Corona case in Visakhapatnam.. Covid restrictions

దక్షిణాది రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఏపీలో కోవిడ్‌ నియంత్రణ కోసం చేపట్టాల్సిన చర్యలపై మార్గదర్శకాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసింది. ఆరోగ్య శాఖ‌ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తాజాగా విశాఖపట్నం పిఠాపురం కాలనీలో ఓ మహిళ కొవిడ్ బారిన పడింది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొవిడ్ జాగ్రత్తలు తీసకుంటే సరిపోతుందని విశాఖ డిఎంహెచ్ ఓ అన్నారు.

ప్రార్థన సమావేశాలు, సామాజిక సమావేశాలు, పార్టీలు, బహిరంగ కార్యక్రమాలు వంటి అన్ని సామూహిక సమావేశాలను తక్షణం నిలిపి వేయాలని పేర్కొన్నారు.

రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్‌లు, విమానాశ్రయాలలో COVID-19 ప్రవర్తన నియమావళి పాటించాలని స్పష్టం చేశారు.

వృద్ధులు (60 ఏళ్లు పైబడిన వారు) గర్భిణీ స్త్రీలను ఖచ్చితంగా ఇంటి లోపలే ఉండాలని సూచించారు.

పరిశుభ్రత పాటించాలని-క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, దగ్గు/తుమ్ములు వచ్చినప్పుడు నోటిని కప్పి, పదేపదే ముఖాన్ని తాకడం వంటి పనులు చేయొద్దని సూచించారు.

ప్రమాదకర ప్రాంతాలలో మాస్క్‌లు ధరించాలని, రద్దీ ప్రదేశాలు, తక్కువ గాలి ప్రసరణ ఉన్న ప్రదేశంలో ఉంటే, మాస్క్ ధరించడం ద్వారా వైరస్ వ్యాప్తిని తగ్గించడంలో సహాయ పడుతుందని సూచించారు.

కోవిడ్‌ సంబంధిత లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షించుకోవాలని-COVID-19 కేసులను ముందుగా గుర్తించడంలో నిర్దారణ పరీక్ష కీలకంగా ఉంటుందన్నారు.

కోవిడ్ ప్రభావిత దేశాలకు ప్రయాణించిన వ్యక్తికి పరీక్షలు చేయించుకోవాలని, సాధారణ లక్షణాలు వ్యక్తిని బట్టి మారుతూ ఉంటాయని తేలికపాటి నుండి మితమైన లక్షణాలలో జ్వరం, చలి, దగ్గు, అలసట, గొంతు నొప్పి, రుచి లేదా వాసన కోల్పోవడం, తలనొప్పి, కండరాలు లేదా శరీర నొప్పులు, ముక్కు కారటం లేదా ముక్కు దిబ్బడ, వికారం, వాంతులు లేదా విరేచనాలు ఉంటాయి.

ఇలాంటి లక్షణాలు గమనించినట్లయితే నిర్ధారణ చికిత్స కోసం సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించాలని సూచించారు.

అనారోగ్యంగా ఉంటే ఇంట్లోనే ఉండాలని ఇతరులను సంప్రదించకుండా ఉండటం ద్వారా ఇతరులను కోవిడ్ బారిన పడకుండా కాపాడొచ్చని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

ఆరోగ్య శాఖ ద్వారా వ్యాధి నిర్దారణ పరీక్షలతో 24/7 ల్యాబ్‌లతో మాస్క్, PPE కిట్, ట్రిపుల్ లేయర్ మాస్క్‌‌లను తగినంత పరిమాణంలో ఉంచుకోవాలని సూచించారు.

Updated On 23 May 2025 2:08 PM IST
Politent News Web3

Politent News Web3

Next Story