అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం - చిన్నారి సహా ముగ్గురు దుర్మరణం
Another shooting in America - Three dead, including a child

అమెరికా మళ్లీ తుపాకీ ధాటికి నెత్తురోడింది. ఉటా రాష్ట్రంలోని వెస్ట్ వ్యాలీ సిటీలో ఆదివారం రాత్రి జరిగిన ఓ కార్నివల్ వేడుక మృతుల రోదనతో దద్దరిల్లింది. 'వెస్ట్‌ఫెస్ట్' పేరిట సెంటెనియల్ పార్క్‌లో జరుగుతున్న వార్షిక కర్నివాల్‌లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు దుర్మరణం చెందగా, ఇద్దరు గాయపడ్డారు.
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ దాడి ఎటువంటి యాదృచ్ఛిక ఘటన కాదని, పక్కా వ్యూహంతో జరిపిన కాల్పులే అని తెలుస్తోంది. కాల్పుల్లో 8 నెలల పసికందు ఎజ్రా పంతలియోన్, 20 ఏళ్ల పాల్ తాహి, 21 ఏళ్ల ఏంజెలికా చావెజ్ ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఘటనాస్థలికి వెంటనే సహాయక బృందాలు చేరుకొని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించాయి. ఈ ఘటనపై వెస్ట్ వ్యాలీ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలోనే ఈ కాల్పులు జరిగి ఉండొచ్చని గ్యాంగ్ వార్ కోణంలో విచారణ కొనసాగుతోంది.
ఈ ఘటనతో అమెరికాలో తుపాకుల నియంత్రణపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవలి కాలంలో ఫిలడెల్ఫియా, బాల్టిమోర్ లాంటి నగరాల్లో చోటుచేసుకున్న సామూహిక కాల్పుల వాస్తవం మరవకముందే ఉటాలో జరిగిన ఈ దాడి, దేశవ్యాప్తంగా భద్రతా పరిస్థితులపై ఆందోళన కలిగిస్తోంది.
