హనుక్కా వేడుకల్లో 12 మంది మృతి!

Australia: ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం బాండి బీచ్‌లో ఆదివారం సాయంత్రం దారుణమైన కాల్పుల ఘటన జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం దాదాపు 6:30 గంటల సమయంలో ఇద్దరు దుండగులు బీచ్ ప్రాంతంలోకి చొరబడి విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో కనీసం 12 మంది మరణించగా, 29 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనను అధికారులు ఉగ్రదాడిగా ప్రకటించారు.

పర్యాటకులతో కిక్కిరిసిన బాండి బీచ్‌లో యూదులు జరుపుకునే హనుక్కా (చానుకా) ఉత్సవాలు జరుగుతున్న సమయంలో ఈ దాడి చోటుచేసుకుంది. నల్లటి దుస్తులు ధరించిన ఇద్దరు దుండగులు షాట్‌గన్‌లతో బాండి పెవిలియన్ సమీపంలోని పార్క్ ప్రాంతంపైకి చేరుకొని కాల్పులు ప్రారంభించారు. హనుక్కా మొదటి రోజు వేడుకలకు వేలాది మంది యూదులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్నే లక్ష్యంగా చేసుకొని దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఘటనాస్థలానికి తరలివచ్చిన భద్రతా బలగాలు రెండుగంటల పోరాటం అనంతరం పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. దుండగుల్లో ఒకరు పోలీసుల కాల్పుల్లో మరణించగా, మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గాయపడినవారిని రక్షించేందుకు 30కి పైగా అంబులెన్స్‌లు, హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. గాయాల్లో పిల్లలు, పోలీసు అధికారులు కూడా ఉన్నారు.

ఈ ఘటనలో ధైర్యం చూపిన ఓ స్థానికుడు దుండగుల్లో ఒకరి వెనుక నుంచి వచ్చి ఆయుధాన్ని లాగేసుకొని అడ్డుకున్నాడు. ఈ సాహసోపేత చర్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఈ దాడిని "దుర్మార్గమైన యాంటీసెమిటిజం చర్య"గా ఖండించారు. "బాండి బీచ్‌లో జరిగిన ఈ దాడి దేశాన్ని కలచివేసింది. యూదు సమాజాన్ని లక్ష్యంగా చేసుకున్న ఈ ఉగ్రవాద చర్యకు మేం తలొంచము" అని ఆయన పేర్కొన్నారు. న్యూసౌత్ వేల్స్ ప్రీమియర్ క్రిస్ మిన్న్స్ కూడా యూదు సమాజంతో సంఘీభావం తెలిపారు.

ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. దుండగుల్లో ఒకరు భద్రతా సంస్థలకు ముందు నుంచీ తెలిసినవాడని అధికారులు వెల్లడించారు. ఆస్ట్రేలియాలో అరుదైన ఈ దారుణ ఘటన దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతి రేకెత్తించింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story