EU US Trade Deal : యూరోపియన్ యూనియన్ తో అమెరికా భారీ వాణిజ్య ఒప్పందం
ఈయూ అధ్యక్షురాలు వాన్‌డెర్ లేయన్, ట్రంప్‌ల మధ్య అవగాహన

యూరోపియన్ యూనియన్ తో అమెరికా భారీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోకపోతే వచ్చే ఆగస్టు 1వ తేదీ నుంచి యూరోపియన్ వస్తువులపై 30 శాతం సుంకాలను విధిస్తామని గతంలో ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈయూ, యుఎస్‌ల మధ్య భారీ స్ధాయి వాణిజ్య ఒప్పందం జరిగిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించడం విశేషం. యూరోపియన్ యూనియన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ల మధ్య స్కాట్లాండ్‌లో జరిగిన సమావేశంలో ఈ ఒప్పందం కుదరినట్లు తెలుస్తోంది. ట్రంప్ విధించిన ఆగస్టు 1 గడువు సమీపిస్తున్న సమయంలో ఈ ఒప్పందం కుదరింది. యూరోపియన్ యూనియన్ తో కుదిరిన ఒప్పందం ఇరు దేశాలకు లబ్ది చేకూర్చే ఒప్పందం అని, ఇది ఆ దేశంతో కుదరిన అతి పెద్ద ఒప్పందంగా డోనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ ఒప్పందం కుదరడంతో ఇకపై ఈయూ దిగుమతులపై అమెరికా 15 శాతం సుంకం విధిస్తుందని ట్రంప్ తెలిపారు. ప్రధానంగా ఆటోమొబైల్, ఫార్మాస్యూటికల్స్, సెమీకండక్టర్ల రంగాలతో సహా అన్ని రంగాలకు వర్తిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. ఈయూతో జరిగిన ఒప్పందం వల్ల యూరోపియన్ యూనియన్ లో ఉన్న 27 దేశాలు 750 బిలియన్ డాలర్ల విలువైన ఇంధనాన్ని కొనుగోలు చేస్తాయని ట్రంప్ ప్రకటించారు. రష్యా నుంచి ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించి, రాబోయే మూడు సంవత్సరాల్లో అమెరికా నుంచి సహజ వాయువు, చమురు, అణు ఇంధనాన్ని ఈయూ పెద్ద మొత్తంలో కొనగోలు చేస్తుందని యూరోపియన్ యూనియన్ అధ్యక్షురాలు వాన్ డెర్ లేయన్ తెలిపారు.
