India Issues Strong Warning: ఉగ్రవాది ఉగ్రవాదే!.. ఐరాస్ వేదికగా భారత్ హెచ్చరిక
భారత్ హెచ్చరిక

India Issues Strong Warning: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిపే పోరాటంలో ఎలాంటి రాజీ లేదని ఐక్యరాజ్యసమితి (ఐరాస్) వేదికగా భారత్ స్పష్టంగా పునరుద్ఘాటించింది. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని దృఢంగా వెల్లడించింది.
ప్రపంచ ఉగ్రవాద నిరోధక వ్యూహంపై ఐరాస్ తాజాగా నిర్వహించిన సమీక్ష సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ మాట్లాడుతూ, ‘‘ఉగ్రవాది ఉగ్రవాదే! ఉగ్రవాదాన్ని సమర్థించడానికి ఎలాంటి కారణాలు వెతకకుండా, ఈ హంతక భావజాలాన్ని సమూలంగా నిర్మూలించడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలి’’ అని పిలుపునిచ్చారు.
సీమాంతర ఉగ్రవాదం వల్ల భారత్ భారీగా నష్టపోతోందని, ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయని హరీశ్ పేర్కొన్నారు. సొంత ప్రజలకు కలిగిన వేదన భారతదేశ వైఖరిలో మార్పు తెచ్చిందని చెప్పారు. రాజకీయ కారణాలు, వ్యూహాత్మక లెక్కలతో సంబంధం లేకుండా ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో నిస్సందేహంగా ఖండించాలని ఆయన అన్నారు.
అంతర్జాతీయ సమాజం అంగీకరించిన ఫ్రేమ్‌వర్క్ లేకపోవడం వల్ల ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసికట్టుగా చర్యలు తీసుకోవడం సాధ్యం కావడం లేదని హరీశ్ ఆందోళన వ్యక్తం చేశారు. నియమనిబంధనల్లోని లోపాలను సరిద్దుకొని, ఉగ్రవాద సంస్థలకు నిధులు, ఆయుధాలు అందకుండా నిరోధించేలా కఠిన చట్టాలు రూపొందించాలని కోరారు.
ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరిని వదులుకొని, ఒక్కతాటిపైకి రావడానికి అవసరమైన రాజకీయ సంకల్పాన్ని సభ్య దేశాలు ప్రదర్శించాలని ఆయన పిలుపునిచ్చారు. డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డీప్‌ఫేక్, వర్చువల్ కరెన్సీలు, డార్క్ వెబ్ వంటి అత్యాధునిక సాంకేతికతలను ఉగ్రవాద సంస్థలు విస్తృతంగా ఉపయోగించుకుంటున్నాయని హెచ్చరించారు. ఉగ్రదాడులకు బాధితులైన వారికి పునరావాసం కల్పించే ప్రయత్నాలపై అంతర్జాతీయ సమాజం దృష్టి సారించాలని కోరారు.
ఈ వ్యాఖ్యలు ఉగ్రవాద నిర్మూలనలో భారత్ దృఢ నిర్ణయాన్ని మరోసారి బయటపెట్టాయి.

