ఆగస్టు 4 నుంచి 7వరకు ఇందిరా పార్క్ లో దీక్ష

బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించడంతో పాటు విద్య, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో యునైటెడ్ ఫూలే ఫ్రంట్, బీసీ సంఘాల నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఆగస్టు 4వ తేదీన ఉదయం 11 గంటల నుంచి 7వ తేదీ ఉదయం 11 గంటల వరకు ఇందిరాపార్క్ లోని ధర్నా చౌక్ లో నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు. తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ చేసిన పోరాటాలకు దిగివచ్చే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ, కౌన్సిల్ లో బీసీల కోసం రెండు వేర్వేరు బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్తామని అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని కానీ ఇంతవరకు ఆ ప్రయత్నం చేయలేదున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన ధర్నాను ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీనే పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు కూడా ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తామని చెప్పకుండా పార్టీ పరంగా ధర్నా చేస్తామని పిలుపునివ్వడం బీసీలను వంచించడమేనన్నారు.

రాష్ట్ర హైకోర్టు చెప్పింది కాబట్టి సెప్టెంబర్ నెలాఖరులోకా ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోందని.. గడువులోగా ఎన్నికలు నిర్వహించడం ఎంత ముఖ్యమో.. బీసీలకు రిజర్వేషన్ల కోటా పెంచడం కూడా అంతే ముఖ్యం అన్నారు. అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించిన బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలుపకపోతే, రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు న్యాయపోరాటం చేయలేదని ప్రశ్నించారు. తమిళనాడులో ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఆ రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాటు న్యాయపోరాటం చేసి రిజర్వేషన్లు కల్పించిందని గుర్తు చేశారు. ఇప్పుడు రాష్ట్రంలోనూ ఎన్నికలు నిర్వహించాల్సిన అత్యవసరం ఏదీ లేదని.. రిజర్వేషన్ల కల్పనే ముఖ్యమన్నారు. బీసీ సీఎం, బీసీ పీఎం అంటున్న బీజేపీ తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపునకు ఎందుకు అడ్డుతగులుతోందని ప్రశ్నించారు. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి ప్రయోజనం శూన్యమన్నారు.

ఆర్డినెన్స్ విషయంలో న్యాయపోరాటం ఎందుకు చేయడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రపతి బిల్లులకు ఆమోదం తెలిపితే సంతోషమని.. తెలుపకుండా రిజెక్ట్ చేస్తే మరోసారి శాసనసభ, శాసన మండలి ఆ బిల్లులకు ఆమోదం తెలిపితే రిజర్వేషన్లు అమలు చేసుకోవచ్చన్నారు. బీసీ రిజర్వేషన్ల అమలు కోసం ఎన్నో అవకాశాలు ఉన్నా తన బడే భాయ్ నరేంద్ర మోదీని రక్షించడం కోసమే రేవంత్ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదన్నారు. బీజేపీతో ఉన్న ఒప్పందంతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోర్టుకు వెళ్లడం లేదన్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచాలంటే వెంటనే హైకోర్టు, సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తాం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారని.. ఢిల్లీలో ధర్నా అంటే అదేమైనా సత్రం భోజనమా అని ప్రశ్నించారు. మంత్రి పొన్నం బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహ సాధన కోసం 72 గంటల నిరాహార దీక్ష చేస్తే అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం దిగివచ్చిందన్నారు. ఇప్పుడు బీసీ బిల్లుల కోసం అదే తరహాలో నిరాహారదీక్ష చేస్తానని స్పష్టం చేశారు. నిరాహార దీక్షకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతామని.. ఒకవేళ పర్మిషన్ ఇవ్వకుంటే ఎక్కడ ఉంటే అక్కడే నిరాహారదీక్షకు దిగుతానని స్పష్టం చేశారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువస్తుందని ప్రకటిస్తే సంతోషించామని.. అది బూటకమని తేలిపోయిందని యూపీఎఫ్ కన్వీనర్ బొల్ల శివశంకర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేయాలని చూస్తే ఆ పార్టీకి సమాధి కడుతామని హెచ్చరించారు. 42 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. సమావేశంలో యూపీఎఫ్ కో ఆర్డినేటర్ ఆలకుంట హరి, తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ నాయకులు నవీన్ ఆచారి, కొట్టాల యాదగిరి, పూసల శ్రీనివాస్, కుమారస్వామి, నరేశ్, మాధవి, వరలక్ష్మీ, రామ్ కోటి, విజయేంద్ర సాగర్, లలితా యాదవ్, గొరిగె నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

Politent News Web3

Politent News Web3

Next Story