America: అమెరికా: నియంతలకు స్థానం లేదు.. ‘నో కింగ్స్’ ఆందోళనలు ఎందుకు?
‘నో కింగ్స్’ ఆందోళనలు ఎందుకు?

America: భారీ ఆధిక్యంతో రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) పాలనా శైలిలో నియంతృత్వ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎవరినీ పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం, ఆయన బృంద సభ్యులు తమ ఇష్టానుసారం వ్యవహరించడం ఆ దేశ ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. రెండోసారి ఇలా ఉంటే, మూడోసారి పదవి కోసం ట్రంప్ కలలు కనడం వారిని మరింత కలచివేస్తోంది. దీంతో అమెరికా చరిత్రలోనే అతిపెద్ద నిరసనలు (No Kings protests) రూపుదిద్దుకున్నాయి. ఇటీవల శనివారం దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా, మిత్ర దేశాల్లో కూడా ట్రంప్‌కు వ్యతిరేకంగా ‘నో కింగ్స్’ నిరసనలు (No Kings protests) జోరుగా సాగాయి. లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి అధ్యక్షుడిపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఈ నిరసనలు ఏమిటి..?
అమెరికాతో పాటు యూరప్ దేశాల్లో అక్టోబర్ 18న సుమారు 2,700 నగరాలు, పట్టణాలు, సముదాయాల్లో ఈ ఆందోళనలు జరిగాయి. ఇందులో దాదాపు 70 లక్షల మంది పాల్గొన్నట్లు అంచనాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన నిరసనల కంటే ఇవి మరింత ఉధృతంగా సాగాయి. అమెరికాలో నియంతలకు చోటు లేదని స్పష్టం చేయడమే ఈ ఆందోళనల ముఖ్య ఉద్దేశం. ఈ నిర్వహణ కోసం ‘నో కింగ్స్.ఓఆర్‌జీ’ అనే ప్రత్యేక వెబ్‌సైట్‌ను సృష్టించారు. ‘‘నో కింగ్స్ అనేది కేవలం ఒక నినాదం మాత్రమే కాదు, మా దేశం ఆధారాలు’’ అని ఆ సైట్‌లో పేర్కొన్నారు. వీధుల నుంచి నగర బ్లాక్‌లు, గ్రామ కూడళ్ల వరకు ప్రజలంతా ఏకమై నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడాలన్నదే దీని లక్ష్యం.
ఎక్కడ సాగుతున్నాయి..?
ఈ సంస్థ 50 రాష్ట్రాల్లోని 2,700 నగరాలు, పట్టణాలు, సముదాయాల్లో నిరసనలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించింది. ఇందులో పెద్ద నగరాలు, చిన్న పట్టణాలు, సముదాయాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తమ స్థానిక ప్రాంతాల్లోనే ఆందోళన చేపట్టేలా వ్యూహాలు రచించారు. దీనికి సంబంధించిన మ్యాప్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. నిరసనకారులు అంతా పసుపు రంగు దుస్తులు, టోపీలు ధరించాలని సూచించారు. గతంలో ఉక్రెయిన్, దక్షిణ కొరియా, హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య ఉద్యమాల సమయంలో ఇలాంటి ఏకరూప వస్త్రధారణను అనుసరించారు. పసుపు రంగు ధరిస్తే గుర్తింపు సులభమవుతుందన్న కారణంతో దాన్ని ఎంపిక చేశారు. అమెరికా శక్తి పూర్తిగా ప్రజలదే, రాజులది కాదన్న సందేశాన్ని ఇవ్వడమే ఈ నిరసనల ధ్యేయం.
గూగుల్ డాక్ నుంచి జన్మించిన సంస్థే ప్రధానం..
నో కింగ్స్ నిరసనల కోసం అమెరికాలో సుమారు 200 సంస్థలు ఏకతాటిపైకి వచ్చాయి. వీటిలో ‘ఇండివైజబుల్’ సంస్థ అత్యంత ముఖ్యమైంది. 2016లో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎజెండాను అడ్డుకోవడానికి లెవిన్-లేహ గ్రీన్‌బెర్గ్ దంపతులు రూపొందించిన 23 పేజీల గూగుల్ డాక్యుమెంట్ హ్యాండ్‌బుక్‌ను ఆన్‌లైన్‌లో ప్రచురించారు. ఇది క్రమంగా విస్తరించి ఇప్పుడు ఇండివైజబుల్ సంస్థగా మారింది. నో కింగ్స్ ఆందోళనల్లో ఇది కీలక పాత్ర పోషిస్తోంది.
ఇంకా, అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్, అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టీచర్స్, ఎస్‌ఈఐ వంటి సంస్థలు ఇందులో భాగమయ్యాయి. 50501 (50 రాష్ట్రాల్లో 50 ఆందోళనలు, ఒకే ఉద్యమం) అనే సంస్థ ఈ ఏడాది మొదట్లో మొదటిసారి ‘నో కింగ్స్’ నిరసనలు చేపట్టింది. ఇది కూడా తాజా ఆందోళనల్లో పాలుపంచుకుంది. హ్యూమన్ రైట్స్ క్యాంపెయిన్, మూవ్ ఆన్, యునైటెడ్ వీ డ్రీమ్, ది లీగ్ ఆఫ్ కన్జర్వేషన్ ఓటర్స్, కామన్ డిఫెన్స్ లాంటి సంస్థలు కూడా చేతులు కలిపాయి. ట్రంప్ విమర్శకుడు జార్జ్ కాన్వే ఈ నిరసనలకు మిలియన్ డాలర్ల విరాళం అందజేశారు.
వారి ఆందోళనలు ఏమిటి..?
ట్రంప్‌లోని నియంతృత్వ ధోరణి, అవినీతిపైనే ఎక్కువ మంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. వలసదారులను దేశం నుంచి బహిష్కరించడం, దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను దెబ్బతీయడం, ధనవంతులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం వంటివి ప్రధాన కారణాలు. ప్రత్యేకించి, ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా నగరాల్లో నేషనల్ గార్డ్‌లు, మెరైన్ కమాండోలను మోహరించడం, ప్రజా ధనాన్ని వ్యక్తిగత ప్రచారానికి దుర్వినియోగం చేయడం, కోర్టులను ప్రభావితం చేయడం వంటి చర్యలు ఆందోళనలకు దారితీశాయి.
