తారిక్ రహ్మాన్‌కు డబుల్ గెలుపు

ఎన్నికల్లో బీఎన్‌పీ ఆధిక్యం.. జమాత్‌కు పరిమిత స్థానాలు.. మరో హిందూ యువకుడి హత్య


BangladeshElections: బంగ్లాదేశ్‌లో జరిగిన తాజా పార్లమెంటు ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) భారీ విజయం సాధించే దిశగా దూసుకెళ్తోంది. ఓట్ల లెక్కింపు పురోగమిస్తున్న నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి నాటికి బీఎన్‌పీ 175కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అదే సమయంలో దాని మిత్రపక్షమైన జమాత్-ఏ-ఇస్లామీ పార్టీ మాత్రం 30 స్థానాలకే పరిమితమైంది.

బీఎన్‌పీ ఛైర్‌పర్సన్ ఖాలిదా జియా కుమారుడు తారిక్ రహ్మాన్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండింటా విజయం సాధించారని సమాచారం. ఈ ఫలితాలతో ఆయనే తదుపరి ప్రధానమంత్రి అవుతారనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఉదయం 7.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు 299 పార్లమెంటు స్థానాల్లో ఓటింగ్ జరిగింది. దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ ప్రక్రియ పూర్తయింది. సుమారు 12.7 కోట్ల మంది ఓటర్లు నమోదైన ఈ ఎన్నికల్లో 50 శాతానికి పైగా పోలింగ్ నమోదైందని తెలుస్తోంది. అయితే కొన్ని చోట్ల చిన్నచిన్న హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.

ఈ ఎన్నికలతో పాటు మహమ్మద్ యూనస్ ప్రభుత్వం రూపొందించిన నేషనల్ చార్టర్ 2025పై, 84 సంస్కరణల ప్యాకేజీపై ప్రజాభిప్రాయ సేకరణ కూడా నిర్వహించారు.

మరో హిందూ హత్య ఘటన:

ఇక బంగ్లాదేశ్‌లో మళ్లీ హిందూ యువకుడు హత్యకు గురయ్యాడు. మౌల్విబజార్ జిల్లాలోని తేయాకు తోటలో కార్మికుడిగా పనిచేస్తున్న 28 ఏళ్ల రతన్ షువోకర్‌ను దారుణంగా హత్య చేశారు. చేతులు, కాళ్లు కట్టేసి రక్తపు మడుగులో పడి ఉన్న ఆయన మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ ఘటనతో హిందూ సమాజంలో భయాందోళన వాతావరణం నెలకొంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story