దళిత బంధు నిలిపివేతపై బీఆర్ఎస్ ఆగ్రహం
ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేందుకు కేటీఆర్ హామీ

తెలంగాణ భవన్‌లో ఈరోజు జరిగిన దళితబంధు సాధన సమితి సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. దళితబంధు సాధన సమితి ఈరోజు తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిసి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దళితబంధు లబ్ధిదారులకు కావాలనే నిధులు అందకుండా ఆపివేస్తుందని, ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ దళితబంధు సాధన సమితిని ఉద్దేశించి మాట్లాడారు.ఈరోజు దళితబంధు సాధన సమితి నేతలు, దళితబంధు రాక ఇబ్బందులు పడుతున్న పలువురు దళితులతో జరిగిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం ఎంపిక చేసిన ప్రతి ఒక్క దళిత బిడ్డకు బంధు వెంటనే ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దళితబంధుపై పెట్టిన ఫ్రీజింగ్‌ను వెంటనే తొలగించి, కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్లుగా 12 లక్షల రూపాయల దళితబంధు ప్రారంభించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి పార్టీ తరఫున లేఖ రాయనున్నట్లు తెలిపారు.
కేవలం ఓట్ల కోసం, సీట్ల కోసం ఏర్పాటుచేసిన కార్యక్రమం దళితబంధు కాదని, దళిత జీవితాల్లో సంపూర్ణ సమగ్ర మార్పులకు తీసుకురావడం కోసం చేపట్టిన కార్యక్రమమని కేటీఆర్ అన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చిన 10 లక్షలకు అదనంగా మరో రెండు లక్షలు కలిపి 12 లక్షలు ఇస్తామని చెప్పి దళితుల ఓట్లు వేయించుకొని వారిని ప్రస్తుతం మోసం చేస్తోందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
గతంలో దళితబంధు ఏర్పాటుచేసినప్పుడు "కేవలం ఓట్ల కోసం చేసిన కార్యక్రమం"గా మాట్లాడారని, అయితే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 40 సంవత్సరాల క్రితం సిద్ధిపేట ఎమ్మెల్యేగా దళితుల జీవితాల్లో ఎదురైన సమస్యలను అధ్యయనం చేసేందుకు దళిత చైతన్య జ్యోతి పేరుతో చేపట్టిన కార్యక్రమం స్ఫూర్తిగా దళితుల జీవితాల్లో మార్పులు తీసుకురావడం కోసం ఈ గొప్ప కార్యక్రమం చేపట్టారని తెలిపారు. దేశ చరిత్రలో దళితబంధు, రైతుబంధు వంటి కార్యక్రమాలను దమ్మున్న నాయకులు, కేసీఆర్ వంటి నాయకులు మాత్రమే చేయగలరని పేర్కొన్నారు. భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన రోజు నుంచీ దళితుల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం కల్యాణ లక్ష్మి, గురుకులాలు, దళితబంధు వంటి అనేక కార్యక్రమాలను చేపట్టిందని కేటీఆర్ గుర్తు చేశారు.
ప్రస్తుత కాంగ్రెస్ నాయకుల తీరుకు భిన్నంగా, దళితుల జీవితాలను శాశ్వతంగా అభివృద్ధి పరచాలన్న లక్ష్యంతో కెసిఅర్ రూపొందించిన దళితబంధు ను అపేసారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు వలన వందలాది మంది దళిత కుటుంబాల్లో వెలుగులు నిండాయన్నారు. అయితే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దళితులను అడుగడుగునా మోసం చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన ప్రతి హామీని తుంగలో తొక్కి వారిని నిలువున మోసం చేస్తోందన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం అన్న కేటీఆర్, 420 హామీలు ఇచ్చి తెలంగాణలోని సబ్బండ వర్గాలను నిట్టనిలువునా మోసం చేస్తోందన్నారు. “100 రోజుల్లో హామీల అమలు చేస్తామని చెప్పి, ఇప్పుడు అడిగితే సామాజిక మాధ్యమాల నుంచి ప్రజాక్షేత్రం వరకు ప్రతి ఒక్కరిపై అప్రజాసామికంగా కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నం చేస్తోంది” అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అణిచివేత చర్యలకు పాల్పడినా, కాంగ్రెస్ ప్రజావ్యతిరేక మోసపూరిత విధానాలను ఎండగట్టడాన్ని మాత్రం ఆపబోమని కేటీఆర్ తెలిపారు.
