్ట్రంలో ఎస్టీలు 28.32 లక్షలు కాగా అందులో సుమారు 8.41 లక్షలు గిరిజన కుటుంబాలు ఉన్నాయి. 3,77,051 మంది గిరిజనులకు ప్రతినెలా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇస్తున్నాం. పక్క రాష్ట్రాలు చత్తీస్గడ్, ఒడిశాలో ఎంత పెన్షన్ ఇస్తున్నారో ఒకసారి గమనించండి. గిరిజనులకు పింఛన్ల కోసమే ఏడాదికి రూ.1,595 కోట్లు ఖర్చు చేస్తున్నాం... ఇదీ గిరిజనుల సంక్షేమంపై మా చిత్తశుద్ధి. 4.82 లక్షల గిరిజనుల గృహాలకు నెలకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తున్నాం. త్వరలోనే సోలార్ రూఫ్ టాప్ ఉచితంగా ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుడతాం’ అని సీఎం హామీ ఇచ్చారు.

మట్టిలో మాణిక్యాలు గిరి పుత్రులు

‘మన గిరిజన బిడ్డలు మట్టిలో మాణిక్యాలు. అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారని నమ్మాను. తల్లికి వందనం పథకం ద్వారా 1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న 4,86,803 మంది గిరిజన విద్యార్థులకు రూ.642 కోట్లు తల్లుల ఖాతాలో వేశాం. ఏజెన్సీ పరిధిలోని స్కూళ్లు, కాలేజీల్లో చదువుతున్న 1,76,796 మంది గిరిజన విద్యార్థులు కోసం ఏడాదికి రూ.1,337 కోట్లు ఖర్చు చేస్తున్నాం. గిరిజన యువత కోసం స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, హస్తకళల తయారీ, ఈ-కామర్స్ విక్రయాలపై శిక్షణ ఇస్తున్నాం. నిన్ననే విద్యాశాఖ మంత్రి 373 నూతన భవనాల నిర్మాణానికి రూ.45 కోట్లు విడుదల చేశారు’ అని సీఎం చంద్రబాబు వివరించారు.

గిరిజన ప్రాంతాల్లో మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రులు

‘ఆదివాసీల ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటోంది. గిరిజన గ్రామాల్లో వైద్యానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. 1,487 మంది సికిల్ సెల్ రోగులకు నెలకు రూ.10,000 పింఛన్ ఇస్తున్నాం. గర్భిణీలకు పోషకాహార ప్యాకేజీలు, రవాణా సదుపాయం అందిస్తున్నాం. డోలీ మోతలు లేకుండా 76 బర్త్ వెయిటింగ్ హాల్స్ బలోపేతం చేశాం. 35 కొత్త భవనాలు నిర్మాణంలో ఉండగా 15 మరమ్మతులు చేస్తున్నాం. 122 ఫీడర్ అంబులెన్సులు ఏర్పాటు చేశాం. రూ.482 కోట్లతో గిరిజన ప్రాంతాల్లో 5 మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తున్నాం’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.

అరకు కాఫీ అంటే ఒక బ్రాండ్

‘అరకు కాఫీ ప్రపంచవ్యాప్తం కావాలి. అరకు కాఫీ నేను ప్రమోట్ చేసిన బ్రాండ్. ప్యారిస్‌లో కూడా అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు చేశాం. పాడేరు ఏజెన్సీలోని 11 మండలాల్లో 2.58 లక్షల ఎకరాల్లో కాఫీ సాగు అవుతోంది. దీనిపై 2.46 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారు. మరో లక్ష ఎకరాల్లో కొత్తగా కాఫీ తోటలు పెంచాలని ప్రయత్నం చేస్తున్నాం. అలాగే 1.80 లక్షల ఎకరాల్లో చెర్రీ సాగు చేసి 90,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సాధిస్తున్నారు. మన గిరిజన రైతన్నలు మామిడి, సపోటా, జీడిపప్పు, పనస, నేరేడు, నిమ్మ, సీతాఫలమే కాదు కుంకుమవంటి పంటలు సాగుచేసి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒకప్పుడు ఏజెన్సీ అంటే గంజాయి ప్రాంతమని చెడుగా భావించేవారు. గత ప్రభుత్వం స్వచ్చమైన ఏజెన్సీలను కలుషితం చేసింది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ఏజెన్సీలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడా గంజాయి మాట వినపడటంలేదు’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.

రోడ్ల నిర్మాణంతో గిరిజనుల ఇక్కట్లు తీరుస్తాం

‘ఏజెన్సీ ప్రాంతంలో రోడ్లు నిర్మించి గిరిజనుల ఇక్కట్లు తీరుస్తాం. నేషనల్ హైవే సంస్థ ఆధ్వర్యంలో ఏడాదిలో రూ.200 కోట్లతో 203 గిరిజన గ్రామాలకు 269 కి.మీ. మేర బీటీ రోడ్లు వేశాం. ప్రస్తుతం గిరిజన జిల్లాల మీదుగా 515 కి.మీ. పొడవున రూ.8,570 కోట్ల విలువైన జాతీయ రహదారుల పనులు జరుగుతున్నాయి. వీటిలో పాడేరు–గొండిగూడ, కొయ్యూరు–చాప్రతిపాలెం, చింతపల్లి, రంపచోడవరం–కొయ్యూరు NH–516E విస్తరణ పనులు, రాయపూర్–విశాఖపట్నం సెక్షన్ NH–130CD, భద్రాచలం–కుంటNH–30 సెక్షన్, లంబసింగి–పాడేరు, చింతూరు–మోటు సెక్షన్లు, పాడేరు బైపాస్, కొత్త ఫ్లై ఓవర్లు ఉన్నాయి’ అని సీఎం తెలిపారు.

