రాజకీయ వ్యవస్థలో మార్పుతోనే ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది

గత పాలకుల విధానాల వల్ల విద్య, వైద్యం లాంటి మౌలిక రంగాలు నాశనమయ్యాయని, ప్రజల రాజకీయ చైతన్యంతో, రాజకీయ పార్టీల స్వభావంలో మార్పుతోనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుపడి సమగ్రాభివృద్ధి జరుగుతుందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. అప్పుల ఊబిలో తెలంగాణ ప్రభుత్వం - కారణాలు - పరిష్కారాలు అనే అంశంపై హనుమకొండ జిల్లా కేంద్రం హరిత కాకతీయ హోటల్ లో తెలంగాణ ఉద్యమకారుల వేదిక, ఫోరం ఫర్ బెటర్ వరంగల్ సంయుక్తంగా ఆదివారం నిర్వహించిన మేధావుల సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వంలో రాష్ట్రానికి నాయకత్వం వహించిన కెసిఆర్ మేధావుల సూచనలను పట్టించుకున్న పాపాన పోలేదని, కెసిఆర్ ఎవరి మాట వినలేదని, నేటి పాలకులు మేధావుల సూచనలను విన్నప్పటి వాటి అమలుపై నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. ఆర్థిక శాస్త్రంలో విశ్లేషణలు, సూచనలు ఉంటాయని, రాజకీయ శాస్త్రంలో, రాజకీయాల్లో పరిష్కారాలుంటాయని అన్నారు. తెలంగాణలో పరిష్కారం చూపాల్సిన రాజకీయాలే సమస్యగా మారిన దుస్థితి నెలకొందని అన్నారు. రాజకీయాలకు, ఉపయోగకరమైన నిర్ణయాలకు ప్రజలు కేంద్రంగా ఉంటారని అలాంటి ప్రజల నుండి విలువైన సూచనలు, సలహాలు తీసుకొని పాలకులు అభివృద్ధి ప్రణాళికలు రచించి అమలు పరచాలని అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి కోసం నయా ఉదారవాద విధానాల్లో మార్పులు చేయాల్సిన అవసరముందని అన్నారు. విలువలు, ప్రజల అభివృద్ధి లేని రంగాల్లో అభివృద్ధి జరగడం వల్ల సమగ్ర అభివృద్ధి జరగడం లేదని, గత పాలకుల విధానాల వల్ల విద్య, వైద్య, వ్యవసాయ, ఉపాధి రంగాలు కుదేలయ్యాయని, ఆరోగ్యశ్రీ వల్ల ప్రభుత్వ ఆసుపత్రులు, ఫీజు రీఎంబర్స్మెంట్ వల్ల ప్రభుత్వ విద్య నాశనమయిందని అన్నారు. సామాన్య ప్రజలు వాస్తవ స్థితిగతులను అర్ధం చేసుకునే స్థితిలో లేరని, ప్రభుత్వ విద్య, వైద్యం వల్ల మేలు జరగదనే బలమైన భావన ప్రజల్లో నెలకొన్నదని అన్నారు. పాలకులు, వ్యాపారులు కలిసి ప్రజలను ఇలాంటి దుస్థితికి నెట్టారని అన్నారు. రాష్ట్ర ఆర్థిక రంగం బాగుపడాలంటే రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలని, విలువలతో కూడిన రాజకీయాలు నిర్మితం కావాలని అన్నారు. పౌర సమాజం నిశబ్దంగా ఉంటే ప్రజాస్వామ్యానికి ప్రమాదమని, ప్రజల చైతన్యంతోనే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలమని అన్నారు. ఉన్నత విద్య, విశ్వవిద్యాలయాలు బాగుపడే పాలన కోసం ప్రజలు చైతన్యంతో ముందుకు సాగాల్సిన అవసరముందని అన్నారు.

ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ మాట్లాడుతూ అన్ని రకాలుగా ఆగమైన వర్గాలకు న్యాయం జరిగే కొరకు ఏర్పడిన తెలంగాణలో దొరల పాలనలో మరింత ఆగమైందని, మానవాభివృద్ధితో కూడిన ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రణాళికలు రచించి అమలుపరచాలని, ఆర్థిక రంగాన్ని బాగుపరచే నూతన అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో మేధావులను, ఆర్థిక నిపుణులను, ఉద్యమకారులను భాగస్వామ్యం చేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుపడడానికి ప్రజల నుండి వారి విలువైన సూచనలను తీసుకోవడానికి రాష్ట్రమంతా సదస్సులను నిర్వహిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం, ప్రొఫెసర్లు డి నర్సింహారెడ్డి, ఆర్ వి రమణమూర్తి, సదానందం, ఫోరమ్ ఫర్ బెటర్ వరంగల్ అధ్యక్షులు పుల్లూరు సుధాకర్, తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర కన్వీనర్ సోమ రామమూర్తి, ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్, విసికె పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జిలకర శ్రీనివాస్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నమనేని జగన్ మోహన్ రావు లు మాట్లాడుతూ అప్పులు చేయని దేశం ఉండదని, అభివృద్ధి నమూనాలో అప్పులు సహజమని, వారసత్వంగా వచ్చిన అప్పుల నమూనాలో భాగంగానే కొత్తగా ఏర్పడిన తెలంగాణలో నయా ఉదారవాద ఆర్థిక విధానాల వల్ల ఆగమైందని అన్నారు. 1995 లో చంద్రబాబు నాయుడు ప్రారంభించిన నయా ఉదారవాద ఆర్థిక విధామాలను ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన రాజశేఖర్ రెడ్డి కాలంలో కూడా కొనసాగించడమే కాకుండా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కెసిఆర్ పాలనలో అన్ని తానై ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చారని, రాష్ట్ర వృద్ధి రేటును పెంచినప్పటికీ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేశారని అన్నారు. 40 మిలియన్ టన్నుల వరి ఉత్పత్తి నుండి 170 మిలియన్ టన్నుల ఉత్పత్తికి పెంచిందని, రాష్ట్ర అవసరాలకు మించి ఉత్పత్తిని ఏమి చేయాలో అర్థం కానీ స్థితిలో నేటి తెలంగాణ ఉందన్నారు. పెద్ద ప్రాజెక్టుల నుండి, చిన్న నీటిపారుదల అభివృధి, 24 గంటల ఉచిత కరెంటు కల్పన అంతా వరి ధాన్యం ఉత్పత్తి కోసమే జరిగింది. వరి సాగుకు యాడాదికి 50 వేల కోట్లు బడ్జెట్ లో కేటాయిస్తుంది. 68 వేల కోట్ల వరి ఉత్పత్తికి 50 వేల కోట్ల ఖర్చు వల్ల తెలంగాణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని అన్నారు. ఈ స్థితినే కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాల్సిన దుస్థితి కొనసాగుతుందని తద్వారా మిగతా రంగాలన్నీ కుదేలై రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నానాటికి దెబ్బతింటుందని అన్నారు. ఆర్థిక సహాయం అవసరం లేని పెద్ద రైతులకు పంట సహాయం చేయడం వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు. ప్రత్యామ్నాయ వ్యవసాయ అభివృద్ధిని, ఉన్నత విద్య అభివృద్ధిని పట్టించుకోవాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగాలని అన్నారు.

త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో మొత్తం వ్యాపారాలు, సంపద రాష్ట్రేతరులదేనని అన్నారు. ఉచిత పథకాల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై భవిషత్ ఆగమయ్యే స్థితి ఏర్పడిందని, రైతు బంధు లాగానే ఫీజు రీఎంబర్స్మెంట్ దుర్వినియోగమవుతుందని, ఉచిత పథకాల వల్ల అభివృద్ధి తిరోగమనం చెందుతుందని అన్నారు. విదేశీ కంపెనీలు ఇండియాకు వస్తుంటే మన దేశంలో చదువుకున్న విద్యావంతులు విదేశాలకు వెళుతున్న దుస్థితిని గమనించాలని, రాష్ట్ర అభివృద్ధి కోసం నిష్ణాతులతో కూడిన ప్రణాళిక సంఘాన్ని వేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థతను గాడిలో పెట్టడంతో పాటు సుస్థిర అభివృద్ధి కోసం కృషి చేయడానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన అవసరాముందని అన్నారు.

ఈ సదస్సు అతిథులకు వీరమల్ల బాబురావు స్వాగతం పలుకగా మల్లారెడ్డి, సంపత్ రెడ్డి, సుశీల, చాపర్తి కుమార్ గాడ్గే, డాక్టర్ ప్రవీణ్ కుమార్, బుసిగొండ ఓంకార్, వల్లాల జగన్ గౌడ్, సంఘాని మల్లేశ్వర్, కొంగ వీరాస్వామి, మేకల కేదారి యాదవ్, నలిగింటి చంద్రమౌళి, లంకా పాపిరెడ్డి, బొమ్మినేని పాపిరెడ్డి, పల్లపు సమ్మయ్య, న్యాయవాదులు విలాసాగరం సురేందర్ గౌడ్, ఎగ్గడి సుందర్ రామ్, జన్ను పద్మ, బండి మొగిలి, జె జె స్వామి, వివిధ సంఘాల నాయకులు పెండ్లి అశోక్ బాబు, మంద వీరస్వామి, పరిశరాములు, తిరుపతి, బట్టి శ్యామ్ యాదవ్, దిడ్డి ధనలక్ష్మి, సద్గుణ, సురేఖ, స్వరూప, గోధుమల కుమారస్వామి, కొంగర జగన్, సాంబలక్ష్మీ, సూరం నిరంజన్, కూరపాటి భార్గవి, సద్గుణ, రౌతు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Updated On 14 July 2025 9:21 AM IST
Politent News Web3

Politent News Web3

Next Story