రేవంత్ రెడ్డికి రచ్చ చేయడమే వచ్చు... చర్చ చేయడం రాదు

రేవంత్ రెడ్డికి రచ్చ చేయడం మాత్రమే వచ్చు కాని చర్చ చేయడం రాదన్న సంగతి తెలంగాణ ప్రజలకు మరోసారి తెలిసిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు. బూతులు తప్ప రైతుల గురించి బేసిక్ నాలెడ్జ్ లేని రేవంత్ రెడ్డి అసమర్థత పాలనతో 18 నెలల నుంచి తెలంగాణ లోని 70 లక్షల మంది అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. రైతులు, నిరుద్యోగులకు బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏం చేశాయో సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో చర్చిద్దాం రమ్మని ముఖ్యమంత్రిని ఆహ్వానించిన కేటీఆర్, చెప్పిన సమయానికి అక్కడికి వెళ్లారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక ఆత్మహత్యలు చేసుకున్న 600 మంది అన్నదాతల కోసం బీఆర్ఎస్ నేతలతో పాటు ఒక నిమిషం మౌనం పాటించారు. రేవంత్ రెడ్డి కోసం అరగంట వేచి చూసి తరువాత మీడియాతో మాట్లాడారు. తన పేరు తీసి స్వయంగా ముఖ్యమంత్రే చర్చకు రావాలని సవాల్ విసిరితే స్వీకరించానన్న కేటీఆర్, ఆయనకు సమాధానం చెప్పేందుకు సమగ్ర సమాచారంతో వచ్చానన్నారు. రైతుభరోసాలోని డొల్లతనాన్ని బట్టబయలు చేయడానికి అధికారిక సమాచారంతో వచ్చానన్న కేటీఆర్, ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజక వర్గంలోనే 670 మంది రైతులకు రైతుభరోసా రాలేదన్నారు. వారి పేర్లు, అడ్రస్సులు, ఫోన్ నెంబర్లను తీసుకొచ్చానని చెప్పారు. ఇంతేకాదు రుణమాఫీ కానీ లక్షల మంది అధికారిక జాబితా తమ దగ్గర ఉందన్నారు. ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వ్యవసాయం చేయలేక ఆత్మహత్యలు చేసుకున్న 670 మంది రైతుల వివరాలు, వడ్ల బోనస్ రాక పంటలు అమ్ముకునే దిక్కు లేక ప్రభుత్వం కొనక మిల్లర్లకు అమ్ముకొని నష్టపోయిన రైతుల జాబితా కూడా తమ దగ్గర ఉందన్నారు. ముఖ్యమంత్రి లేదా ఎవరైనా మంత్రులు చర్చకు వస్తే ఆ వివరాలు ఇచ్చేవాడిని అన్నారు.



ముఖ్యమంత్రి చాలా బిజీగా ఉంటారన్న సంగతి తమకు కూడా తెలుసున్న కేటీఆర్, ఆయనకు మరొక అవకాశం ఇస్తామన్నారు. ప్లేసు, డేటు ,టైము, ఆయనే డిసైడ్ చేస్తే ఎక్కడికైనా వచ్చి ఏ అంశం మీదనైనా చర్చించడానికి కెసిఆర్ తయారుచేసిన గులాబీ దండు సైనికులం తయారుగా ఉన్నామన్నారు. ఒకవేళ చర్చకు రాకపోతే కెసిఆర్ కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుబంధు, రైతు భీమాతో పాటు భారత దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి 24 గంటలు ఉచితంగా అన్నదాతలకు కరెంటు ఇచ్చిన కేసీఆర్ పై మరోసారి తప్పుడు కూతలు కూయనని, ఇలాంటి పనికిమాలిన సవాళ్లు చేయనని రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాయాలన్నారు.



తెలంగాణ రైతాంగానికి, యువతకు ఎవరేం చేశారో తేల్చుకుందాం రమ్మని ముఖ్యమంత్రి ఛాలెంజ్ చేస్తే, ఆయనకు బేసిక్ నాలెడ్జి లేదని తెలిసినా కూడా ముచ్చటపడుతున్నాడని ఆ సవాల్ ను స్వీకరించానని కేటీఆర్ తెలిపారు. బేసిన్ నాలెడ్జ్ , బేసిక్ నాలెడ్జ్ లేదని రేవంత్ రెడ్డికి ప్రిపేర్ కావడానికి 72 గంటల టైం కూడా ఇచ్చానని గుర్తుచేశారు. జులై 8 తారీఖున 11 గంటలకు ప్రెస్ క్లబ్ కు వస్తే మీడియా సాక్షిగా, ప్రజల సాక్షిగా చర్చిద్దామని ఆహ్వానిస్తే, ఆయన ఢిల్లీకి పారిపోయిండని విమర్శించారు. ఒకవేళ ముఖ్యమంత్రి రాలేకపోతే ఆయన తరపున బాధ్యత గల ఉప ముఖ్యమంత్రి గాని, వ్యవసాయ మంత్రి గానీ, లేదంటే ఇంకెవరైనా మంత్రులు వస్తారనుకుంటే వాళ్లు కూడా రాలేదన్నారు. తొడలు కొట్టడం, రంకెలు వేయడం, సవాళ్లు విసిరి పారిపోవడం రేవంత్ కు అలవాటే అన్న కేటీఆర్, కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరి ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిండని చెప్పారు. జిహెచ్ఎంసి లో బీఆర్ఎస్ సొంతంగా గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాట తప్పిండని గుర్తుచేశారు.