విజయవాడ, తిరుపతి, విశాఖలో స్టడీ సర్కిళ్లు

‘పోటీ పరీక్షలకు ఎస్టీ విద్యార్ధులను సిద్ధం చేయడానికి రూ.4.5 కోట్లు ఖర్చు చేస్తున్నాం. విశాఖ, విజయవాడ, తిరుపతిలో స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేస్తున్నాం. రూ.150 కోట్లతో రెసిడెన్షియల్ పాఠశాల భవనాలు వసతి గృహాలుగా మార్చుతున్నాం. రూ.64 కోట్ల వ్యయంతో ఐటీడీ పాడేరులో 418 పాఠశాల భవనాల నిర్మాణాలు చేపట్టాం. పాడేరులో ప్రభుత్వ మెడికల్ కాలేజీతో పాటు ఆస్పత్రి నిర్మాణం చేపట్టాం. ఐటీడీఏ రంపచోడవరంలోని వై రామవరం మండలాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం 2 మండలాలుగా విభచించాలని నిర్ణయం తీసుకున్నాం. వీటితో పాటు రూ.50 కోట్లతో సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, కేఆర్‌పురం, శ్రీశైలం ఐటీడీఏ పరిధిలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తున్నాం. త్వరలోనే వీటిని పూర్తి చేసి గిరిజనులకు అందుబాటులోకి తెస్తాం.’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ఎన్ని ఇబ్బందులున్నా సూపర్ సిక్స్ హామీల అమలు

'ఆర్థిక సమస్యలు ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఆగస్టు 15 నుంచి స్త్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం. మా గిరిజన ఆడబిడ్డలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశాం. ఏజెన్సీలో 7 క్యాంటీన్ల ద్వారా భోజనం అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ నెలాఖరున మెగా డీఎస్సీ ద్వారా టీచర్ల నియమాకం భర్తీచేస్తాం. ఇప్పటికే రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు కుదుర్చుకున్నాం. ఈ పెట్టుబడుల ద్వారా 9 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. 5 వేల మంది గిరిజన మహిళలకు ఏడాదికి రూ.లక్ష ఆదాయం వచ్చేలా చేస్తాం’ అని ముఖ్యమంత్రి అన్నారు.

గిరిజన యూనివర్సిటీని పూర్తి చేస్తాం

1483 గిరిజన హ్యాబిటేషన్లకు రూ.2,850 కోట్ల వ్యయంతో గ్రామీణ సడక్ యోజన కింద ప్రతి ఊరికి రోడ్డు వేస్తాం. రూ.1938 కోట్ల వ్యయంతో ఐటీడీఏలో గిరిజనుల ఆదాయం పెంచే మార్గాలు చూపిస్తాం. రూ.8575 కోట్లో వ్యయంతో 515 కిలోమీటర్ల రహదారులు పూర్తి చేస్తాం. రూ.19,411 కోట్లతో 472 కిలోమీటర్లు అంతర్జాతీయ ప్రమాణాలతో రోడ్లు వేస్తాం. ఎకో టూరిజం కోసం రూ.10 కోట్లు మంజూరు చేస్తాం. విజయనగరం జిల్లా కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ పనులు జరుగుతున్నాయి. విజయనగరం జిల్లాలో 519 ఎకరాల్లో ట్రైబల్ యూనివర్సిటీ నిర్మాణం త్వరిగతగతిన పూర్తిచేస్తాం.’ అని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

టూరిజం క్లస్టర్లుగా అరకు, లంబసింగి, మారేడుమిల్లి

అరకు, లంబసింగి, మారేడుమిల్లి ప్రాంతాలను టూరిజం క్లస్టర్లుగా తయారుచేస్తాం. రాబోయే రోజుల్లో స్థానికంగా 1000 వరకూ హోమ్ స్టేలు ఏర్పాటు చేసుకునేలా ఆర్థిక సాయం చేస్తాం. పాడేరులో మోదకొండమ్మ ఆలయం అభివృద్ధికి రూ.2 కోట్లు మంజూరు చేస్తున్నాం. స్థానికంగా మహిళా శిశు సంక్షేమం కింద 96 అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. విశాఖ జిల్లాలో గిరిజనులందరికీ గ్రామీణ ఆవాజ్ యోజన కింద 54 వేల ఇళ్లు మంజూరు చేస్తాం. బాబాయిని చంపి నెపం నాపై వేద్దామని కుట్ర చేసిన వారి ఆటలు ఇక సాగనివ్వను. వారి ముసుగులు తొలగించి మీకు రక్షణ కల్పిస్తాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

Politent News Web3

Politent News Web3

Next Story