500% Tariffs on India: భారత్‌పై 500 శాతం సుంకాలు.. రష్యా చమురు కొనుగోలుపై ట్రంప్ కీలక బిల్లుకు గ్రీన్ సిగ్నల్!
రష్యా చమురు కొనుగోలుపై ట్రంప్ కీలక బిల్లుకు గ్రీన్ సిగ్నల్!

500% Tariffs on India: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాపై ఒత్తిడి పెంచేందుకు మరో ముఖ్యమైన అడుగు వేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై 500 శాతం వరకు సుంకాలు విధించేలా కొత్త బిల్లుకు ఆయన ఆమోదం తెలిపారు. ఈ బిల్లు ద్వైపాక్షిక ఆంక్షల చట్టంలో భాగంగా రూపొందించబడింది.
ఈ నిర్ణయం గురించి రిపబ్లికన్ సెనెటర్ లిండ్సే గ్రాహం తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ట్రంప్‌తో భేటీ అయిన తర్వాత ఈ బిల్లుకు అధ్యక్షుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. వచ్చే వారం ఈ బిల్లుపై సెనెట్‌లో ఓటింగ్ జరగనుంది.
గ్రాహం ప్రకారం, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలు పరోక్షంగా ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధానికి నిధులు సమకూరుస్తున్నాయి. ఈ చమురు కొనుగోళ్లు రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఆర్థిక సహాయం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ బిల్లు ఆమోదం పొందితే, రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై అమెరికా 500 శాతం సుంకాలు విధించే అధికారం పొందుతుంది.
చైనా రష్యా చమురు కొనుగోలులో మొదటి స్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో ఉంది. ట్రంప్ గతంలోనే భారత్‌పై రష్యా చమురు కొనుగోలు కారణంగా 50 శాతం సుంకాలు విధించారు. ఇప్పుడు ఈ కొత్త బిల్లు ద్వారా మరింత తీవ్రమైన చర్యలు తీసుకోవాలని ఆయన భావిస్తున్నారు.
ఇంతలో భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ఆందోళన కలిగిస్తోంది. ట్రంప్ ఈ బిల్లును త్వరగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
ఈ చర్యలు ఉక్రెయిన్ యుద్ధాన్ని త్వరగా ముగించేందుకు రష్యాపై ఒత్తిడి పెంచడమే లక్ష్యమని అమెరికా వర్గాలు చెబుతున్నాయి. అయితే భారత్ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలపై ఇది ప్రభావం చూపనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

