చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన ఖోకన్ చంద్ర దాస్

Another Attack on Hindu Trader in Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో మరో దుర్ఘటన చోటుచేసుకుంది. ఖోకన్ చంద్ర దాస్ (50) అనే హిందూ వ్యాపారిపై దుండగులు జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించారు. ఈ ఘటన దేశంలోని మైనారిటీల భద్రతపై మరింత ఆందోళన కలిగిస్తోంది.

ఖోకన్ చంద్ర దాస్ షరియత్‌పూర్ జిల్లాలోని క్యూర్‌బంగా బజార్‌లో ఔషధ దుకాణం, మొబైల్ బ్యాంకింగ్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. గత బుధవారం సాయంత్రం దుకాణం మూసివేసి ఆటోరిక్షాలో ఇంటికి వెళుతుండగా, మార్గమధ్యలో దుండగులు ఆటోను ఆపి ఆయనపై దాడి చేశారు. పదునైన ఆయుధాలతో దాడి చేసిన అనంతరం, తలపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దాడికి గురైన ఖోకన్, ప్రాణాలు కాపాడుకునేందుకు రోడ్డు పక్కన ఉన్న చెరువులోకి దూకారు. స్థానికులు ఆయనను రక్షించి ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్ర కాలిన గాయాలతో చికిత్స పొందుతూ ఆయన మరణించారు.

ఖోకన్ భార్య సీమా దాస్ మాట్లాడుతూ, "మాకు ఎవరితోనూ శత్రుత్వం లేదు. ఎందుకు ఇలా దాడి చేశారో అర్థం కావడం లేదు" అని బాధపడ్డారు. ఈ ఘటన రెండు వారాల్లో హిందూ మైనారిటీలపై జరిగిన నాలుగో దాడిగా నమోదైంది.

బంగ్లాదేశ్‌లో విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హాదీ హత్యతో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఈ దాడులు జరుగుతున్నాయి. ఇటీవల దీపూ చంద్ర దాస్, సామ్రాట్, బజేంద్ర బిశ్వాస్‌లు కూడా ఇలాంటి దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. దేశంలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో హిందువులపై వరుస దాడులు ఆందోళనకరంగా మారాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story