Cyber Fraud : టెలికాం శాఖ కొత్త రూల్స్..సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం కొత్త ప్లాన్!
సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం కొత్త ప్లాన్!

Cyber Fraud : సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేయడానికి టెలికాం శాఖ కఠిన నిబంధనలను రూపొందించడానికి సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా కస్టమర్ల మొబైల్ నంబర్ లేదా ఐడెంటిటీలను వెరిఫై చేయగల ఒక సెంట్రలైజ్డ్ ప్లాట్‌ఫారమ్‌ను ఏర్పాటు చేయబోతోంది. టెలికాం ఆపరేటర్లు, బ్యాంకులు, ఈ-కామర్స్ సంస్థలు మొదలైనవన్నీ ఇకపై ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా తమ కస్టమర్ల ఐడెంటిటీలను వెరిఫై చేయడం తప్పనిసరి అవుతుంది. ఈ దిశగా 2024 టెలికమ్యూనికేషన్స్ సైబర్ సెక్యూరిటీ రూల్స్‌కు సవరణలు తీసుకురావడానికి రూపొందించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో ఈ ప్రతిపాదన చేశారు. ఇది మొబైల్ నంబర్ వాలిడేషన్ ప్లాట్‌ఫారమ్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వమే స్వయంగా దీనిని స్థాపించవచ్చు లేదా ఒక ఏజెన్సీకి దీని బాధ్యతను అప్పగించవచ్చు. ఈ ప్లాట్‌ఫారమ్‌ను వెరిఫికేషన్ కోసం ఉపయోగించడానికి ఒక నిర్దిష్ట రుసుము కూడా విధించే అవకాశం ఉంది.
టెలికాం శాఖ ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగించి సిమ్ కనెక్షన్లను వెరిఫై చేస్తోంది. ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించి పొందిన కోట్లాది సిమ్‌లను ఇప్పటికే డిస్కనెక్ట్ చేశారు. ఇటీవల కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించిన వివరాల ప్రకారం, నకిలీ గుర్తింపు కార్డులు, నకిలీ చిరునామా ఆధారాలను ఉపయోగించి 21 లక్షల సిమ్ కనెక్షన్లు తీసుకున్నట్లు గుర్తించారు. వీటిని ఉపయోగించి సైబర్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అందుకే ఈ కొత్త ప్లాట్‌ఫారమ్ అవసరం అని ప్రభుత్వం భావిస్తోంది.
భారతదేశ టెలికాం నెట్‌వర్క్‌లలో ఇప్పటికే ఉన్న IMEI నంబర్లను మరో పరికరానికి కేటాయించకుండా జాగ్రత్త వహించాలని మొబైల్ తయారీదారులను ప్రభుత్వం కోరాలని నిర్ణయించింది. భారతదేశంలో తయారయ్యే లేదా దిగుమతి అయ్యే ఫోన్ల IMEI నంబర్లు పునరావృతం కాకూడదు. ప్రభుత్వం భారతదేశంలో వాడుకలో ఉన్న IMEI ల డేటాబేస్‌ను నిర్మించనుంది. నిషేధంలో ఉన్న IMEI లు కూడా ఈ డేటాబేస్‌లో ఉంటాయి. ఈ IMEI నంబర్లు కొత్త పరికరాలకు కేటాయించబడకుండా చూసుకోవడమే ప్రభుత్వ ఉద్దేశ్యం. మొబైల్ తయారీదారులు IMEI లను కేటాయించే ముందు ఈ డేటాబేస్‌ను తప్పనిసరిగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఇది దొంగిలించబడిన ఫోన్లను ట్రాక్ చేయడానికి, మోసాలను అరికట్టడానికి సహాయపడుతుంది.

