H-1B Visa: H-1B వీసాపై ట్రంప్ నుంచి మరో సంచలన నిర్ణయం..?
మరో సంచలన నిర్ణయం..?

H-1B Visa: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసాలపై మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే H-1B వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచిన ట్రంప్ ప్రభుత్వం, ఇప్పుడు లాటరీ విధానాన్ని రద్దు చేయాలని యోచిస్తోంది. పాత లాటరీ సిస్టమ్‌ను పూర్తిగా తొలగించి, దాని బదులుగా జీతం ఆధారిత ఎంపిక ప్రక్రియను తీసుకురావాలని అమెరికా అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే, ఎక్కువ జీతాలు పొందే ఉద్యోగులకు H-1B వీసా లాటరీలో ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. తక్కువ జీతాలు ఉన్నవారికి మాత్రం ఒకే ఒక్క అవకాశం మాత్రమే ఉంటుంది. అధిక నైపుణ్యం మరియు ఎక్కువ వేతనం ఉన్న ఉద్యోగులకు ఈ 'వెయిటెడ్ సెలక్షన్ ప్రాసెస్' ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. అయితే, అన్ని జీతాల స్థాయిల్లోని ఉద్యోగులకు వీసా పొందే అవకాశం కంపెనీలకు ఉంటుందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ తెలిపింది.
H-1B వీసాల ఎంపికను నాలుగు జీతాల స్థాయిల్లో చేస్తారు. వార్షిక జీతం 1,62,528 డాలర్లు పొందుతున్న ఉద్యోగులకు నాలుగు ఎంట్రీలు లభిస్తాయి, దీంతో వారికి వీసా పొందే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. 70 వేల డాలర్ల కంటే తక్కువ జీతం ఉన్నవారికి కేవలం ఒక్క ఎంట్రీ మాత్రమే ఉంటుంది. ఈ విధానం వల్ల పెద్ద కంపెనీలు అధిక నైపుణ్యం ఉన్నవారిని నియమించుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, కానీ స్టార్టప్ కంపెనీలకు ఇది ప్రతికూలంగా పరిణమిస్తుంది.
ఈ మార్పులతో అమెరికన్ నిపుణులు ఎక్కువ జీతాలు పొందేలా చేయాలన్నది ట్రంప్ ఉద్దేశం. సరళంగా చెప్పాలంటే, కొత్త లాటరీ సిస్టమ్ వచ్చిన తర్వాత ఇటీవల చదువు పూర్తి చేసిన భారతీయ విద్యార్థులు మరియు అమెరికాలో 70 వేల డాలర్ల కంటే తక్కువ జీతంతో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులకు కష్టకాలం రానుంది.