18 నెలల నుంచి తెలంగాణలో సాగుతున్న కాంగ్రెస్ అరాచక పాలనతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని కేటీఆర్ తెలిపారు. ఎరువుల కొరతతో రైతులు సతమతం అవుతున్నారన్న కేటీఆర్, ఒక ఆధార్ కార్డు మీద ఇచ్చే ఒక ఎరువుల బస్తా, యూరియా బస్తా కోసం చెప్పులు క్యూలో పెట్టి ఫర్టిలైజర్ దుకాణాల ముందు రైతులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. మళ్లీ ఆనాటి రోజులు తీసుకొస్తామని చెప్పిన కాంగ్రెస్ నిజంగానే ఆ పాత దుర్ధినాలను తీసుకొచ్చిందన్నారు కేటీఆర్. కరెంటు కోతలు, ట్రాన్స్ ఫార్మర్లు పేలిపోయే ఆనాటి రోజులు మళ్లీ ఇప్పుడు వచ్చాయన్నారు. ఎరువులు, విత్తనాల కోసం లైన్లో నిలబడే ఆనాటి రోజులను కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ తీసుకొచ్చిందని విమర్శించారు.



తెలంగాణ రైతులకు సున్నం పెడుతూ, తెలంగాణ రైతులను మోసం చేస్తూ గురువు చంద్రబాబుకు కృష్ణా, గోదావరి నీళ్లను రేవంత్ ఏపీకి తరలిస్తున్నాడని కేటీఆర్ విమర్శించారు. గోదావరి నీళ్లను అక్రమంగా ఏపీకి తరలించేందుకు కడుతున్న బనకచర్లకు రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని మండిపడ్డారు. ఇంతేకాదు పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా నీళ్లను దొంగ చాటుగా తీసుకెళ్తుంటే కళ్ళు మూసుకొని చంద్రబాబు కోవర్టుగా రేవంత్ వ్యవహరిస్తున్నాడని కేటీఆర్ విమర్శించారు. ఏ ప్రాజెక్టు ఏ బేసిన్లో ఉంది అని చిన్న పిల్లాడిలా ఇరిగేషన్ అధికారులను రేవంత్ అడుగుతుంటే ఇతనా మనకు న్యాయం చేసేదని రాష్ట్రంలోని రైతులు బాధపడుతున్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి నీళ్లు, నిధులు, నియామకాలు అన్న ప్రాతిపదికను ప్రొఫెసర్ జయశంకర్, కేసీఆర్ లు ఇచ్చారన్న కేటీఆర్, ఆ సిద్ధాంతాన్ని తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి వాడుతున్నాడని ఆరోపించారు. ఆంధ్రకు నీళ్లను, నిధులను ఢిల్లీకి, పంపుతూ తన తొత్తులకు నియామకాలు ఇచ్చుకొని రేవంత్ మురిసిపోతున్నాడని చెప్పారు. కాంగ్రెస్ అగ్ర నాయకత్వంతో పాటు కేంద్రంలోని బీజేపీ పెద్దలకు పైసల మూటలు మోసి రేవంత్ తన పదవిని కాపాడుకుంటున్నాడన్న సంగతి ఇవాళ తెలంగాణలోని చిన్న పిల్లలకు కూడా తెలుసన్నారు. అందుకే సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డికి పేసిఎం అని పేరు కూడా పెట్టారన్నారు.



ఎన్నికల ప్రచారంలో నోటికొచ్చిన హామీలు, వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాక కోట్లాది కుటుంబాలను కాంగ్రెస్ దగా చేసిందన్నారు కేటీఆర్. 420 హామీలు, ఆరు గ్యారంటీల అమలుకు తమది గ్యారంటీ అని బాండ్ పేపర్ మీద రాసిన కాంగ్రెస్ , ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయింది అన్నారు. 50 ఏళ్ల క్రితం ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ ని తలదన్నేలా ప్రస్తుత కాంగ్రెస్ పాలన సాగుతుందన్న కేటీఆర్, సోషల్ మీడియాలో పెట్టిన పోస్టును రీ ట్వీట్ చేసినందుకు నల్లబాలు అనే బహుజన బిడ్డను రేవంత్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందన్నారు. సోషల్ మీడియాలో పిల్లలు పోస్టులు పెడితేనే గజగజ వణికిపోతున్న రేవంత్ స్థాయికి కేసీఆర్ అవసరం లేదన్న కేటీఆర్, రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పే సత్తా బీఆర్ఎస్ లోని ప్రతీ ఒక్క నాయకుడికి ఉందన్నారు. బీఆర్ఎస్ నాయకులకు మైకు ఇవ్వకుండా అసెంబ్లీలో టైం పాస్ చేస్తున్న కాంగ్రెస్ వైఖరిని ప్రజలు ఈసడించుకుంటున్నారన్నారు.దళితులు, గిరిజనులు, పేదల పొట్ట కొడుతున్న ఈ ఇందిరమ్మ రాజ్యానికి ఘోరి కట్టడంతో పాటు రేవంత్ కు కర్రు కల్చి వాత పెట్టేందుకు ప్రజలు రెడీగా ఉన్నారని కేటీఆర్ చెప్పారు.

Politent News Web3

Politent News Web3

Next Story