Indians Appointed as CEOs: హెచ్-1బీ వీసా ఫీజు భారంగా పెరిగిన వేళ.. రెండు అమెరికన్ కంపెనీలు అనూహ్య నిర్ణయం ... సీఈఓ పదవికి భారతీయులు
సీఈఓ పదవికి భారతీయులు

Indians Appointed as CEOs: హెచ్-1బీ వీసా ఫీజును 215 డాలర్ల నుంచి లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో, రెండు అమెరికా దిగ్గజ కంపెనీలు భారత సంతతి వ్యక్తులను తమ సీఈఓలుగా నియమించాయి. ఈ నిర్ణయాలు ప్రస్తుత పరిస్థితుల్లో గణనీయమైన ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
అమెరికా టెలికాం రంగ దిగ్గజం టి-మొబైల్, 55 ఏళ్ల శ్రీనీ గోపాలన్‌ను తమ కొత్త సీఈఓగా నియమిస్తున్నట్లు ప్రకటించింది. శ్రీనీ నవంబర్ 1 నుంచి విధుల్లో చేరనున్నారు. ఐఐఎం అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి అయిన శ్రీనీ, ప్రస్తుతం టి-మొబైల్‌లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. హిందుస్థాన్ యునిలివర్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీగా తన కెరీర్ ప్రారంభించిన ఆయన, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, క్యాపిటల్ వన్, డ్యూష్ టెలికామ్ వంటి సంస్థలలో కీలక పదవులు నిర్వహించారు. సీఈఓగా ఎంపిక కావడం పట్ల శ్రీనీ ఆనందం వ్యక్తం చేస్తూ, తాను పనిచేస్తున్న సంస్థకు నాయకత్వం వహించడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.
ఇక చికాగోకు చెందిన పానీయాల సంస్థ మల్సోన్ కూర్స్ కూడా 49 ఏళ్ల రాహుల్ గోయల్‌ను తమ సీఈఓగా నియమిస్తున్నట్లు ప్రకటించింది. మైసూర్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన రాహుల్, గత 24 ఏళ్లుగా మల్సోన్ కూర్స్‌లో వివిధ పదవులు నిర్వహిస్తున్నారు. కంపెనీని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు, ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు రాహుల్ తెలిపారు.
హెచ్-1బీ వీసా ఫీజు పెంపు
హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచిన నిర్ణయం ఐటీ రంగంలో తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఈ కొత్త నిబంధన సెప్టెంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చింది. అధ్యక్షుడు ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఒక ఏడాది పాటు అమల్లో ఉంటుంది. ఈ లోపు అమెరికా కాంగ్రెస్ చట్టం ఆమోదిస్తే, ఈ నిబంధన పూర్తిస్థాయిలో కొనసాగుతుంది. భారతదేశం నుంచి హెచ్-1బీ వీసాపై అమెరికాకు వెళ్లే ఉద్యోగుల సగటు వార్షిక వేతనం 60,000 నుంచి 140,000 డాలర్ల మధ్య ఉంటుంది. ఈ పరిస్థితుల్లో, ఒక ఉద్యోగికి లక్ష డాలర్ల ఫీజు చెల్లించడం కంపెనీలకు సవాలుగా మారనుంది. అయితే, వైద్యం, ఆరోగ్య పరిశోధన, రక్షణ వంటి కీలక రంగాలకు ఈ ఫీజు నుంచి మినహాయింపు ఉండవచ్చని సమాచారం.
